Jul 30,2022 06:41

వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ మీటర్లు బిగింపుపై రైతుల ఆందోళనలు వెల్లువెత్తినా ముందుకే వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వెళ్లడం సమంజసం కాదు. విద్యుత్‌ రాయితీలకు మంగళం పాడేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినాశకర సంస్కరణల్లో భాగంగా బిగిస్తున్న ఈ స్మార్ట్‌ మీటర్లపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిననాడే రైతాంగం నిరసించింది. అయినా వివిధ రకాల బెదిరింపులతో ప్రభుత్వం ముందుకెళ్లింది. కర్నూలులో, అనంతపురంలో కూడా అన్నదాతలు మీటర్ల బిగింపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అన్న చందంగా ముందుకెళ్తోందే తప్ప రైతుల అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు. వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ మీటర్లు బిగిస్తే జరిగే మేళ్లపై రైతులకు అవగాహన కల్పించాలని, లేఖలు రాయాలని ఇంధన శాఖపై గురువారం నాడు జరిగిన సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. రైతాంగ ఆందోళనలను ప్రభుత్వ పెద్దలు అవగాహనలేమిగా భావించడం తగదు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ అమల్లోకి తీసుకొచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని 'రాష్ట్ర రైతు దినోత్సవం'గా నిర్వహిస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో పరుగులెట్టిస్తామని ప్రచార బాకాలు మోగిస్తున్న వైసిపి ప్రభుత్వం ..ఇప్పుడు ఆ ఉచిత విద్యుత్‌కే ఎసరు పెట్టే మీటర్ల బిగింపును సమర్థించుకోవడం సిగ్గుచేటు.
వాస్తవానికి కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణలను అమల్జేస్తున్న ప్రతిచోటా రైతన్నలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనేవున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ ప్రాంతంలో పలు గ్రామాలకు చెందిన 600 మంది రైతులు కోపోద్రిక్తులై తమ పంపు సెట్లకు బిగించిన స్మార్ట్‌ మీటర్లను పీకేసి స్థానిక విద్యుత్‌ కార్యాలయంలో పడేశారు. వారానికే ఏకంగా రూ.5 వేల నుంచి రూ.8 వేలు వరకు బిల్లులు రావడమే వీరి ఆగ్రహానికి కారణం. జాతీయ మీడియాలోనూ, సామాజిక మాద్యమాల్లోనూ ఈ ఘటన సంచలనమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుంగుశిష్యుడైన యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌..ఎన్నికల సమయంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీకి నీళ్లొదిలేసి ఇప్పుడు స్మార్ట్‌ మీటర్లను బిగించడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీలపై కత్తిని వేలాడదీసిన ప్రతి రాష్ట్రంలోనూ విద్యుత్‌ మీటర్లపై ఇదే తరహాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రపంచ బ్యాంకు తొలితరం విద్యుత్‌ సంస్కరణల కత్తిదూసినప్పుడు నాటి టిడిపి ప్రభుత్వం రైతాంగాన్ని బలిపెట్టాలని ప్రయత్నించగా ఆ నాటి చారిత్రత్మాక విద్యుత్‌ పోరాటం పాలకుల గుండెళ్లలో రైళ్లను పరిగెత్తించింది. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అమల్జేసింది. ఆ తర్వాత టిడిపితో సహా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలేవీ వాటి జోలికి వెళ్లలేదు. కానీ యువజన, శ్రామిక, రైతు (వైఎస్‌ఆర్‌) అంటూ పార్టీ పేరులోనే రైతు పేరు తగిలించుకున్న వైసిపి సర్కార్‌ ఇప్పుడు మీటర్ల పేరుతో 'సాహసం' చేస్తోందని, ఈ మీటర్లే వైసిపి ప్రభుత్వానికి ఉరితాళ్లు అవుతాయని రైతులు ధర్మాగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
యుపి తదితర రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తంకావడంతో కేంద్రంలోని మోడీ సర్కార్‌ విద్యుత్‌ మీటర్ల విషయంలో పునరాలోచన చేస్తున్నది. దేశంలోనే అత్యధిక పంపు సెట్లు కలిగియున్న తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఈ విషయంలో కాస్త వివేకంతో నడుచుకుంటోంది. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణలు వినాశకరమైనవని వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందువల్ల ఏపి ప్రభుత్వం కూడా అన్నదాతలకు కూడా మేలు ఏదైనా చేయాలనుంటే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తామంటూ ఒక చట్టం చేయాలి. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపును ఉపసంహరించుకోవాలి. కేంద్రం ఒత్తిళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలి.