Jan 18,2023 11:15
  • భారంగా విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ ధరలు
  • ఇతర ఉపకరణాలపైనా భారీగా పెంపు

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్‌ ఇకపై భారం కానుంది. ఎపి ఎస్‌పిడిసిఎల్‌ పరిధిలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు వసూలు చేసే మొత్తం పెరగనుంది. ఇతర విద్యుత్తు ఉపకరణాల ధరలు పెంచనుండడంతో రైతులకు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్‌ తీవ్ర ఆర్థిక భారం కానుంది. ఉమ్మడి కర్నూలు పరిధిలో అన్ని కేటగిరీల్లో కలిపి 16.6 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. 400 కెవి ఉప కేంద్రం ఒకటి, 220 కెవి ఉప కేంద్రాలు 12, 132 కెవి ఉప కేంద్రాలు 8, 33/11 కెవి ఉప కేంద్రాలు 245 చోట్ల ఉన్నట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. లక్షకుపైగా సింగిల్‌ ఫేస్‌, త్రీ ఫేస్‌ విద్యుత్తు నియంత్రికలు ఉన్నాయి. వెయ్యికిపైగా ఫీడర్లు ఉండగా, వాటిలో వ్యవసాయానికి 640 పీడర్ల ద్వారా సరఫరా జరుగుతోంది. నాలుగు నెలల క్రితం 25 కెవి విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ ధర రూ.61,216 ఉండేది. ప్రస్తుతం దీని ధరను రూ.1,39,999కు పెంచింది. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌కు సుమారు రూ.78 వేలకుపైగా ధర పెంచేసింది. మునుపెన్నడూ ఇంత భారీగా ధరలు పెరగలేదు. తయారీ సంస్థలకు మేలు చేసే ఉద్దేశంతో అధికంగా ధరలు ఖరారు చేశారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉన్న సంస్థలకు ఆర్థికంగా మేలు చేయాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైర్లు, ఎనిమిది మీటర్లు, 9.1 మీటర్లు, 11 మీటర్లు పొడవు ఉన్న విద్యుత్తు స్తంభాల డిస్కులు, ఇన్సులేటర్లు, కాసారాలు, జిఐ ఎర్త్‌ పైపులు, ఎబి స్విచ్చులు ఇలా అన్నిరకాల సామగ్రి ధరలను పెంచేశారు. వ్యవసాయ సర్వీసులు కావాలని కొత్తగా దరఖాస్తు చేసుకుంటే రైతులు 10 హార్స్‌ పవర్‌ సామర్థ్యానికి ప్రస్తుతం రూ.12,500 చెల్లించాల్సి ఉంది. 25 కెవి ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు మూడు స్తంభాలు, 180 మీటర్ల పొడవు ఉన్న మూడు లైన్ల విద్యుత్తు తీగలు ఇస్తున్నారు. ఇంకా దూరం ఉంటే ఆ భారమంతా రైతు భరించాల్సి వస్తోంది. విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు అన్ని ముడి సామగ్రి ధరలూ పెరగడంతో రైతులకు తీవ్ర భారంగా మారనుంది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామనే పేరుతో ధరలు పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకే కాకుండా ఇతరులకు కూడా ఇవే ధరలు అమలు చేయనున్నారు.
 

                                                                    ఏప్రిల్‌ తరువాత కొత్త రేట్లు

ప్రస్తుతం పాత రేట్లే కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌ తరువాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం రెండు విద్యుత్తు స్తంభాల వరకూ ఉచితంగా ఇస్తాన్నాం. అదనంగా విద్యుత్తు స్తంభం కావాలంటే రూ.15 వేలు, ఒక హెచ్‌పి కనెక్షన్‌కు రూ.1,250 చొప్పున చెల్లించాలి.
             - ఎం.ఉమాపతి, కర్నూలు విద్యుత్తు ఎస్‌ఇ