Oct 11,2022 10:35
  • ఈ విద్యా సంవత్సరం నుంచి తిరిగి అమలు
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాకుగా నిర్ణయం

ప్రజాశక్తి- విజయవాడ ప్రతినిధి : రాష్ట్ర ఖజానా పరిస్థితి సరిగా లేదనే పేరుతో ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ఆలోచనల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్‌ రెసిడెంట్‌ టీచర్‌ (సిఆర్‌టి)లకు వేతనాల చెల్లింపు నెలలను కుదించింది. ఏడాది మొత్తానికి అంటే 12 మాసాలకు కాకుండా కేవలం పది నెలలకు మాత్రమే చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు వారం రోజుల క్రితం గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ సర్క్యులర్‌ జారీ చేసినట్లు తెలిసింది. దీంతో, సిఆర్‌టిలకు ఈ విద్యా సంవత్సరం నుంచి పది నెలలకు మాత్రమే వేతనాలు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇవి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇవి ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల గతంలో వీటిని అక్కడ ఏర్పాటు చేశారు. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు వీటిల్లో ఆశ్రమం పొందుతూ విద్యను అభ్యసిస్తుంటారు. వీటిల్లో రెగ్యులర్‌ ఉపాధ్యాయులతోపాటు సిఆర్‌టిలు కూడా విధులు నిర్వహిస్తుంటారు. దాదాపు వెయ్యి మంది వరకు సిఆర్‌టిలు ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్నారు. వీరికి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు మాదిరిగా కాకుండా సిఆర్‌టిలకు ప్రభుత్వం ఏడాదిలో పది నెలలు మాత్రమే జీతాలు చెల్లించేది. 12 నెలలూ వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కోవిడ్‌ సమయంలో ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు మాదిరిగానే సిఆర్‌టిలకు కూడా ఏడాది పొడవున అంటే 12 నెలలూ వేతనాలు చెల్లించింది.
          గత రెండు విద్యా సంవత్సరాల్లో ఇది అమలు చేసింది. అయితే, ఈ విద్యా సంవత్సరం నుంచి పది నెలలకే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, సిఆర్‌టిలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో జరగనున్న టీచర్స్‌, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారిలో చర్చ జరుగుతోంది. పిఆర్‌సి, సిపిఎస్‌ రద్దు వంటి అంశాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యతిరేకతను ప్రభుత్వం ఇప్పటికే మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిఆర్‌టిల అంశం కూడా కీలకం కానుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ సత్తా చాటేందుకు వారు సంసిద్ధం అవుతున్నట్లు సమాచారం.