Jul 14,2022 06:33

బుధవారం నాడు పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్సె మిలిటరీ జెట్‌లో మాల్దీవులకు పారిపోయినట్లు వార్తలు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని విక్రమ సింఘే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశాడు. సోమవారం రాత్రి దుబాయి పారిపోయేందుకు చేసిన యత్నాన్ని ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది విఫలం చేశారని కొన్ని వార్తలు రాగా, అమెరికా వీసా నిరాకరించిందని మరికొన్ని వార్తలు. దాంతో సముద్ర మార్గం ద్వారా దేశం విడిచి పోవాలని చూశాడు. చివరకు మిలిటరీలో తనకు అనుకూలురైన వారి సహకారంతో దేశం వదలి వెళ్లాడు. గొటాబయ పరారీకి మన దేశం సహకరించిందన్న వార్తలను విదేశాంగ శాఖ ఖండించింది. అతగాడి ఆచూకీ గురించి చెప్పేందుకు మాల్దీవుల సర్కార్‌ కూడా తిరస్కరించింది. అక్కడి నుంచి మరో దేశానికి వెళ్లవచ్చని వార్తలు వచ్చాయి.
రాజీనామా డిమాండ్‌ చేసిన పౌరుల ఆందోళన కారణంగా శుక్రవారం రాత్రి అధ్యక్ష నివాసం నుంచి ఒక సైనిక నౌకా కేంద్రానికి గొటాబయ వెళ్లాడు. అక్కడి నుంచి కటునాయకే సైనిక వైమానిక కేంద్రానికి తరలించారు. తదుపరి రెండు మిలిటరీ హెలికాప్టర్లలో గొటాబయ పరివారం సోమవారం నాడు కొలంబో విమానాశ్రయానికి వెళ్లింది. ఎందుకన్నది అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా దుబాయి పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది ప్రముఖులు ఉండే గదికి వెళ్లి గొటాబయ పాస్‌పోర్టుపై ముద్రవేసేందుకు తిరస్కరించారని, తాను పౌరులు ప్రయా ణించే విమానాలు ఎక్కనంటూ గొటాబయ తిరస్కరించినట్లు, తరువాత మధ్య ప్రాచ్యానికి నాలుగు విమానాలు గొటాబయ లేకుండానే వెళ్లినట్లు వార్తలు. లంక అధ్యక్ష పదవిలో ఉన్న వారిని అరెస్టు చేసేందుకు అక్కడి నిబంధనలు అంగీకరించవు. దీన్ని అవకాశంగా తీసుకొని పారిపోయే ఎత్తుగడతోనే బుధవారం నాడు పదవి నుంచి తప్పుకుంటు న్నట్లు ముందస్తు తేదీ వేసిన రాజీనామా లేఖను ముందుగానే అందచేశారని చెబుతున్నారు. ఈ నెల 20వ తేదీ నాటికి అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
విదేశీ రుణం 51 బిలియన్‌ డాలర్లకుగాను జూన్‌లో చెల్లించాల్సిన 8.6 బిలియన్‌ డాలర్ల కిస్తీ చెల్లింపులో లంక సర్కార్‌ విఫలమైంది. ఐఎంఎఫ్‌, ఇతర సంస్థలు, దేశాలతో కొత్త రుణాల కోసం చేస్తున్న సంప్రదింపులు ఇంకా కొలిక్కి రాలేదు. 'సార్థక ప్రజాస్వామిక పాలన'ను ప్రోత్సహించే పేరుతో అంతర్జాతీయ అభివృద్ధి కోసం పనిచేసే అమెరికా సంస్థ (యుఎస్‌ఎయిడ్‌) నుంచి నిధులు పొందేందుకు లంక అంగీకరించింది. గతంలో ఈ సహాయాలను పొందేందుకు చెప్పిన అభ్యంతరాలను పక్కన పెట్టింది. గొటాబయ సర్కారు అమెరికాతో చేసుకున్న ఒప్పందం పారదర్శకంగా లేదు. మంత్రివర్గం ముందు ప్రతిపాదనలు ఉంచటం తప్ప బహిరంగ పరచలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి అమెరికా సాయం చేసినా షరతులు, దానికి ఆర్థిక లబ్ధి లేకుండా ఒప్పందాలు చేసుకోలేదు. తక్షణం సంక్షోభం నుంచి బయట పడేందుకు ఎలాంటి ప్రమాదకర షరతులు అంగీకరించారో అన్న అనుమానాలు ఉన్నాయి. ఐఎంఎఫ్‌తో జూన్‌ 30 నాటికి పది రోజుల పాటు చర్చలు ముగిశాయి. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఈ లోగా లంకలో కొత్త రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇవేవీ తేలకుండానే గొటాబయ పరారీ, ఇతర పరిణామాలు సంభవించాయి.
