Dec 29,2022 06:40

వ్యవసాయ పంప్‌ సెట్లకు ప్రభుత్వ ఖర్చుతో స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తామని చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మిగతా అన్ని కనెక్షన్లకూ 2025 నాటికి అవి తప్పనిసరి అని ప్రకటించింది. వ్యవసాయ మీటర్ల ఖర్చు మాత్రమే సర్కారు భరిస్తుందనీ, మిగతా వినియోగదార్లు డబ్బు చెల్లించాల్సిందేనని లోగుట్టు విప్పింది. ఆరు నెలల్లోనే అందుకు ప్రక్రియ ప్రారంభిస్తామని, తొలుత 500 యూనిట్లు ఆ పైబడి నెలసరి వాడే కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తామని, ఇది తప్పనిసరి నిబంధన అని కూడా రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం (ఆర్‌డిఎస్‌ఎస్‌) అమలులో ఇది భాగమనీ చెప్పారు. చెత్త పన్ను విధింపు, ఆస్తి పన్ను పెంపు, వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్ల బిగింపు వగైరాల మాదిరిగా ఈ భారమూ కేంద్రం చలవే! 'దేవుడు శాసిస్తాడు.. అరుణాచలం పాటిస్తాడు' అన్న సినిమా డైలాగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తుకు తెస్తోంది కదా!
విద్యుత్‌ ఆదా నిజమేనా..!
శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు బిగించాక రాష్ట్ర ప్రభుత్వ సర్వే ప్రకారం 30 శాతం, ప్రయాస్‌ ఎనర్జీ గ్రూప్‌ అధ్యయనం ప్రకారం 20 శాతం విద్యుత్‌ వినియోగం తగ్గిందనీ, ఆ మేరకు ఖజానాకు డబ్బు ఆదా అయిందన్న సర్కారు వాదన నమ్మశక్యంగా లేదు. మీటర్‌ అంటే వాడే విద్యుత్‌ ఎంత అని లెక్క తేల్చేదేతప్ప వినియోగాన్ని నియంత్రించేది ఎంతమాత్రమూ కాదు. మరి ఈ ఆదా వాదనకు ప్రాతిపదిక ఏమిటి? అదేం చెప్పడం లేదు సరికదా అధ్యయన నివేదికలను సర్కారు బయటపెట్టడం లేదు. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో 'వాడక ముందు', 'వాడిన తరువాత' అంటూ కొన్ని ఫొటోలు ఇస్తుంటారు. అలా ఈ అంశాన్నీ చూద్దాం. మీటర్లు బిగించాక నెలకు ఎన్ని యూనిట్లు కరెంటు వాడారో కచ్చితంగా తెలుస్తుంది. కాని, మీటర్లు బిగించకముందు విద్యుత్‌ వాడకాన్ని ఎలా లెక్కగట్టారు? అంటే రెండు అవకాశాలున్నాయి. గత రెండు దశాబ్దాలకు పైగా డిస్కాములు చెబుతున్న అంచనా లెక్క. ఇది తప్పుల తడిక అని విద్యుత్‌ రంగ నిపుణులు ఎన్నో సందర్భాల్లో వివరాలతోసహా ఎండగట్టారు. విద్యుత్‌ నియంత్రణ మండలి (ఇఆర్‌సి) కూడా కొన్ని సార్లు డిస్కాములకు తలంటింది. కనుక ఇప్పుడూ వాటితోనే పోల్చి చూస్తే ఆదా ఎంత శాతమైనా అయిందని చెప్పేయవచ్చు. దానికి విశ్వసనీయత లేనట్టే!
ఇక రెండో మార్గం ఫీడర్‌ స్థాయిలో వున్న మీటర్‌ గత ఏడాది రీడింగ్‌ను, దాని పరిధిలోని అన్ని పంప్‌సెట్ల ఈ ఏడాది వాడకాన్ని పోల్చితే కొంతమేర లెక్క తెలుస్తుంది. అయితే అది కూడా సహేతుకమైన పోలిక కాకపోవచ్చు. గత ఏడాది ఆ ఫీడర్‌లో రోజుకు ఎన్ని గంటలు విద్యుత్‌ సరఫరా జరిగింది, ఈ ఏడాది ఎంత సమయం అన్నది పరిశీలించారా? శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ విద్యుత్‌ రోజుకు నాలుగైదు గంటలకు మించి ఇవ్వడంలేదని రైతులు చెబుతున్నారు. మరి తక్కువ సమయం సరఫరా చేసి ఆదా తొమ్మిది గంటల ప్రాతిపదికన లెక్కిస్తే! అలాగే గత ఏడాది ఈ రోజుల్లో పడిన వర్షం, ఈ ఏడాది అదెలా వున్నదీ చూశారా? అంతేగాక ఆయా పంప్‌సెట్ల కింద సాగు చేసిన పంటలు ఒకటేనా లేక వేర్వేరా? ఇలాంటి అంశాల్లో వ్యత్యాసాలుంటే లెక్కలు తారుమారు కావచ్చు. ఎందుకంటే ఇది కేవలం పోలిక కదా! ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రయాస్‌ వారి అధ్యయన నివేదికను, వారి సిఫార్సులనూ వెల్లడిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి.
