
యువతరానికి స్ఫూర్తి ప్రదాత చే గువేరా పేరు వినని వారుండరు. ఆయన జీవితం, కృషి తెలియకపోయినా, రచనలు చదవకపోయినా ఆ పేరు వింటేనే స్ఫూర్తి పొందే వారి సంఖ్య మన దేశంలోను, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే ఉంది. ఫైడల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా విప్లవానికి నేతృత్వం వహించిన ధీశాలి చే. ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, గెరిల్లా వ్యూహకర్త. 1959 జనవరి 1న బటిస్టా నిరంకుశత్వ కోరల నుండి విముక్తి అయిన క్యూబాకు ఆయన తొలి ఆర్థిక మంత్రి. మంత్రి హోదాలో భారతదేశాన్ని కూడా ఆయన సందర్శించాడు. క్యూబా విప్లవంతో సంతృప్తి చెందకుండా అమెరికా సామ్రాజ్యవాద అమానుష దోపిడీ నుండి మొత్తం లాటిన్ అమెరికాను విముక్తి చేయాలని సంకల్పించాడు. అంతకు ముందు 19వ శతాబ్దంలో స్పానిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన జోష్ మార్టి స్ఫూర్తితో పదవిని త్యజించి లాటిన్ అమెరికా విముక్తికై పోరు బాట పట్టాడు. గెరిల్లా పోరాటం సాగిస్తున్న సమయంలో సిఐఏ కుట్రకు బలై 1976 అక్టోబరు 9న బొలీవియాలో అమరుడయ్యాడు. నాటి నుండి నేటి వరకు లాటిన్ అమెరికా గడ్డ మీద ఆయన పేరు మారుమోగుతూనే ఉంది.
1928 జూన్ 14వ తేదీన అర్జెంటీనాలో జన్మించిన చే గువేరా మెడికల్ విద్యార్థిగా అనేక ఉద్యమాలు నిర్వహించాడు. లాటిన్ అమెరికా ప్రజల జీవితాలను అధ్యయనం చేయడానికి 1952లో అత్యంత ప్రాచుర్యం పొందిన మోటార్ సైకిల్ యాత్రను సాగించాడు. ఆయన రాసిన మోటార్ సైకిల్ డైరీలు ఇప్పటికీ అధ్యయనానికి మార్గదర్శిగా ఉంటాయి. చే గువేరా వారసురాలిగా ఆయన కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తేఫానియా గువేరా రేపు మొదటిసారి విజయవాడ నగరాన్ని సందర్శించనున్నారు. ఇప్పటికే విజయవాడ ప్రముఖులతో ఆహ్వాన సంఘం ఏర్పడి వారిద్దరికీ ఘన స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్నది. ఆమె భారత పర్యటన సందర్భంగా కేరళలో గౌరియమ్మ తొలి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి సహజంగానే ఉంటుంది.
డా|| అలైదా గువేరా కేవలం చే కుటుంబ వారసురాలు మాత్రమే కాదు. ఆయన ఆశయాలను కూడా పుణికి పుచ్చుకున్న రాజకీయ వారసురాలు కూడా. మానవ హక్కుల ఉద్యమంలో ప్రముఖ నాయకురాలు. వికీపీడియాలో వచ్చిన వివరాలను బట్టి 1960 నవంబర్ 24న చే గువేరా, అలైదా మార్చ్ దంపతులకు జన్మించిన పెద్ద కుమార్తె. ఆమె ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు. హవానాలో ప్రఖ్యాతి గాంచిన విలియం సోలర్ పిల్లల ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. క్యూబా లోనే కాకుండా అంగోలా, ఈక్వెడార్, నికరాగువా తదితర దేశాల్లో కూడా ఆమె వైద్య సేవలందించారు. వైద్య రంగంపై ఆమెకున్న అంకిత భావం, సాధికారత మైఖేల్ మూర్ (హాలీవుడ్ దర్శకుడు) నిర్మించిన ''సికో'' డాక్యుమెంటరీ చిత్రంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే అర్ధమవుతుంది. ఆరోగ్య సంరక్షణపై ఆమెకు సమగ్ర అవగాహన ఉంది. వైద్య రంగంలోనే కాకుండా మానవ హక్కులు, వర్ధమాన దేశాల రుణ విముక్తి తదితర అంశాలపై ఆమె అధ్యయనం చేశారు. గతంలో భారత దేశాన్ని పలు సందర్భాల్లో సందర్శించి ఉపన్యసించారు. అనేక దేశాల్లో క్యూబా సంఘీభావ సభల్లో పాల్గొన్నారు. మరలా 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతదేశానికి వస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరైన ఎస్తేఫానియా (అర్థశాస్త్రంలో అధ్యాపకురాలు) ఆమెతో విజయవాడకు వస్తున్నారు.
