ఎంసి జోసిఫిన్ నగర్ (తిరువనంతపురం) నుండి ప్రజాశక్తి ప్రతినిధి : బిల్కిన్ బానో కేసులో 11 మంది నేరస్తులకు గుజరాత్ ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షను తక్షణం రద్దు చేసి వారిని జైలుకు పంపాలని ఐద్వా మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రతిపాదించిన తీర్మానాన్ని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీనితో పాటు గుజరాత్ దాడుల ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని మహాసభ కోరింది. బిల్కిన్‌బానో కుటుంబంపై అమానుష హత్యాకాండ చేయడంతో పాటు సామూహిక మానభంగానికి పాల్పడ్డ నేరస్తులకు క్షమాభిక్ష ప్రకటించడం దిగ్భ్రాంతి కలిగించిందని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ అమానుష సంఘటనలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా గుజరాత్ ప్రభుత్వం అమలు పరచలేదని తెలిపారు. బికిన్‌బానోకు 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, ఆమెకు ఇంటితో పాటు ఉద్యోగం కూడా ఇవ్వాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని, అదే సమయంలో అమానుష కాండకు పాల్పడిన నేరస్తులకు క్షమాభిక్ష పెట్టిందని తెలిపారు. ఇది న్యాయస్థానాలను సవాల్ చేయడమేనని అన్నారు. ఇప్పటికైనా న్యాయస్థానాలు స్పందించి, క్షమాభిక్ష రద్దుచేసి నేరస్తులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. బిల్కిన్‌బానోకు న్యాయం చేయడానికి ప్రజాతంత్ర వాదులు, అభ్యదయ శక్తులు కలిసి రావాలని కోరారు. ఈ సంఘటనలో వాస్తవాలు వెలికితీసుకురావడానికి ప్రయత్నించిన హక్కుల కార్యకర్తలు తీస్తా సెతల్వాద్, ఆర్.శ్రీకుమార్, సంజీవ్‌భట్‌లపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని మహిళాసంఘం డిమాండ్ చేసింది. హర్యానాలో జూనియర్‌కోచ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన క్రీడల మంత్రి సందీప్‌సింగ్‌ను తక్షణం డిస్మిస్ చేయాలని మహాసభ తీర్మానించింది. ఉద్యమకారులపై, అభ్యుదయవాదులు, జర్నలిస్టులపై ఇటీవల కాలంలో పెరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యావాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళలకు మహాసభ సంఘీభావం తెలిపింది,. ఉపాధి హామీ పథకాన్ని చట్ట ప్రకారం అమలు చేయాలని, పట్టణ ప్రాంతంలో కూడా ఈ పథకాన్ని తీసుకురావాలని మరో తీర్మానంలో మహాసభ కోరింది. మహిళా శరణార్ధుల పట్ల మానవత్వ విధానం అంతర్జాతీయ సంక్షోభాల కారణంగా శరణార్థులుగా దేశంలోకి వస్తున్న మహిళలపట్ల మానవత్వంతో వ్యవహరించాలని, ఆ మేరకు ఒక విధానాన్ని రూపొందించాలని ఐద్వా జాతీయ మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సంక్షోభాలతో నిండిన పెట్టుబడిదారీ విధానం వలసలను అనివార్యం చేసిందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. మెరుగైన పేదరికం, ఆకలి నుండి తప్పించుకోవడానికి గ్రామాల నుండి పట్టణాలకు, పట్టణాల నుండి నగరాలకు, ఒక దేశం నుండి మరో దేశానికి తరలి వెళ్లడం అనివార్యంగా మారిందని తెలిపారు. దేశాల మధ్య చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు, యుద్దాలు కూడా వలసలకు కారణమవుతున్నాయన్నారు. బంగ్లాదేశ్. శ్రీలంక, మయన్మార్‌ల నుండి ఇలా మన దేశానికి దాదాపుగా 2 లక్షల మంది వలస వచ్చారని పేర్కొన్నారు. వీరిలో మహిళలు కూడా ఎక్కువగా ఉన్నారని తెలిపారు. హిందుత్వ మతోన్మాద శక్తులు వీరిపై రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అంటూ మహిళల అపహరణ, లైంగిక దాడులు, హత్యలు వంటిదారుణాలకు పాల్పడుతున్నారని, పౌరసత్వం చుట్టూ వివాదాలు లేవనెత్తుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మహిళా శరణార్దుల పట్ల మానవత్వంతో కూడిన విధానాన్ని అమలు చేయాలని కోరారు.
గంగా ముంపు బాధితులను ఆదుకోండి
పశ్చిమబెంగాల్‌లో గంగానది వరద కట్టలు కొట్టుకుపోవడం వల్ల ప్రతి సంవత్సరం ముంపు బారిన పడుతున్న ప్రజానీకాన్ని ఆదుకోవాలని మరో తీర్మానంలో ఐద్వా డిమాండ్ చేసింది. అధికారిక లెక్కల ప్రకారమే ప్రతి సంవత్సరం 8 చ.కి,మి.మేర భూమిని గత ఐదు సంవత్సరాలుగా గంగలో కలిసిపోతోందని తీర్మానంలో పేర్కొన్నారు. ఒక్క మాల్ధా జిల్లాలోనే 2021వ సంవత్సరంలో 4,500 కుటుంబాలు ఇళ్లను పోగొట్టుకున్నాయని తెలిపారు.
లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంలో జ్యోతిబస్సు ముఖ్యమంత్రి గా ఉన్నసమయంలోనే ఇక్కడ భూ క్షయాన్ని అరికట్టేందుకు కొన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం సమస్య తీవ్రమౌతున్న దృష్ట్యా ప్రభుత్వం తక్షణం స్పందించాలని, బాధితులను ఆదుకోవాలని కోరారు.
ట్రాన్స్‌జెండర్లుకు సభ్యత్వం
ఐద్వాలో ట్రాన్స్‌జెండర్లకు సభ్యత్వం కల్పించేలా నిబంధనలను సవరించారు. ఈ మేరకు ఐద్వా రాజ్యాంగానికి ఆ సంఘ జాతీయ నాయకులు సుభాషిణి ఆలీ ప్రవేశపెట్టిన సవరణను మహాసభ ఆమోదించింది. 15 సంవత్సరాలు అంతకు మించి వయసు ఉన్న మహిళ, లేదా ట్రాన్స్ జెండర్లు ఐద్వా లక్ష్యాలను ఆమోదించి, నిర్దేశించిన సరుసుము చెల్లిస్లే వారికి సభ్యత్వం ఇయ్యవచ్చని సవరణలో పేర్కొన్నారు,.