శ్రీలంక పరిణామాలకు కుటుంబ పాలనే కారణమనే సూత్రీకరణలు, సంక్షేమ పథకాల అమలు వల్లనే సంక్షోభం తలెత్తిందనే రాగాలూ వినిపిస్తున్నాయి. అవినీతి, అక్రమాలు జరిగినప్పటికీ నిజానికి లంక సమస్య తప్పుడు విధానాల వలన తలెత్తింది. దీనికి కరోనా, ఇతర కారణాలు కూడా తోడయ్యాయి. దేశ జిడిపి లో పన్నెండు శాతం సమకూర్చే టూరిజం 2019లో జరిగిన ఉగ్రవాద చర్యల కారణంగా దెబ్బతిన్నది. దీనికి కరోనా తోడైంది. విదేశాల్లో పని చేసే శ్రీలంక వాసులు పంపే మొత్తాలు జిడిపి లో 8-10 శాతం ఉండేవి. కరోనాతో అవి కూడా నిలిచిపోయాయి. 2019లో అధికారానికి వచ్చిన గొటాబయ ప్రకటించిన పన్నుల రాయితీ కారణంగా పన్ను చెల్లించే ధనికుల సంఖ్య 15 నుంచి నాలుగు లక్షలకు తగ్గింది. వ్యాట్‌ను 15 నుంచి 8 శాతానికి తగ్గించాడు, మరో ఏడు పన్నులను రద్దు చేశాడు. వాటిలో ఒకటి దేశ పునర్‌నిర్మాణానికి కార్పొరేట్ల నుంచి వసూలు చేస్తున్న రెండు శాతం పన్ను. రసాయన ఎరువుల దిగుమ తులు నిలిపివేసిన కారణంగా పంటలు దెబ్బతిని ఆహార కొరత ఏర్పడింది. ప్రపంచంలో తలెత్తిన సంక్షోభం కారణంగా వివిధ ప్రాజక్టుల మీద కూడా ఆశించిన రాబడి రాలేదు. ఇలా విధానపరమైన తప్పిదాలే లంకను దెబ్బతీశాయి.
శ్రీలంక సంక్షోభానికి మూలం చైనా ఇచ్చిన అప్పులు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఇది తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. అనేక దేశాలు గతంలో లంక మాదిరే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. వాటిలో ఏ ఒక్క దానికీ చైనా రుణాలు ఇవ్వలేదు. 1990 దశకంలో ఆసియా టైగర్‌గా పేరు తెచ్చుకున్న ఇండోనేషియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి తిరిగి కోలుకున్నది. 1960 దశకం నుంచి ఇప్పటి వరకు 147 దేశాలు రుణ చెల్లింపుల్లో విఫలం చెందినట్లు ప్రపంచ ఆర్థిక వేదిక సమాచారం పేర్కొన్నది. కంపెనీలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేనట్లుగానే ప్రభుత్వాలు కూడా అప్పులు చేసి సకాలంలో కిస్తీ చెల్లించకపోతే దివాలా తీసినట్లు భావిస్తారు. చరిత్రలో 1557లో తొలిసారిగా స్పెయిన్‌ దివాలా ప్రకటించింది. తరువాత పద్దెనిమి, పందొమ్మిదవ శతాబ్దాలలో 15 సార్లు సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోయింది. వర్తమానంలో లాటిన్‌ అమెరికా దేశమైన అర్జెంటీనా 2001లో 132 బిలియన్‌ డాలర్లు, తరువాత 2016, 2020లో కూడా రుణాలను చెల్లించలేక చేతులెత్తేసింది. సోవియట్‌ విచ్ఛిన్నం తరువాత 1998లో రష్యాకూ అదే పరిస్థితి ఎదురైంది. ఉక్రెయిన్‌ 1998, 2020లో, ఈక్వెడార్‌ 2008, 2020లో, మెక్సికో 1982, 1995లో, జమైకా 2010లో శ్రీలంక పరిస్థితినే ఎదుర్కొన్నాయి.
1960, 70 దశకాల్లో అనేక లాటిన్‌ అమెరికా దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి పారిశ్రామికీకరణ కోసం రుణాలు తీసుకున్నాయి. 1975-83 కాలంలో వాణిజ్య బాంకుల నుంచి లాటిన్‌ అమెరికా దేశాలు తీసుకున్న రుణాలు ఏటా 20 శాతం పైగా పెరిగాయి. రుణ మొత్తం 75 నుంచి 315 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇది ఆ ప్రాంత జిడిపి లో 50 శాతం. ఇదే కాలంలో వడ్డీ రేట్లు కూడా పెరగటంతో వడ్డీ, అసలు చెల్లింపు ఏటా 12 నుంచి 66 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ దేశాలేవీ చైనా నుంచి రుణాలు తీసుకోలేదు. మన కరెన్సీ విలువ పతనం కారణంగా విదేశాలకు చెల్లించాల్సిన డాలర్ల కొనుగోలు ధర పెరిగి ఎక్కువ మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది. తాజా సమాచారం ప్రకారం మన దేశానికి ఉన్న 621 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణంలో స్వల్పకాలిక రుణాల మొత్తం 267 డాలర్లు ఉంది, రానున్న