అలైదా నాలుగున్నర సంవత్సరాల వయసులో చే గువేరా క్యూబాను వదిలి లాటిన్ అమెరికా విముక్తికై కాంగోకు బయలుదేరి వెళ్ళాడు. ఆయన చనిపోయే నాటికి అలైదాకు 7 సంవత్సరాల వయసు. ఈ రెండున్నరేళ్ళలో మధ్యలో ఒకసారి రహస్యంగా వచ్చి కలుసుకున్నాడు. పోరాటంలో నిండా మునిగి ఉంటూనే తండ్రిగా చే గువేరా తన బిడ్డల్ని ఉత్తరాల ద్వారా ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడు. చిన్న పిల్లల కథలు, డ్రాయింగ్స్ ద్వారా అభ్యుదయ భావాలను వ్యక్తీకరించేవాడు. అమలు జరపని వాగ్దానాలు చేయవద్దని అలైదా తమ్ముడు కేమిలోకు రాసిన ఉత్తరాల్లో చెప్పాడు. చే గువేరా రచనల ద్వారా ఉత్తేజితురాలైన అలైదా తన జీవితాన్ని కూడా అందుకు అనుగుణంగా మలుచుకున్నారు. ఆ స్ఫూర్తితోనే అంగోలా మెడికల్ మిషన్‌లో భాగస్వామి అయ్యారు. 2004లో వెనిజులాలో మిలటరీ తిరుగుబాటును ఎదుర్కొని తిరిగి అధ్యక్ష పీఠం ఎక్కిన హ్యూగో చావెజ్‌తో ఆమె ఇంటర్వ్యూ చాలా ప్రసిద్ధి చెందింది. ఆమె రాసిన పుస్తకం ''చావెజ్, వెనిజులా, నూతన లాటిన్ అమెరికా''ను ఆ తరువాత డాక్యుమెంటరీగా కూడా మలిచారు. క్యూబాలో వికలాంగులు, అనాథ పిల్లల కోసం రెండు ఆశ్రమాలను 2009 నుండి నడుపుతున్నారు. ఆమె రాక సందర్భంగా మన రాష్ట్ర ప్రజలు మరోసారి క్యూబా గురించి, ఆ దేశంపై అమెరికా పెత్తందారీతనంతో విధించిన కఠోర ఆంక్షల రాక్షసత్వాన్ని గురించి తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది.
చెరకు ప్రధాన పంటగా ఉండే క్యూబా 1959కి ముందు బటిస్టా నిరంకుశత్వ పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. తమ కళ్ళెదుటే సహజ సంపదలన్నింటినీ అమెరికా బడా కంపెనీలు దోచుకుపోతుండేవి. దీనికి అమెరికా ప్రభుత్వం గట్టి దన్నుగా ఉండేది. ఈ నిలువు దోపిడీని చూస్తూ ఊరుకోలేని ప్రజలు అనేక తిరుగుబాట్లు చేశారు. అనేక సార్లు విఫలమయ్యారు. ప్రజలు దారుణంగా అణచివేయబడ్డారు. వేల మంది ప్రాణాలర్పించారు. శవాల్ని సముద్రంలోకి అమానుషంగా తోసేసేవారు. 1950లలో ఈ పోరాటాలు తిరిగి పుంజుకుని సంఘటితమయ్యాయి. 1953లో క్యాస్ట్రో, రావుల్ క్యాస్ట్రో సహా 70 మంది మద్దతుదారులతో బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చేందుకు సాయుధ తిరుగుబాటు చేశారు. తర్వాత పట్టుబడి జైలు పాలయ్యారు. రెండు గంటలపాటు కోర్టులో చేసిన వాదన 'హిస్టరీ విల్ అబ్సాల్వ్ మి' (ష్ట్రఱర్‌శీతీy షఱశ్రీశ్రీ abరశీశ్రీఙవ ఎవ) చారిత్రక పత్రంగా మారింది. 1955లో విడుదలయ్యాక 1956లో మరలా చే తో కలిసి 80 మందితో గ్రాన్మా నుండి పోరాటం ఆరంభించారు. మెక్సికో నుండి ఓడల ద్వారా రహస్యంగా వీరు క్యూబాకు చేరుకున్నారు. ఇది విఫలమైన తరువాత జైలు నుండి విడుదలై 1958లో ప్రజలను కూడగట్టి సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. 1959 జనవరి 1న బటిస్టా కుటుంబంతో సహా పారిపోయాడు. క్యూబా క్యాస్ట్రో నాయకత్వంలోని విప్లవ సంస్థ ఆధీనంలోకి వచ్చింది. తర్వాత అది కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలోకి వచ్చింది. 1962 నుండి క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించి శిక్షిస్తున్నది.
