Nov 20,2023 10:45

న్యూఢిల్లీ : క్రికెట్‌లో భారత్‌కు తొలి ప్రపంచ కప్‌ సాధించిన 1983 జట్టు సారథి, దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌కు అవమానం జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఆయనను బిసిసిఐ ఆహ్వానించలేదు. ఈ విషయాన్ని కపిల్‌ దేవ్‌ వెల్లడించారు. ఫైనల్‌కు హాజరు కాకపోవడంపై ఒక జాతీయ వార్తా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కపిల్‌ స్పందిస్తూ..'నాకు ఆహ్వానం లేదు. వారు నన్ను పిలవలేదు. అందుకే వెళ్లలేదు..అంతే' అని ఆయన తెలిపారు. 1983 టీమ్‌ మొత్తాన్ని ఈ వేడుకకు ఆహ్వానించాలని తాను కోరుకున్నానని, ఇంతటి పెద్ద వేడుకకు ఆహ్వానించకపోవడం అంటే బహుశా వారంతా బిజీబిజీగా ఉండటం వల్ల సాధ్యం కాలేదేమోనని కపిల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించిన బిసిసిఐ పెద్దలు కపిల్‌ను విస్మరించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపుల నుంచి తమను రక్షించాలని కోరుతూ ఢిల్లీలో రెజ్లర్లు నిర్వహించిన పోరాటానికి కపిల్‌ మద్దతు ఇచ్చారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆయన పట్ల గుర్రుగా ఉన్నారు. అందుకనే ఈ వేడుకలకు కూడా కపిల్‌ను కావాలనే ఆహ్వానించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.