Feb 26,2023 06:46

అర్థరాత్రి ముగ్గురు మిత్రులు కారులో బయల్దేరతారు. అడవి మధ్యలో కారు ఆగిపోతుంది. బాగు చేయడానికి దిగిన ఒకరిని పాము కరుస్తుంది. నురగలు కక్కుతూ పడిపోతాడు. ఆ సమయంలోనే అడవిలోంచి పాముల సిద్ధయ్య వస్తాడు. వైద్యం చేస్తానని తన గుడిసెకి తీసుకెళతాడు. అయితే, వైద్యానికి కావాల్సిన మూలిక ఆ గుడిసెలో కనిపించదు. అంత రాత్రిలోనే సిద్ధయ్య కూతురు దూరంగా వున్న పొదల్లోనుంచి ఆ మూలికను తెస్తుంది. సిద్ధయ్య వైద్యం చేస్తాడు. ఆ మనిషి బతుకుతాడు. తెల్లవారిన తర్వాత మూలికలు తేవడంకోసం పొదల్లోకి వెళ్లిన సిద్ధయ్యను పాము కరుస్తుంది. వెళ్లడానికి బస్కెక్కుతున్న ఆ ముగ్గురిని సహాయం చేయమంటూ సిద్ధయ్య కూతురు వేడుకుంటుంది. మేం ఏం చేయగలం అంటూ... చచ్చే మనిషి కూతురికి ఇరవై రూపాయలిస్తాడు చచ్చి బతికిన మనిషి. సగం ఆస్తి రాసిస్తానన్న వ్యక్తి... ఆ తర్వాత మామూలు మనిషైపోతాడు. ఇది తిలక్‌ 'నల్లజర్ల రోడ్డు' కథ. ప్రాణం మీదకొచ్చినప్పుడున్న మనిషి ధోరణి... గట్టెక్కిన తర్వాత మారిపోతుంది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రథమ చికిత్స అందించి, కంటికి రెప్పలా కాపాడుతారు నర్సులు. అయినా వారిది సిద్ధయ్య పరిస్థితే.
'ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ సైకియాట్రిక్‌ నర్సింగ్‌'లో ప్రచురించిన ఒక అధ్యయనం... నర్సులు అనేక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. కోవిడ్‌ సమయంలో అలుపెరుగని పోరాటం చేసిన వీరు ప్రస్తుతం అలసట, ఒత్తిడి, నిద్రలేమి, నిరాశతోపాటు భయం, కోపోద్రేకం, ఆందోళన వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. సిబ్బంది కొరత, ఓవర్‌ టైమ్‌లు, తక్కువ వేతనాలు, అసురక్షిత ప్రదేశాల్లో పనిచేయడం వంటివి వారి సమస్యలకు కారణమౌతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ మహమ్మారి నర్సుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రోగులకు సేవలందించడంలో ముందుండే నర్సులకు కనీస మౌలిక సదుపాయాలు కొరవడటం నిర్వివాదాంశం. దీంతో సమస్యల పరిష్కారం కోసం సమ్మెలకు దిగాల్సిన దుస్థితి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఉత్తమ వైద్య సేవలకు ఆదర్శం అని చెప్పుకునే బ్రిటన్‌లో లక్షమంది నర్సులు ఒకేసారి సమ్మెకు దిగడం చరిత్రలో ప్రథమం. ఒక్క భారత్‌లోనే 2024 నాటికి 43 లక్షల మంది నర్సుల అవసరం అని 'నర్సులు, మంత్రసానుల వృత్తి సంబంధిత సంస్థ' తెలిపింది. డబ్ల్యుహెచ్‌ఓ నిబంధనల ప్రకారం... ప్రతి వెయ్యి మందికి ముగ్గురు నర్సులు వుండాలి. కానీ, దేశంలో ఆ సంఖ్య 1.7గానే ఉంది. నర్సుల కొరతను తీర్చడంతోపాటు... ప్రభుత్వ రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆ సంస్థ చెబుతోంది.
నర్సులంటే ఎలాంటి పరిస్థితిలోనైనా సంయమనాన్ని కోల్పోకుండా తమ సేవాతత్పరతను చాటుకునే మానవతామూర్తులు. ఎక్కడైనా ఒకరిద్దరు నర్సులు పొరబాట్లు చేసివుండొచ్చు. కానీ, వారి జీవితంలో ఎక్కువ భాగం రోగుల సేవలో గడుపుతుంటారు. ఇటీవల టాలీవుడ్‌ లోని ఓ ప్రముఖ హీరో నర్సులపై చేసిన కామెంట్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే. నర్సులపై కించపరిచే వ్యాఖ్యలు, బాడీ షేమింగ్‌కి పాల్పడటం సరైంది కాదు. అంతేకాదు. నర్సుల మాదిరి కొన్ని సేవలను ఎఎన్‌ఎంలు, ఆశాలు అందిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల సేవలు అమోఘం. సరైన సౌకర్యాలు లేనిచోట కూడా వైద్య సేవలను అందిస్తున్నారు. అయినప్పటికీ వీరిపట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తూనేవుంది. వారి సేవలను గుర్తించాలి. సమాజంలో వారికి సరైన గుర్తింపునివ్వాలి. 'నల్లజర్ల రోడ్డు'లో చచ్చి బతికిన మనిషిలా కాకుండా... చచ్చైనా తోటివారికి మేలు చేస్తారు మన నర్సమ్మలు. విజయవాడకు చెందిన స్టాఫ్‌నర్సు ఝాన్సీరాణి కరోనా సమయంలో, అత్యవసరవేళల్లో డాక్టర్లతో సమంగా సేవలందించారు. కోవిడ్‌ సమయంలో భర్త చనిపోయినా, తోడబుట్టిన అక్క మృత్యువుపాలైనా.. వెనకడుగు వేయకుండా, ఆ బాధను పంటిబిగువున నొక్కిపెట్టి రోగులకు సేవలందించారు. అందుకుగానూ ఆమెను 'నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు-2021' వరించింది. ఇలాంటి ఎందరో త్యాగమూర్తులు, మానవతావాదులు మన నర్సులు. వీరు మన నైటింగేల్స్‌. వీరిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.