బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక మూన్ మిషన్ చంద్రయాన్-3కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆ సంస్థ ఎప్పటికప్పుడు అందిస్తున్నది. ప్రస్తుతం స్లీప్ మోడ్‌లో ఉన్న విక్రమ్ ల్యాండర్ ఫొటోను ఇస్రో రిలీజ్ చేసింది. చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఎపర్చర్ రాడార్ పరికరం ద్వారా చంద్రయాన్-3 ల్యాండర్ ఫొటోను తీసినట్లు తెలిపింది. ఈ నెల 6న తీసిన ఈ ఫొటోను శనివారం ఎక్స్‌లో ఇస్రో షేర్ చేసింది. చంద్రుడిపై లూనార్ నైట్ ప్రారంభం కావడంతో విక్రమ్ ల్యాండర్, దాని నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగిన ప్రజ్ఞాన్ రోవర్‌ను స్లీప్ మోడ్‌లో ఇస్రో ఉంచింది. మరోవైపు ఈ నెల 22న చంద్రుడిపై తిరిగి లూనార్ డే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై సూర్యుడి కాంతి కిరణాలు పడే ఈ సమయం కోసం ఇస్రో ఎదురుచూస్తున్నది. అయితే లూనార్ నైట్ సమయంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వంటి పరిస్థితులను ల్యాండర్, రోవర్ తట్టుకుని తిరిగి అవి పనిచేస్తాయా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.