తొమ్మిది మాసాల్లో దీన్ని తీర్చాల్సి ఉంది. రూపాయి విలువ పతనం కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు రుణాల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని కోసం కొత్త రుణాలు తీసుకోవాలి లేదా ఆస్తులను తెగనమ్మి చెల్లించాలి. డాలరు విలువ, అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్న కారణంగా కొత్త రుణాలు మరింత భారంగా మారతాయి. రుణదాతలు కఠినమైన షరతులు విధిస్తారు. ఐఎంఎఫ్‌ లేదా ప్రపంచబ్యాంకు జోక్యాలను అంగీకరించాలని, వాటి షరతులను అమలు జరపాలని డిమాండ్‌ చేస్తాయి. ఆ సంస్థలు రుణాలు తీసుకున్న దేశాలు తమ మార్కెట్లను మరింతగా తెరవాలని, సంక్షేమ పథకాలకు కోత పెట్టాలని, ప్రభుత్వ రంగాల ప్రయివేటీకరణ, కార్పొరేట్లకు అనుకూలగా చట్టాల సవరణ వంటి అనేక అంశాలను రుద్దుతాయి. ఈ సంస్థల్లో పెట్టుబడులు ఎక్కువ భాగం ధనిక దేశాలవే ఉంటాయి గనుక వాటి ప్రయోజనాలను ముందుకు తెస్తాయి. శ్రీలంకకు మన దేశం చేస్తున్న సాయాన్ని చూపి అదానీ కంపెనీకి విద్యుత్‌ ప్రాజెక్టును అప్పగించాలని ప్రధాని నరేంద్రమోడీ వత్తిడి తెచ్చినట్లు వచ్చిన వార్తల గురించి తెలిసిందే.
శ్రీలంక విషయానికి వస్తే ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకోవాలని గొటాబయ సర్కార్‌ నిర్ణయించి ఏప్రిల్‌ నుంచే సంప్రదింపులు ప్రారంభించింది. ఐబిఎఫ్‌డి (ఇంటర్నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఫిస్కల్‌ డాక్యుమెంటేషన్‌-నెదర్లాండ్స్‌) సంస్థ మే 31న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో లంక సర్కార్‌ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించింది. ప్రభుత్వ రాబడిని పెంచేందుకు అక్టోబరు ఒకటి నుంచి అమలు లోకి వచ్చే విధంగా వ్యాట్‌ను ఎనిమిది నుంచి పన్నెండు శాతానికి పెంచింది. వ్యాట్‌ చెల్లించాల్సిన సంస్థల నమోదుకు లావాదేవీల ప్రారంభాన్ని 30 నుంచి 12 కోట్లకు తగ్గించారు. కార్పొరేట్‌ పన్ను 24 నుంచి 30 శాతానికి పెంచింది. 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి దేశీయ కంపెనీలు విదేశీ వ్యక్తులకు చెల్లించే డివిడెండ్లను ఆదాయ పన్ను పరిధి లోకి తెచ్చారు. టాక్స్‌ హాలిడేలను, పన్ను రాయితీలను కొన్ని రంగాలకు మినహాయించారు.
వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు రాయితీ మొత్తాన్ని రూ.30 లక్షల నుంచి 18 లక్షలకు తగ్గించారు. ఆదాయ పన్ను విధింపు రూ.30 నుంచి గాక పన్నెండు లక్షల నుంచే ప్రారంభిస్తారు. ఇలాంటివే మరికొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. ఇవన్నీ ఐఎంఎఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థలను ప్రసన్నం చేసుకొనేందుకే. గతంలో గొటాబయ సర్కార్‌ కార్పొరేట్లకు అప్పనంగా రాయితీలు ఇచ్చిందని, పన్ను చెల్లించగలిగిన వారికి మినహాయింపులిచ్చి ఖజానాను గుల్లచేసిందనే విమర్శలు ఉన్నాయి. పైన పేర్కొన్న అంశాలు గతంలో చేసిన వాటిని కొన్నింటిని సవరించినట్లు కనిపిస్తున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లుగా సామాన్య జనంపై భారాలు మోపే వ్యాట్‌ పెంపుదల వంటివి కూడా ఉన్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం చూసినపుడు ఐఎంఎఫ్‌ షరతుల వలన కార్మికుల నిజ వేతనాలు పడిపోవటం, భారాలు పెరగటం వంటి పరిణామాలను, వాటికి ప్రతిఘటన పోరాటాలను చూశాం.
ఇప్పుడు లంక పాలకుల అస్తవ్యస్త విధానాల మీద జనం చేసిన తిరుగుబాటు రేపు భారాలకు వ్యతిరేకంగా కూడా పునరావృతం అవుతుంది.

mkr

 

 

 

ఎం. కోటేశ్వరరావు
వ్యాసకర్త సెల్‌: 8331013288