Jul 20,2023 06:31

ఎయిడ్స్‌ వ్యాధి నిర్ధారణ పరీక్ష, కౌన్సిలింగ్‌ (ఐసిటిసి) కేంద్రాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌) పేరుతో కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (న్యాకో) ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. జులై 5వ తారీఖున 'న్యాకో' జారీ చేసిన సర్క్యులర్‌ నంబర్‌-11025 పట్ల ఆ సంస్థ సిబ్బంది ఆందోళనలో పడ్డారు. ఎయిడ్స్‌ రోగులు సైతం అయోమయానికి గురవుతున్నారు.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన మహమ్మారిగా పేరున్న హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులలో ఉన్న వివక్షతలను పారదోలి, రోగులలో మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపేందుకు సుశిక్షితులైన నిష్ణాతులైన కౌన్సిలర్లు సేవలు అందించేవారు. అయితే ప్రస్తుతం కేంద్రం తలపెట్టిన రేషనలైజేషన్‌ వల్ల ఆ సేవలు కరువు కానున్నాయి. పరీక్షలు చేయించుకోవడానికి అందుబాటులో ఐసిటిసి కేంద్రాలు లేకపోవడం వల్ల, సదరు హెచ్‌ఐవి, అనుమానిత, హై రిస్క్‌ గ్రూప్‌, సంక్రమిత వ్యక్తుల ద్వారా ... చాప కింద నీరు లాగా సమాజంలో మరింతగా ఎయిడ్స్‌ వ్యాధి ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంది.
భారతదేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాలలో 593 ఐసిటిసి కేంద్రాలను ఎత్తివేయడానికి రంగం సిద్ధమైంది. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పాలన, ప్రజా సంక్షేమ పథకాలు ఉండాలని పదేపదే వల్లెవేసే ప్రభుత్వాలు వాటిని ప్రజలకు అందకుండా హేతుబద్ధీకరణ పేరిట పట్టణాలకే పరిమితం చేయడం పట్ల ప్రజలు, ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2005 సంవత్సరం నుంచి దాదాపు ఇరవై ఏళ్లుగా ప్రతి సామాజిక ఆరోగ్య ఆసుపత్రులలో ఐసిటిసి కేంద్రాలను ఏర్పాటు చేసి హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ వ్యాధి నిర్ధారణ, కౌన్సిలింగ్‌ సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోగులకు హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ వ్యాధి నిర్ధారణ, సలహాలు, సూచనలతో పాటు ఇతర రోగాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు వివరిస్తూ, కౌన్సిలర్లు తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. జనరల్‌ వ్యక్తులు, రిస్క్‌ ఉన్నవారు, ప్రతి గర్భిణీకి, శస్త్ర చికిత్సల సందర్భంగా హెచ్‌ఐవీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను శిక్షణ పొందిన ల్యాబ్‌ టెక్నీషియన్లు మూడు దశలలో పలు టెస్ట్‌ కిట్లతో ఇంటిగ్రేటెడ్‌ కౌన్సిలింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ సెంటర్‌ (ఐసిటిసి)లలో కన్ఫర్మేషన్‌ టెస్టులను నిర్వహిస్తారు. పల్లెల్లో ఇంతటి కీలకమైన సేవలు అందిస్తున్న ఐసిటిసి కేంద్రాలలోని కౌన్సిలర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్లను ఏరియా, జిల్లా కేంద్ర ఆస్పత్రులలోని ఐసిటిసి కేంద్రాల్లో సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ వల్ల పల్లె ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కౌన్సిలింగ్‌ సేవలు చేరువలో లభించక రోగులు అనేక అవస్థలకు గురయ్యే పరిస్థితి నెలకొంటుంది. ఆర్థికంగా చితికిపోయే దుస్థితి ఎదురు కానుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి సామాజిక ఆరోగ్య కేంద్రాలలోని ఐసిటిసి కేంద్రాలను యథాతథ స్థితిని కొనసాగించాలని ఉద్యోగులు, రోగులు, ప్రజాసంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ఆ దిశగా ఆలోచించి చర్యలు చేపట్టడం మంచిది.

- రావుల రాజేశం, సెల్‌ :9848811424