
తణుకు రూరల్ (పశ్చిమ గోదావరి) : అందరికి విద్య, వివక్షత లేని సమసమాజం కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తి జ్యోతి రావు పూలే అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీవీ.ప్రతాప్ అన్నారు. మంగళవారం జ్యోతి రావు పూలే జయంతి సందర్బంగా గోస్తని వంతెన వద్ద ఉన్న పూలే విగ్రహానికి సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ జ్యోతి రావు పూలే, నశించాలి కుల వివక్షత, అందరికి నాణ్యమైన విద్య ఉచితంగా ఇవ్వాలని, విద్యా ప్రయివేటికరణ ఆపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ప్రతాప్ మాట్లాడుతూ... జ్యోతి రావు పూలే శూద్ర, అతి శూద్ర సావిత్రి బాయి ద్వారా పాఠశాలలు స్థాపించి విద్యను అందించారని అన్నారు. విద్యా అనేది కొందరికే అనేదాన్ని వ్యతిరేకంగా అందరికి అందాలని గట్టిగ కృషి చేసారని తెలిపారు. సత్యశోదక్ సమాజ్ స్థాపించి ఎన్నో సేవలు అందించి మహాత్మునిగా ఘనతకెక్కారని అన్నారు. కానీ నేడు మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా నేటికీ విద్య అందరికి అందని ద్రాక్షలా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని ప్రయివేటికరణ చేయడం వలన నాణ్యమైన విద్య కొందరికే దక్కుతుందని అన్నారు. అయనకు నిజమైన నివాళి అంటే వివక్షత లేని సమసమాజం వచ్చినప్పుడే సాధ్యమవుతుందని దానికోసం సిపిఎం కఅషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గార రంగారావు, కామన మునిస్వామి, పి.దక్షిణా మూర్తి, వై.టి. రామకృష్ణ, టీ.రామకృష్ణ, త్రిమూర్తులు, రమణ, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.