క్యాస్ట్రో నాయకత్వంలో క్యూబాలో అధికారంలోకి వచ్చిన విప్లవ ప్రభుత్వం అమెరికన్ కంపెనీలన్నింటినీ జాతీయం చేసింది. ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది. భూములపై రైతులకు, ఫ్యాక్టరీలపై కార్మికులకు అధికారం ఇచ్చింది. భూస్వాములు, పెట్టుబడిదారులు దేశం విడిచి అమెరికా లోని ఫ్లోరిడాలో పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా ప్రభుత్వం పోటీ ప్రభుత్వాన్ని గుర్తించి అన్ని విధాలా తోడ్పాటునందించింది. క్యూబా సోషలిస్టు ప్రభుత్వాన్ని కూల్చేందుకు క్యాస్ట్రోను హతమార్చేందుకు లెక్కలేనన్ని సార్లు కుట్ర చేసింది. ప్రజల భాగస్వామ్యం, సహకారంతో దీన్ని జయప్రదంగా ఎదుర్కొన్నారు. అంతర్జాతీయంగా వర్ధమాన దేశాలను కూడగట్టి అలీనోద్యమాన్ని పటిష్టపరిచారు. నాడు ఇందిరాగాంధీతో కలిసి క్యాస్ట్రో అలీనోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయాక క్యూబా తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి గురైంది. దీన్ని అదనుగా తీసుకుని అమెరికా క్యూబాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. తిండి గింజలు, మందులు, ఆయిల్ సరఫరా కాకుండా ఆపేసింది. సోవియట్ యూనియన్ పతనమైనా నిరుత్సాహపడకుండా సిపిఎంతో సహా ప్రపంచంలో 32 కమ్యూనిస్టు పార్టీలు ఒక తాటి మీదకు వచ్చి క్యూబాకు అండగా నిలబడ్డాయి. 1995-96లో నాటి పార్టీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ చొరవతో మన దేశంలో ఆహార ధాన్యాలు, మందులు సేకరించి ఒక పెద్ద షిప్ ద్వారా క్యూబాకు పంపారు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి సహకరించింది. క్యూబా తనకు తాను నిలదొక్కుకోవడమే కాకుండా వెనిజులాతో సహా అనేక దేశాల్లో వామపక్ష ఉద్యమాలకు తోడ్పాటునందించింది. 21వ శతాబ్దంలో లాటిన్ అమెరికా చరిత్రను తిరగరాయడంలో క్యూబా ప్రత్యేకించి క్యాస్ట్రో పాత్ర మరువలేనిది. ఇంత ఒత్తిడిలో కూడా కరోనాను జయప్రదంగా ఎదుర్కోవడమే కాకుండా 5 రకాల వ్యాక్సిన్లను కనుగొనడం విశేషం. కొన్నిరకాల క్యాన్సర్‌లకు కూడా వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత క్యూబాదే.
2014లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా గెలిచాక కొన్ని సానుకూల చర్యలు తీసుకున్నా ఆంక్షలను సడలించలేదు. అమెరికాలో ఉన్న క్యూబన్ ఖైదీలను విడుదల చేశారు. రాకపోకలను అనుమతించారు. అయితే ఆ తరువాత అధికారం చేపట్టిన ట్రంప్ ఆంక్షలను మరింత కఠినతరం చేసి క్యూబాను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చైనా ప్రభుత్వం క్యూబాతో ఒప్పందం చేసుకుని 100 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ఇప్పటికి పలు దఫాలుగా ఈ ఆంక్షలు ఎత్తేయాలని తీర్మానాలు చేసింది. అమెరికా ఆంక్షలను ఇజ్రాయిల్ మినహా మరే దేశమూ బలపర్చలేదు. అయినప్ప టికీ అమెరికా పెత్తందారీతనంతో తన సామ్రాజ్యవాద దురహంకారాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఈ ఆంక్షల ఎత్తివేతకు అంతర్జాతీయ సంఘీభావం మరింత బలపడాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న సోషలిస్టు దేశం దీర్ఘకాలంగా ప్రపంచంలోనే అత్యంత బలసంపన్నమైన అమెరికాతో ఢకొీట్టి పోరాడుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తెలుగు ప్రజలు క్యూబాకు సంఘీభావం ప్రకటించాలి. ప్రపంచ శాంతి కోసం అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదిరించాలి. అలైదా గువేరా పర్యటన ఇందుకు దోహదపడుతుందని ఆశిద్దాం.
వ్యాసకర్త : సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు