విశాఖ రైల్వే జోన్ కోసం రూ.7.29 లక్షలే ఖర్చు : కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైల్వే జోన్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించామని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు రూ.106.89 కోట్లు అంచనా వ్యయం అనుమతించినట్లు చెప్పారు. జోన్ ఏర్పాటు ఖర్చులపైనా కేంద్ర మంత్రి అరకొర సమాధానమే చెప్పారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుపై రాజ్యసభలో వైసిపి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌పై అతి తక్కువ ఖర్చు అవుతుందని, ఈ ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం (2022 - 23)లో చేసిన ఖర్చు కేవలం రూ.7.29 లక్షలేనని చెప్పుకొచ్చారు. భూ సర్వే, హెడ్ క్వార్టర్స్ కాంప్లెక్స్ లే అవుట్, నివాస కాలనీ సహా నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాలని రైల్వే శాఖను కోరినట్లు పేర్కొన్నారు. భవనాల నమూనా ప్రాథమికంగా సిద్ధం చేశారన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా ఇప్పటికే సంబంధిత కమిటీ సమర్పించిందని తెలిపారు.
రాష్ట్ర వాటా రూ.3,723 కోట్లు చెల్లించాలి
ఎపిలో రైల్వే ప్రాజెక్టుల నిమిత్తం రాష్ట్ర వాటా రూ.3,723 కోట్లు చెల్లించాల్సి ఉందని వైసిపి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో లలిఖితపూర్వకంగా తెలిపారు. మొత్తంగా ఎపిలో రూ.17,073 కోట్లు విలువైన ఏడు ప్రాజెక్టులు చేపట్టామని పేర్కొన్నారు.
ఎయిమ్స్‌లలో 22,011 పోస్టులు ఖాళీ
దేశంలోని 20 ఎయిమ్స్‌లలో 22,011 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవర్ తెలిపారు. ఒక ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 22,011 ఖాళీ పోస్టుల్లో 19,914 నాన్ టీచింగ్, 2,097 టీచింగ్ పోస్టులు ఉన్నాయని అన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో 425 నాన్ టీచింగ్, 68 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
విదేశాల్లో 28,485 మంది మృతి
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు గత మూడేళ్లలో 28,485 మంది మరణించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. లోక్‌సభలో వైసిపి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో గడిచిన మూడేళ్లలో 24,278 మంది సహజ మరణం పొందారని, ట్రాఫిక్ ప్రమాదాల వల్ల 1,622 మంది మరణించారని, 686 మంది వృత్తి పరమైన ప్రమాదాల వల్ల, 1,763 మంది ఆత్మహత్యల వల్ల, 136 మంది హింస, హత్యల కారణాల వల్ల మరణించారని వెల్లడించారు.
1,98,208 పోస్కో కేసులు పెండింగ్
దేశంలో 1,98,208 పోస్కో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 డిసెంబరు 31 నాటికి ఎపిలో 7,328, తెలంగాణలో 7,544 పోస్కో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ొ దేశంలో 5,552,686 వినియోగదారుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రి సాద్వి నిరంజన్ జ్వోతి తెలిపారు.
రైళ్లలో అత్యవసర మందులతో ఫస్ట్ ఎయిడ్
రైలు ప్రయాణికులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు దేశంలోని అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులు, మెడికల్ సామగ్రి, ఆక్సిజన్ సిలిండర్ కలిగిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో వైసిపి ఎంపి వి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఫస్ట్ ఎయిడ్ సేవలు చేసేలా ఫ్రంట్ లైన్ సిబ్బంది, ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టిటిఇ), ట్రైన్ గార్డులు, సూపరింటెండ్లు, స్టేషన్ మాస్టర్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
బిఐఎస్ ఆమోదం లేని బొమ్మల తయారీపై చర్యలు
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఆమోదం లేకుండా బొమ్మలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి చెప్పారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. బిఐఎస్ ఆమోదం లేకుండా బొమ్మలు తయారు చేస్తున్న వారిపై తరచుగా దాడులు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఢిల్లీ వెలుపల బెంచ్‌లు సమర్థనీయం కాదు
ఢిల్లీ వెలుపల సుప్రీం కోర్టు బెంచ్‌లు సమర్థనీయం కాదని సుప్రీం కోర్టు పేర్కొందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. 2018 ఫిబ్రవరి 18న నిర్వహించిన ఫుల్‌కోర్టు సమావేశంలో ఈ మేరకు తెలిపిందని వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నేషనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఏర్పాటు అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సుప్పీం కోర్టు రిఫర్ చేసిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
2020 నుంచి నిధులు విడుదల లేదు
ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న 14 ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులకు 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 డిసెంబరు 31 వరకూ నిధులేమీ విడుదల చేయలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. 2019-20లో రూ.1.8 కోట్లు విడుదల చేసినట్లు వైసిపి ఎంపి మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
మంగళగిరిలోనూ కేన్సర్ చికిత్స సదుపాయం
మంగళగిరి, బిబి నగర్ సహా 22 నూతన ఎయిమ్స్‌లలోనూ కేన్సర్ చికిత్స సదుపాయానికి అనుమతించామని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. వైసిపి ఎంపిలు ఎంవివి సత్యనారాయణ, పోచ బ్రహ్మానందరెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.










