Apr 24,2023 17:44

లెజెండరీ క్రికెటర్‌, టీమిండియా మాజీ ప్లేయర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. 50వ అడుగుపెట్టిన అతడికి ఆస్ట్రేలియా క్రికెట్‌ గొప్ప బహుమతి ఇచ్చింది. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లోని ఒక గేటుకు సచిన్‌ టెండూల్కర్‌ పేరు పెట్టింది. ఈ గౌరవం అందుకున్న ఆస్ట్రేలియన్‌ కాని తొలి క్రికెటర్‌గా మాస్టర్‌ బ్లాస్టర్‌ రికార్డు సృష్టించాడు. సచిన్‌తో పాటు వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా పేరును కూడా ఆ గేటుకు పెట్టింది. ఈ గౌరవం పట్ల క్రికెట్‌ గాడ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. భారత్‌ తర్వాత సిడ్నీ నా ఫేవరెట్‌ గ్రౌండ్‌. 1991- 92లో ఆస్ట్రేలియాలో నా మొదటి పర్యటనతో మొదలు నాకు అక్కడ ఎన్నో గొప్ప జ్ఞాపకాలున్నాయి. నాతో పాటు నా మంచి స్నేహితుడు లారా పేరు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గౌరవం కల్పించినందుకు సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. త్వరలోనే సిడ్నీని సందర్శిస్తాను అని సచిన్‌ తెలిపాడు.