భద్రత, నాణ్యత మెరుగుదల ఎలా...?
మీటర్లు పెట్టాక విద్యుత్‌ సరఫరాలో నాణ్యత మెరుగు పడిందని, భద్రత పెరిగిందన్న వాదనలూ పరీక్షకు నిలబడేవి కాదు. శ్రీకాకుళం జిల్లాలో పంప్‌సెట్లకు కేవలం మీటర్లు బిగించారేతప్ప మిగతా ఏ మార్పులూ చెయ్యలేదు. అనేకమంది రైతులు తమ షెడ్‌ లోపల మీటర్‌ బిగించవద్దంటే సిబ్బంది స్తంభాలవద్దనే మీటర్లు ఏర్పాటు చేశారు. ఈ మాత్రానికే భద్రత, నాణ్యత ఎలా పెరుగుతాయి? అయితే సరఫరాలో సమస్యలను, చిన్న చిన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి మాత్రం మీటర్ల ఏర్పాటు ఉపయోగపడిందని రైతులు అంటున్నారు. ఆ జిల్లాలో బిగించినవి అత్యధికం ఇన్‌ఫ్రారెడ్‌ మీటర్లు కనుక నెలవారీ రీడింగ్‌ తియ్యడానికి వచ్చే యువకులకు (గతంలో సాధారణంగా ఎవరూ వచ్చేవారు కాదు) రైతులు సమస్యలను వివరించడం, వాటిని కొంతమేర పరిష్కరించడానికి తోడ్పడుతోంది. అంతకుమించి వేరే ప్రయోజనం అదనంగా రాలేదు. పోనీ కొత్తగా ఏమైనా వస్తుందా అంటే అదీ పరిమితమే! తాజా టెండర్‌లో పేర్కొన్నదాని ప్రకారం కొత్తగా ఇచ్చేది మీటర్‌ బాక్స్‌, ప్రామాణికమైన ఎర్త్‌ కనెక్షన్‌, ఎంసిబి, ఇతర ఏర్పాట్లు రైతు పంప్‌సెట్‌ షెడ్‌ పరిధిలోనివే. కొంతమేర ప్రమాదాల నివారణకు తోడ్పడవచ్చు. కాని, ప్రధాన విద్యుత్‌ ప్రవాహం నడిచే కండక్టర్ల నాణ్యత, సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్ధ్యం, గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ వంటివి ఈ మీటర్ల ఏర్పాటుతో సంబంధమే లేని అంశాలు.

tweet


'స్మార్ట్‌' అంత కచ్చితమా...!
మన రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ వాడకం ఎంతో కచ్చితంగా తెలియాలని, అది కూడా ఎప్పటికప్పుడు (రియల్‌ టైం) తెలియాలనీ ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే ఉన్నది, భవిష్యత్తులో సెకి ద్వారా అదానీ కంపెనీ నుండి కొనుగోలు చేయనున్న సౌర విద్యుత్‌ నిర్వహణకు ఈ సమాచారం అవసరమని, స్మార్ట్‌ మీటర్ల ద్వారానే అది తెలుస్తుందని చెబుతోంది. అదే నిజమైతే మరి మొత్తం కనెక్షన్లన్నిటికీ స్మార్ట్‌ మీటర్లు ఎందుకు బిగిస్తానంటోంది? సమాధానం సర్కారు వారే చెప్పాలి. నిజంగా విద్యుత్‌ వినియోగం మాత్రమే తెలుసుకోవాలంటే ఇప్పటికే వున్న ఫీడర్‌ స్థాయి మీటర్లను అవసరమనుకుంటే స్మార్ట్‌ మీటర్లుగా మార్చవచ్చు. అలాగే నిర్దిష్ట సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద కూడా ఏర్పాటు చేస్తే చాలు. పూర్తిగా డిస్కామ్‌ల ఆవరణల్లోనే వుండడమేగాక 90 శాతం వరకు ఖర్చు కూడా తగ్గుతుంది. దాదాపు అన్నీ మొబైల్‌ నెట్‌వర్క్‌ కవరేజి ప్రాంతంలోనే ఉంటాయి కనుక రీడింగ్‌ తీయడానికి మనుషుల అవసరం కూడా రాదు. కాని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదంటే కేంద్రం ఒత్తిడి ఎంతలా ఉందో మరి!
