May 16,2023 22:04

- ఎల్‌డిఎఫ్‌ మరో ఘనత
న్యూఢిల్లీ : సిపిఎం నేతృత్వ వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వ ప్రజానుకూల నిర్ణయాలతో నవ కేరళ దూసుకుపోతోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల సంక్షేమ కోసం ప్రత్యేకంగా సహాయనిధిని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా ఖ్యాతినొందిన మరుసటి రోజే మరో ప్రజా సంక్షేమ కార్యాక్రమానికి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం నడుంబిగించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ న్యాప్‌కిన్‌ వెండింగ్‌ మిషన్లును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సామాజిక మాధ్యమాల్లో మంగళవారం నాడు ప్రకటించారు. నెలసరి రోజుల్లో ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండటమనేది బాలికల ప్రాథమిక హక్కు అని ఈ సందర్భంగా విజయన్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేస్తుందని, వారి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తుందని తెలిపారు. బాలికల సాధికారతకు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదం చేస్తుందన్న ప్రగాఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.