- ముగిసిన లోకేష్ సిఐడి విచారణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు విచారణ బుధవారం ముగిసింది. ఉదయం పది గంటలకు ముందే తాడేపల్లిలోని సిఐడి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న లోకేష్‌ను పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించారు. మధ్యాహ్నం గంట భోజన విరామం ఇచ్చి ఆరు గంటలపాటు లోకేష్‌ను సిఐడి విచారించింది. మొదటి రోజు 50 ప్రశ్నలను అడిగిన సిఐడి, రెండో రోజు ఇన్నర్‌రింగ్ రోడ్డును పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌లో చూపుతూ.. 47 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.
- నా తల్లి ఐటి రిటర్న్‌లు ఎలా వచ్చాయి? : లోకేష్
సిఐడి విచారణ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. తమను ప్రభుత్వం వేధిస్తోందన్నారు. ఇప్పటి వరకూ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి సాక్ష్యాలను సిఐడి చూపలేకపోయిందన్నారు. మొదట రూ.3,200 కోట్లు అని ఆ తర్వాత రూ.370 కోట్లు అని, ఇప్పుడు తమ పార్టీ సభ్యత్వ రుసుముల మొత్తం రూ.27 కోట్లను చూపి ఇదే ఆధారమంటున్నారని అన్నారు. ఈ కేసులో ఎగ్జిక్యూటివ్ అధికారులు అయిన అజరు కల్లాం, గుజరాత్‌కు వెళ్లి సిమెన్స్ ప్రాజెక్టు బాగుందని నివేదిక ఇచ్చిన ప్రేమచంద్రారెడ్డి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు లేవన్నారు. పాలసీ మేకర్ అయిన నాటి ముఖ్యమంత్రిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తమకు గానీ, తన తల్లీదండ్రుల ఖాతాల్లోగానీ, చివరకు బంధువుల ఖాతాల్లోగానీ ఒక్క రూపాయి వచ్చినా చూపించాలని సవాల్ చేశారు. విచారణ సందర్భంగా ఈ కేసులో సంబంధం లేని తన తల్లి భువనేశ్వరి ఐటి రిటర్న్‌లు చూపారని, వారు ఐటి రిటర్న్‌లు ఎలా తీసుకున్నారో చట్టపరంగా పోరాటం చేస్తామని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో భాగంగా రెండో రోజు కూడా మొదటి రోజు ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారని అన్నారు. అప్పట్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తే హెరిటేజ్ భూములు పోతున్నాయని తనకు ఓ నిజం ఈ విచారణలో తెలిసిందన్నారు. లింగమనేని రమేష్‌కు అద్దె చెల్లింపులపై తనను ప్రశ్నించారని, అద్దెకు తీసుకోవడం క్విడ్ ప్రోకో కిందకు ఎలా వస్తుందని అన్నారు. సిఆర్‌డిఎ, రాజధాని ఎంపిక నిర్ణయం వంటి తన శాఖకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని తెలిపారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు, జిఓలు కోర్టు ఆదేశాలతో 99 ప్లాట్లకు ఇచ్చిన రిలాక్సేషన్ గురించి అడిగారన్నారు. హైకోర్టు ఒకరోజు విచారణే అని చెప్పినా సిఐడి అధికారుల నోటీసు మేరకు రెండోరోజూ విచారణకు హాజరయ్యానని, మూడోసారి విచారణకు పిలిచినా హాజరవుతానని తెలిపారు.
- ఐదు గంటల పాటు పునీత్‌ను విచారించిన సిఐడి
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌ను సిఐడి అధికారులు ఐదు గంటలపాటు విచారించారు. గురువారం మరోసారి విచారణకు రావాలని తెలిపారు.