భారీగా ఖర్చు చేసి ఏర్పాటు చేసే స్మార్ట్‌ మీటర్లు అన్ని అంశాలనూ కచ్చితంగా తెలియజేస్తాయని, తప్పులుండవనీ ఎవరైనా చెప్పగలరా? ఇటీవలి అసోం అనుభవం చూస్తే వాటి నిర్వాకం బోధపడుతుంది. అసోంలో కూడా పెద్ద సంఖ్యలో స్మార్ట్‌ మీటర్లు బిగించారు. అక్కడ విద్యుత్‌ చార్జీలు పెంచకుండానే వినియోగదార్లకు కరెంటు బిల్లులు భారీ మొత్తాలతో రావడంతో సర్కారు దొడ్డిదారిన చార్జీలు పెంచిందని జనం గగ్గోలు పెట్టారు. దాంతో అసోం పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అలాంటిదేమీ లేదని, కరెంటు వినియోగం పెరిగినందునే బిల్లులలా వచ్చాయని బహిరంగంగా బుకాయించారు. కాని, జనాగ్రహం పెల్లుబకడంతో సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రంగంలోకి దిగి అదంతా స్మార్ట్‌ మీటర్ల మూలంగా తలెత్తిందని ప్రజలకు వివరించి, తప్పుడు మీటర్లను వెంటనే మార్చాలంటూ అధికారులను ఆదేశించారు (ఇందుకు సంబంధించి 2022 సెప్టెంబర్‌ 16న సిఎం చేసిన ట్వీట్‌ కింద ఇవ్వబడింది.) ఇలాంటి ఉదాహరణలెన్నో పేర్కొనవచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి అదీ బిజెపి పాలిత రాష్ట్రానికి చెందినవారు స్వయంగా ఇచ్చిన వివరణ చూశాక అయినా 'స్మార్ట్‌' సమర్ధకులు ఏమంటారో!
దేశంలో అమలు తీరిలా...
దేశమంతటా 25 కోట్ల స్మార్ట్‌ మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అందుకోసం 2018 నుండి పలుమార్లు రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రులు లేఖలు రాశారు. ఆకర్షణీయ పథకాలను కేంద్రం ప్రకటించింది. రూ.3.05 లక్షల కోట్లతో ప్రతిపాదించిన ఆర్‌డిఎస్‌ఎస్‌ ప్రధాన లక్ష్యం స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటే! నేషనల్‌ స్మార్ట్‌ గ్రిడ్‌ మిషన్‌ వెబ్‌సైట్‌లో సమాచారం ప్రకారం 2022, డిసెంబర్‌ 23 నాటికి (ఈ నాలుగేళ్లలో) దేశమంతటా బిగించిన స్మార్ట్‌ మీటర్ల సంఖ్య 52,93,062 మాత్రమే. ఇందులోనూ అయిదు రాష్ట్రాలు బీహార్‌ 12,28,945, ఉత్తరప్రదేశ్‌ 11,72,392, హర్యానా 6,12,106, రాజస్థాన్‌ 5,62,520, అసోం 4,55,879 కలిపితే 76 శాతం కావడం గమనార్హం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి దశలో వ్యవసాయంలో 18.5 లక్షలు, మిగతా రంగాల్లో నెలసరి వాడకం 500 యూనిట్లకన్నా ఎక్కువగా ఉండే 28 లక్షల కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు దేశమంతటికీ మంజూరైన స్మార్ట్‌ మీటర్ల సంఖ్య 1,12,75,739. రాష్ట్ర ప్రభుత్వం ఎంతలా ఊదరగొట్టినా ఈ స్మార్ట్‌ ప్రక్రియ అంత తేలిగ్గా జరిగేది కాదు. విద్యుత్‌ సంస్కరణల్లో దేశంలోనే ముందున్న ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటులో దాదాపు ఖాతా తెరవని పరిస్థితి. వివిధ రాష్ట్రాల్లో నిరసనలు, ప్రతిఘటనలూ ఉధృతంగానే జరిగాయన్న విషయం మరువరాదు.
ప్రపంచంలోనూ స్మార్ట్‌ మీటర్లకు ఎదురుగాలి వీస్తోంది. ఇటువంటి సంస్కరణల్ని తొలుత అమలు చేసిన బ్రిటన్‌లో ఇప్పుడు విద్యుత్‌, గ్యాస్‌ స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి. బిల్లులు తప్పుల తడికలుగా రావడం ఒకటైతే తమ వినియోగ వివరాలు, ఇతర సమాచారాన్ని ఆయా విద్యుత్‌ కంపెనీలు అమ్ముకుంటున్నాయని ఆరోపణలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమస్యలపై అక్కడి ప్రభుత్వం కూడా స్పందించవలసి వస్తోంది. స్వీడన్‌, జర్మనీ వంటి ఇంకొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ మీటర్ల వివాదాలున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లోనూ గృహ వినియోగ కనెక్షన్లకు మీటర్లు బిగించడానికి పూనుకుంటే ప్రజల నుండి ప్రతిఘటన ఉమ్మడి రాష్ట్రం నాటి విద్యుత్‌ ఉద్యమాన్ని తలపించినా ఆశ్చర్యపోనక్కరలేదు. సర్కారు వారూ తస్మాత్‌ జాగ్రత్త!

బి. తులసీదాస్‌