Mar 02,2023 15:38

ప్రజాశక్తి-మైలవరం,ఎ. కొండూరు (ఎన్‌టిఆర్‌ జిల్లా) : మైలవరం, జామలాపురం, మేజర్‌లకు వెంటనే సాగర్‌ జలాలను విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. రైతు సంఘం నాయకులతో కలసి మైలవరం మేజర్‌ ఎన్‌ఎస్పి కాలువ, ఎ.కొండూరు తండా, జమలాపురం మేజర్‌ కాలువలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమలాపురం, మైలవరం మేజర్‌లకు సాగర్‌ జలాలు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. సకాలంలో సాగర్‌ జలాలను అందించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారన్నారు. ఒకవైపు పంటలు ఎండి పోతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. పదేపదే రైతు సంక్షేమం ప్రభుత్వం అని చెప్పే జగన్‌, నీరు రాక పంటలు ఎండి పోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే సాగర్‌ జలాలను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో రైతులందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా రైతు సంఘం నాయకులు శనగల రామకష్ణారెడ్డి,వజ్రాల వెంకటరెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షు డు పానం ఆనందరావు, సిఐటియు ఏ కొండూరు మండల కార్యదర్శి జట్టి.వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.