Nov 20,2022 07:55
  • ఈపాటికే 15 టిఎంసిల నీరు సముద్రం పాలు
  • 80 వేల ఎకరాలకు సాగునీటిపై రైతుల ఆశలు గల్లంతు

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : రెండు నెలల క్రితం దెబ్బతిన్న గుండ్లకమ్మ రిజర్వాయర్‌ గేట్ల మరమ్మతులు చేపట్టడంలో ఇరిగేషన్‌ అధికారులు ఇప్పటికీ సఫలీకృతం కాలేకపోయారు. తాత్కాలికంగా చేపట్టిన చర్యలు ఫలితాలను ఇవ్వలేదు. అధికారులు ఈ ప్రాజెక్టు నిర్వహణ పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారనే చర్చ రెండ్రోజుల క్రితం జడ్‌పి సమావేశంలోనూ సాగింది. పాలకపక్ష ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. గేట్లు మరమ్మతులు డిసెంబరు 15 నాటికి పూర్తి చేస్తామని ఇరిగేషన్‌ అధికారులు వెల్లడించారు. డిసెంబరులోపే సాగునీరు అవసరం ఉంటుంది. జనవరి తర్వాత పంటలకు నీరు పెద్దగా అవసరం ఉండదు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ వద్ద దెబ్బతిన్న మూడు గేట్ల నుంచీ నీరు వృథాగాపోతోంది. ఎగువన వర్షాలు కురిస్తే రిజర్వాయర్‌కు నీరు చేరి నిండుతోంది. గేట్ల దెబ్బతిని లీకేజీల వల్ల నిల్వకు పూర్తి స్థాయిలో అవకాశం లేకుండా పోయింది. నీరు సముద్రం పాలవుతోంది. ఈ రిజర్వాయర్‌ కుడిఎడమ కాలువల ద్వారా రబీలో 80 వేల ఎకరాలకు సాగు నీరు ప్రశ్నార్థకమైంది. పొగాకు, మిర్చి, పత్తి, కూరగాయల సాగుకు నీరు అవసరం. పొగాకు సాగు కీలకంగా గుండ్లకమ్మ నీటిపైనే ఆధారపడి ఉంది.
 

                                                                యుద్ధప్రాతిపదికన చర్యలు పూజ్యం

వర్షాలకు రిజర్వాయర్‌ నిండింది. దీంతో, ఒక గేటు కొట్టుకుపోయింది. దీన్ని మరమ్మతులు చేపట్టాలని చూసినా కష్టంగా మారింది. మరో రెండు గేట్లు కూడా దెబ్బతిన్నాయి. లీకేజీలు పెరిగాయి. నీరంతా బయటకుపోతోంది. ప్రస్తుతం పది గేట్ల వరకూ దెబ్బతిన్నట్లు గుర్తించారు. వాటిని కదిలిస్తే ప్రమాదమే. నిర్వహణ దాదాపు పదేళ్ల నుంచి గాలికి వదిలేశారు. కొన్ని గేట్ల మరమ్మతులకు నిధులు అవసరమని అధికారులు గుర్తించారు. కోటి రూపాయలు కావాలని ప్రభుత్వానికి నివేదించారు. నిధుల విడుదలలో జాప్యం జరిగింది. ఈలోపు గత ఆగస్టు 31న మూడో నెంబరు గేటు విరిగిపోయింది. నీటిని నిలిపే చర్యలు ఫలించలేదు. దీంతో, అప్పటికే రిజర్వాయర్‌లో ఉన్న మూడు టిఎంసిల నీటిని దిగువకు వదిలేశారు. ఇరిగేషన్‌ మంత్రి అంబటి రాంబాబు ఈ ప్రాజెక్టును సందర్శించారు. వెంటనే మరమ్మతులు చేపట్టి సాగర్‌ నీటితో నింపి రైతులకు నీరిస్తామని ప్రకటించారు. ఇప్పటికీ మరమ్మతులు ఓ కొలిక్కిరాలేదు.
 

                                                      ఇప్పటికే 15 టిఎంసిల నీరు సముద్రం పాలు

గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నుంచి ఇప్పటికే 15 టిఎంసిల నీరు సముద్రం పాలైంది. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు లీకేజీల ద్వారా వెళ్లిపోతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.76 టిఎంసిల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నిల్వ మట్టం 3.8 టిఎంసిలు. ప్రస్తుతం నీరు కాలువలకు పూర్తిగా అందే పరిస్థితి లేదు. 200 క్యూసెక్కుల నీరు కాలువలకు పోతున్నాయి. పొలాలకు అందడం లేదు. ఇప్పట్లో గేట్ల మరమ్మతులు పూర్తయ్యే పరిస్థితి లేదు. రిజర్వాయర్‌లో నీరు లేకపోతేనే వాటిని మరమ్మతులు చేపట్టడానికి వీలుంటుందని అధికారులు చెప్తున్నారు. ఉన్న నీటిని వదిలేస్తే ఇంకా నష్టం పెరుగుతుంది. పోయినవరకూ పోయినా మిగిలినవైనా ఉంటాయని రైతులు చెబుతున్నారు.
 

                                                         వచ్చే నెల 15 నాటికి మరమ్మతులు కొలిక్కి.

వచ్చే నెల 15నాటికి గేట్ల మరమ్మతులు పూర్తి చేస్తామని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. జనవరి నాటికి గేట్లకు తాత్కాలిక చర్యలతో మూడు టిఎంసిల నీటిని నిల్వ చేసే మార్గాలు చూస్తామని అంటున్నారు. జడ్‌పి సమావేశంలో అధికారులు ఇదే సమాధానం చెప్పారు. అయితే, డిసెంబరు నాటికి ఎలా పూర్తి చేస్తారనేదీ స్పష్టత లేదు. ప్రస్తుతం మూడో గేటుకు తాత్కాలికంగా తయారు చేసిన డమ్మీ గేట్లను అడ్డంగా పెట్టారు. వాటి నుంచి కూడా నీరు లీక్‌ అవుతోంది. రబీలో పంటల సాగు మొదలైంది. పొగాకు నాట్లు వేస్తున్నారు. నీటి అవసరం ఇప్పటి నుంచే ఉంది. ఈ నెలాఖరు నుంచీ తోటలకు నీరు పెట్టాలి. పత్తి, మిర్చి తోటలకూ నీటి అవసరం ఇప్పటికే వచ్చింది. మరో నెల రోజులు నీరు లేకుంటే ఎలా అన్నదే ప్రశ్న. ఎంత మేరకు సాగు నీటిని అందిస్తారనేదీ ఇరిగేషన్‌ అధికారులపైనే ఆధారపడి ఉంది.