- హింసాత్మక ఘటనలతో పరిస్థితి చేయిదాటడంతో నిర్ణయం
- సంబంధిత ఉన్నతాధికారులకు ఉత్తర్వులు
- అల్లర్లలో చిక్కుకున్నవారి కోసం సహాయ కేంద్రాలు
ఇంఫాల్ : రెండు గ్రూపుల మధ్య జరిగిన అల్లర్లతో చెలరేగిన హింసతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడికింది. రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటాయి. దీంతో కనిపిస్తే కాల్చేయాలంటూ మణిపూర్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. హింసాత్మక ఘటనలతో పరిస్థితి చేయిజారడంతో గవర్నర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్లు, అందరు కార్యనిర్వాహక మేజిస్ట్రేట్లు, ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్లకు మణిపూర్ గవర్నర్ అధికారాన్ని కల్పించారు. రాష్ట్రంలో హింస కారణంగా అల్లర్లలో చిక్కుకుపోయిన వారి కోసం రాష్ట్ర హోం శాఖ కదిలింది. వారి కోసం రిలీఫ్ క్యాంపును ఏర్పాటు చేసింది. అల్లరి మూకలు అనేక ఇళ్లను, దుకాణాలను లూటీ చేయడంతోపాటు దగ్ధం చేశాయి. హింసాత్మక ఘటనలతో ప్రభావితమైన ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వేల మందిని రక్షించి, వారికి వసతి కల్పించినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితిని అదుపు చేయడానికి సైన్యం రంగంలోకి దిగింది. రాష్ట్ర పోలీసులతో కలిసి సైన్యం, అస్సాం రైఫిల్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. గురువారం సాయంత్రానికి 55 కంపెనీల సైన్యం, అస్సాం రైఫిల్స్ రాష్ట్రానికి చేరుకున్నాయి. అనేక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌నూ రంగంలోకి దించాలని కేంద్ర హోం శాఖ భావిస్తున్నట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు.
అల్లర్లు ఎందుకు ?
షెడ్యూల్ తెగ హోదా కోసం గిరిజనేతర మెయితీ గ్రూప్ డిమాండ్‌ను ఇక్కడి గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. మెయితీ గ్రూప్ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ అఖిల గిరిజన విద్యార్థి సంఘం మణిపూర్ (ఎటిఎస్‌యుఎం) బుధవారం తుర్బుంగా ప్రాంతంలో గిరిజన సంఘీభావ యాత్రకు పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. అంతకుముందు మెయితీలు ఎస్టీ హోదా కోసం చేసిన డిమాండ్‌కు మణిపూర్ లోయ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. ఇది గిరిజన ప్రాంత ప్రజల్లో ఆందోళనను కలిగించింది. ఇది కాస్తా ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు దారి తీసింది. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయితీ కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఉన్నారు. మణిపూర్ లోయలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో నివసించేందుకు మెయితీలకు అనుమతి లేదు.
8 జిల్లాల్లో కర్ఫ్యూ.. రంగంలోకి బలగాలు.. ఇంటర్నెట్ నిలిపివేత
ఈ రెండు కమ్యూనిటీల మధ్య చెలరేగిన అల్లర్లు తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారాయి. ఇందుకు చురాచాంద్‌పూర్ కేంద్ర బిందువుగా మారింది. కొద్ది రోజుల క్రితం సిఎం బీరెన్‌సింగ్ పాల్గొనాల్సిన సభ వేదికను కొందరు ఈ ప్రాంతంలో నిరసనకారులు దహనం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ తాజా ఆదేశాలకు ముందు నిరసనకారులు నివాసాలు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలు, వాహనాలకు నిప్పటించారు. ఈ ఘర్షణలను అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఆర్మీ, రైఫిల్ బలగాలను రంగంలోకి దింపింది. రాజధాని ఇంఫాల్, చురాచాంద్‌పూర్, కాంగ్‌పోక్పిలో ఘర్షణలు జరగడంతో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపివేసింది.
రాష్ట్రం మండిపోతున్నది.. సహాయం చేయండి : ప్రధానిని కోరిన మేరీకోమ్
రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ సైతం ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మండిపోతున్నదనీ, సహాయం చేయాలని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆమె అభ్యర్థించారు. రాష్ట్రంలోని పరిస్థితిపై అమిత్ షా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌తో మాట్లాడారు.
బిజెపి విద్వేష రాజకీయాలే కారణం : కాంగ్రెస్
మణిపూర్‌లో హింసాకాండకు బిజెపి అనుసరిస్తున్న విద్వేష రాజకీయాలే కారణమని కాంగ్రెస్ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రజల మధ్య చీలికలు సృష్టించి అందమైన రాష్ట్రంలో శాంతిని ధ్వంసం చేసిందని ఆయన పేర్కొన్నారు. 'విద్వేషం, విభజన, అధికార దాహంతో కూడిన బిజెపి రాజకీయాలే ఈ హింసాకాండకు కారణం. మణిపూర్‌లో ప్రజలందరూ సంయమనం పాటించి, శాంతికి కృషి చేయాలి' అని ఖర్గే విజ్ఞప్తి చేశారు.










