న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలో యువ ఓటర్లను ప్రోత్సహించేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను భారత ఎన్నికల సంఘం(ఈసి) 'ఎన్నికల ప్రచారకర్త'గా నియమించనుంది. ఈమేరకు మంగళవారం ఈసి ఓ నిర్ణయానికి వచ్చింది. బుధవారం ఢిల్లీలోని రంగ్ భవన్ ఆడిటోరియంలో సచిన్‌తో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇందులో భాగంగా ఓటింగ్‌పై సచిన్ మూడేళ్ల పాటు అవగాహన కల్పించనున్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో యువ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ ఒప్పందం ఎంతోగానో ఉపయోగపడుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. పట్టణ ప్రాంతాలు, యువతలో ఓటింగ్ పట్ల ఉన్న ఉదాసీనతలో మార్పు తీసుకువచ్చేందుకు ఈసి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందుకు కోసం కొన్నేళ్లుగా మనదేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను 'ప్రచారకర్త'లుగా నియమిస్తోంది. గతేడాది బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠిని ప్రచారకర్తగా నియమించింది. అంతకుముందు మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ, నటుడు ఆమీర్ ఖాన్, మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ కూడా ఎన్నికల ప్రచారకర్తలుగా వ్యవహరించారు.










