Sep 15,2023 10:43

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి
సిసిఐ విధించిన రూ.1,788 కోట్ల జరిమానా రైతులకు చెల్లించాలి
ఎఐకెఎస్‌ ఆధ్వర్యాన పార్లమెంట్‌ మార్చ్‌
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 
 రబ్బరు రైతులను కాపాడాలని, జాతీయ ప్రయోజనాలను కాపాడాలని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని ఎఐకెఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. రబ్బర్‌ను వ్యవసాయ పంటగా మార్చాలని కోరారు. అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌)కి అనుబంధంగా ఉన్న కేరళ, త్రిపుర, తమిళనాడు, కర్ణాటక నుంచి వందలాది మంది రబ్బరు రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గురువారం జంతర్‌ మంతర్‌ వద్ద పార్లమెంట్‌ మార్చ్‌ చేపట్టారు. ధర్నాలో ఎఐకెఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, విజాకృష్ణన్‌, ఉపాధ్యక్షులు ఇపి జయరాజన్‌, హన్నన్‌ మొల్లా, కోశాధికారి పి కృష్ణప్రసాద్‌, సంయుక్త కార్యదర్శులు వల్సన్‌ పనోలి, పబిత్రాకర్‌, ఎం.విజయకుమార్‌, రబ్బర్‌ సబ్‌ కమిటీ ఉపాధ్యక్షుడు జార్జి మాథ్యూ, కమిటీ సభ్యులు ఎన్‌ రవి, ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, సంయుక్త కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌ మాట్లాడారు.

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలే రైతుల దుర్భర పరిస్థితులకు కారణమని విమర్శించారు. ఆసియాన్‌ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రయత్నాలను బిజెపి ప్రభుత్వం ప్రారంభించగా, 2009లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంతకం చేసిందని విమర్శించారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫలితంగా థారులాండ్‌, మలేషియా, వియత్నాం, ఇతర దేశాల నుంచి సుంకం లేని రబ్బరు దిగుమతులు విపరీతంగా పెరిగాయని అన్నారు. భారతదేశంలోకి సహజ రబ్బరు దిగుమతులు 2005-06లో 45 మెట్రిక్‌ టన్నుల నుంచి 2022-23 నాటికి 5.28 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగాయని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా రబ్బరు ఉత్పత్తి చేసే రాష్ట్రమైన కేరళలోని రబ్బరు రైతులకు ఆసియాన్‌ ఒప్పందం వల్ల ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్‌ అగ్రనేతలు హామీ ఇచ్చారని కేరళకు చెందిన ఎఐకెఎస్‌ నాయకులు గుర్తు చేశారు. ఎంఆర్‌ఎఫ్‌ వంటి టైర్‌ తయారీ దిగ్గజాలు ఫ్రీ ట్రేడ్‌ నుంచి లాభపడ్డాయని తెలిపారు. కనీసం కిలోకు రూ.300 చొప్పున సరసమైన ధరను వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మోడీ పాలనలో కార్పొరేట్‌ అనుకూల విధానాలు ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా పెంచుతున్నాయని, ప్రస్తుత అతి తక్కువ ధరతో మనుగడ సాగించడం అసాధ్యమని చెప్పారు. రబ్బర్‌ బోర్డును నిర్వీర్యం చేసి తీవ్ర కార్పొరేట్‌ నియంత్రణకు బాటలు వేసే పనిలో మోడీ పాలన సాగుతోందని విమర్శించారు. రబ్బర్‌ (ప్రమోషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) బిల్లు-2023 బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల విధానానికి స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు.

టైర్ల బహుళ జాతి కంపెనీలు 2022లో మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడినందుకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) రూ.1,788 కోట్ల జరిమానా విధించినప్పుడు ఆయా కంపెనీల తప్పుడు పద్ధతులు స్పష్టంగా వెల్లడయ్యాయని చెప్పారు. రబ్బరు రైతులు, కార్మికుల జీవితాలను పణంగా పెట్టి ఎంఆర్‌ఎఫ్‌, అపోలో, జెకె, సిఐఎటి, బిర్లా వంటి ప్రముఖ టైర్‌ కంపెనీలు కోట్లను పోగుచేసుకుంటున్నాయని తెలిపారు. ఎఐకెఎస్‌ గతంలో డిమాండ్‌ చేసిన విధంగా సిసిఐ జరిమానా మొత్తాన్ని రబ్బరు రైతులకు చెల్లించాలని ఎఐకెఎస్‌ నేతలు పునరుద్ఘాటించారు.