తిరువనంతపురం : కేరళలోని కలమస్సేరిలో పేలుళ్లకు సంబంధించి 48 ఏళ్ల అనుమానిత వ్యక్తి లంగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్‌లోని ప్రార్థనల సమయంలో జరిగిన పేలుళ్లలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే.
వివరాల ప్రకారం.. జెహోవా సాక్షుల సమావేశం కోసం కన్వెన్షన్ సెంటర్‌కు ఆదివారం ఉదయం సుమారు 2,000మందికి పైగా హాజరయ్యారు. వీరంతా ప్రార్థనల కోసం కళ్లు మూసుకుని ఉండగా ఉదయం 9.45 గంటల సమయంలో మొదటి పేలుడు జరిగింది. అనంతరం 5-10 నిమిషాల వ్యవధిలోనే వరుస పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు సంబంధించి 48 ఏళ్ల అనుమానిత వ్యక్తి కోడక్కర పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు కేరళ ఎడిజిపి (లా అండ్ ఆర్డర్) అజిత్ కుమార్ తెలిపారు.
ఈ పేలుళ్లలో ఒకరు మరణించగా, 56 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కన్వెన్షన్ సెంటర్ లోపలి వైపు తాళాలు వేసి ఉండటంతో వారిని క్షతగాత్రుల తరలింపు ఆలస్యమైంది. టిఫిన్ బాక్సులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా పేలుళ్లు జరిగినట్లు అధికారులు నిర్థారించారు.
హాల్ మధ్యలో మొదటి పేలుడు జరిగిందని కలమస్సేరి ఎంపి హిబి ఈడెన్ పేర్కొన్నారు. అదృష్టవశాత్తు వారిని తరలించేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేశామని, అయితే పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని అన్నారు. గాయపడిన వారిని జిల్లాలోని వివిధ ఆస్పత్రులకు తరలించామని, వీరిలో 18 మంది ఐసియులో ఉన్నట్లు తెలిపారు.
ఈ పేలుళ్లను దురదృష్టకరమైన ఘటనగా రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. పరిస్థితిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, పోలీసు శాఖ అప్రమత్తమైందని, పేలుడు ప్రదేశానికి చేరుకున్నట్లు తెలిపారు.
ఈ పేలుళ్ల ఘటనను జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఎ) విచారించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాక్ష్యాధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ టీమ్ ఆ ప్రదేశానికి చేరుకున్నట్లు పేర్కొన్నాయి. పేలుళ్ల ఘటనతో ఆరోగ్య సిబ్బంది అందరూ విధులకు హాజరుకావాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు.