చెన్నై : తమిళనాము ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మంద్రాస్ హైకోర్టు స్పందించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కే.. కానీ ఆ హక్కుతో విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదని మద్రాస్ హైకోర్టు తెలిపింది. ఇటీవల స్థానిక ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన 'సనాతన ధర్మం నిర్మూలన' సదస్సుకు తమిళనాడు క్రీడా మంత్రి ఉదనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం మహిళా సాధికారతకు వ్యతిరేకమని, కులాల వారీగా విభజిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. అసలు ఈ డిబెట్ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ.. ఎలాంగోవన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ శేషసాయి మాట్లాడుతూ.. 'సనాతన ధర్మం అనేది శాశ్వత కర్తవ్యాల సమాహారం. మన దేశం, పరిపాలకులు, రాజు, ప్రజలు, తల్లిదండ్రులు, గురువుల పట్ల మన బాధ్యతను గుర్తుచేసే శాశ్వత ధర్మాల సమాహారం. సనాతన ధర్మం పేదల పట్ల దయ చూపించమని చెబుతుంది. సనాతన ధర్మం కుల వ్యవస్థను ప్రోత్సహించి అంటరానితనాన్ని ప్రేరేపిస్తుందన్న అసత్య ప్రచారాన్ని న్యాయమూర్తి ఖండించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం ప్రాథమిక హక్కుల్లో భాగంగా అంటరానితనం రద్దు చేయబడిందని హైకోర్టు పేర్కొంది. అలాగే ఆర్టికల్ 51(ఎ) ప్రకారం రాజ్యాంగానికి కట్టుబడిడి ఉండడం, ఆదర్శాలను గౌరవించడం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అని కోర్టు పేర్కొంది.
కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని కోర్టు పేర్కొంది. అలాగే పౌరులందరూ ఏదైనా తమకు నచ్చిన మతాన్ని ఆచరించే ప్రాథమిక హక్కు ఉందని ఆర్టికల్ 25 తెలుపుతుందని కోర్టు పేర్కొంది. ప్రతి మతం విశ్వాసం అనే పునాది మీద నిర్మితమైందని, మతానికి సంబంధించిన విషయాల్లో వాక్ స్వేచ్ఛను ఉపయోగించినప్పుడు ఎవరూ గాయపడకుండా చూసుకోవడం అవసరం అని కోర్టు పేర్కొంది. ఇప్పటికే దీనిపై సర్క్యులర్‌ని కాలేజీ పసంహరించుకున్నందున ఈ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది.










