'వాణిజ్య ప్రధానంగా సాగే గ్లామర్ పాత్రలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ నటుల్ని దర్శకులు ఒకొక్కరు ఒక్కో కోణంలో చూస్తుంటారు. ఎవరు ఎలాంటి పాత్రలతో వస్తారో ఊహించలేం. ఏ పాత్ర నా దగ్గరికి వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. కష్టపడి పనిచేస్తే విజయం వాటంతట అదే వస్తుందని నమ్ముతూ ప్రయాణం చేస్తున్నా' అని హీరోయిన్ శివానీ రాజశేఖర్ అన్నారు. తల్లిదండ్రులు జీవిత, రాజశేఖర్ల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆమె ఇటీవల 'కోట బొమ్మాళి పీఎస్' చిత్రంలో నటించారు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాస్, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ నెల 24న చిత్రం విడుదల కానుంది. హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో శివానీ రాజశేఖర్ మాట్లాడారు. 'మన సినిమా గురించి అందరూ మాట్లాడుకోవాలి, మనం వైరల్ కావాలని అందరికీ ఉంటుంది. లింగి లింగి లింగిడి... పాట వల్ల 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా గురించి విడుదలకి ముందే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా పాటతో మీరే కనిపిస్తున్నారని చెబుతున్నారు. విడుదలకి ముందే ఈ ప్రశంస చాలా సంతోషాన్నిచ్చింది. సినిమా మరింతగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నమ్ముతున్నా' అని అన్నారు.