
ఏటేటా విద్యుత్ చార్జీల పెంపుదల, ఆ పెంపుదల భారాలకు మించి ట్రూఅప్ భారాల పెరుగుదల, ఇతర రూపాలలో అదనపు భారాల విధింపు సంస్కరణల కింద ప్రామాణిక ప్రక్రియగా కొనసాగుతున్నాయి. సంస్కరణల పేరుతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న, రాష్ట్రాలపై రుద్దుతున్న కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలు దీనిని తీవ్రతరం చేస్తున్నాయి. కేంద్రం ఆదేశాలకు తలొగ్గుతూ, ఆ విధానాలను అనుసరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. చట్టరీత్యా కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్లకు ఉన్నపాటి అధికారాలు, బాధ్యతలను కూడా వమ్ము చేస్తూ, మోడీ ప్రభుత్వం జారీ చేస్తున్న ఆదేశాలు ఈ విధానాల అమలుకు మార్గాన్ని సుగమం చేసే ఉపకరణాలుగా కమిషన్లను మారుస్తున్నాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 2000 సంవత్సరంలో విద్యుత్ భారాలకు, ప్రజావ్యతిరేక, ప్రైవేటీకరణ సంస్కరణలకు, విధానాలకు వ్యతిరేకంగా వంద రోజుల పాటు జరిగిన చరిత్రాత్మక ప్రజాపోరాటం పూర్వరంగంలో నెలకొన్న పరిస్థితికన్నా మరింత తీవ్రమైన పరిస్థితులు నేడు విద్యుత్ రంగంలో నెలకొంటున్నాయి. 2000 సంవత్సరంలో 100 రోజుల పాటు జరిగిన విద్యుత్ పోరాటంలో 25 వేల మందికి పైగా జైళ్ళ పాలయ్యారు. ఆ ఏడాది ఆగస్టు 28న బషీర్‌బాగ్‌లో జరిగిన పోలీసు కాల్పులలో ముగ్గురు యువకులు చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. ఎంత మొండి బండ ప్రభుత్వాలైనా సంఘటిత ప్రజా బలం ముందు తలొగ్గక తప్పదని...ఆ విద్యుత్ పోరాటం, ఢిల్లీలో దాదాపు ఏడాది పాటు జరిగిన రైతాంగ పోరాటం రుజువు చేశాయి.
2022-23 ఎఫ్‌పిపిసిఎ క్లెయిమ్‌లు రూ.7200 కోట్లు
త్రైమాసిక ప్రాతిపదికన ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు (ఎఫ్‌పిపిసిఎ) కింద 2021-22 సంవత్సరానికి రూ.3082.99 కోట్ల మొత్తాన్ని వినియోగదారుల నుండి వసూలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఎపిఇఆర్‌సి) గత మార్చి మొదటి తేదీన ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం డిస్కామ్‌లు వినియోగదారుల నుండి ఆ మొత్తాన్ని గత ఏప్రిల్ నుండి వసూలు చేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిశాక, డిస్కామ్‌లు ఎఫ్‌పిపిసిఎ కింద క్లెయిమ్‌లను తదుపరి ఆర్థిక సంవత్సరం జూన్ మాసాంతానికి కమిషన్‌కు సమర్పించాలి. వాటిపై కమిషన్ విచారణ జరిపి నిర్ణయిస్తుంది. 2022-23 సంవత్సరానికి డిస్కామ్‌లు రూ.7200 కోట్ల మేరకు ఎఫ్‌పిపిసిఎ కింద ట్రూఅప్ కోరుతూ కమిషన్‌కు పిటిషన్లు సమర్పించాయి. కమిషన్ నిబంధనల ప్రకారమే వాటిపై బహిరంగ విచారణ జరిపి సెప్టెంబరు మాసాంతానికి గాని, అంతకు ముందుగా గాని కమిషన్ ఉత్తర్వు జారీ చేయాల్సి ఉంది. ఈ క్లెయిమ్‌లలో కమిషన్ అనుమతించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించకపోతే, ఆ మొత్తం భారం వినియోగదారులపై పడుతుంది.
ఎఫ్‌పిపిసిఎ కింద ఏటా తన అనుమతి లేకుండా నెలకు యూనిట్‌కు 40 పైసల చొప్పున వినియోగదారుల నుండి వసూలు చేసుకునేందుకు విద్యుత్ పంపిణీ కంపెనీలకు ఎపిఇఆర్‌సి అనుమతిస్తూ గత మార్చి 29న జారీ చేసిన ఎఫ్‌పిపిసిఎ రెగ్యులేషన్ 2023-24 నుండి అమలులోకి వచ్చింది. ఆ విధంగా ఏటా వేలాది కోట్ల రూపాయల మొత్తాన్ని కమిషన్ ముందస్తు అనుమతి లేకుండా డిస్కామ్‌లు వినియోగదారుల నుండి వసూలు చేసుకునేందుకు మార్గం సుగమం అయింది. 2023-24 సంవత్సరానికి డిస్కామ్‌లు 67890 మి.యూ. మేరకు విద్యుత్ విక్రయాలు చేసేందుకు కమిషన్ చార్జీల ఉత్తర్వులో ఆమోదం తెలిపింది. అంటే, నెలకు యూనిట్‌కు 40 పైసల చొప్పున డిస్కామ్‌లు కమిషన్ ముందస్తు అనుమతి లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2715.60 కోట్ల మేరకు వినియోగదారుల నుండి ఎఫ్‌పిపిసిఎ కింద వసూలు చేసుకోవచ్చు. కమిషన్ బహిరంగ విచారణ జరిపి, నిర్ణయించిన చార్జీలను డిస్కామ్‌లు వసూలు చేసుకొంటుండగా, ఎఫ్‌పిపిసిఎ కింద డిస్కామ్‌లు చార్జీల పెంపుదల భారం కన్నా కొన్ని రెట్లు అధిక మొత్తాలను వినియోగదారుల నుండి ఏడాది పాటు వసూలు చేసుకున్న తరువాత కమిషన్ విచారణ జరిపి ఉత్తర్వు ఇవ్వటం నియంత్రణ ప్రక్రియను తలకిందులు చేయటమే. ఈ అడ్డదిడ్డం ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆదేశాలకు అనుగుణంగా జరిగినదే. ఈ ఉత్తర్వు కింద డిస్కామ్‌లు నెలనెలా వసూలు చేస్తున్న ఎఫ్‌పిపిసిఎ మొత్తానికి సంబంధించిన వివరాలపై కమిషన్‌కు నెలవారి నివేదికలను సమర్పించాలి. వాటి వెబ్‌సైట్లలో ఆ వివరాలను చూపాలి.
లోడ్ ఫోర్‌కాస్ట్, రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక
అయిదవ నియంత్రణ కాలానికి (2024-25 నుండి 2028-29 వరకు) విద్యుత్ అవసరం అంచనాలు, విద్యుత్ కొనుగోలు, వనరులు, పెట్టుబడుల ప్రణాళికలు, రాష్ట్ర విద్యుత్ ప్రణాళికపై, ఆరవ నియంత్రణ కాలానికి (2029-30 నుండి 2033-34 వరకు) సూచనప్రాయంగా ఈ ప్రణాళికలను ఎ.పి ట్రాన్‌స్కో, డిస్కామ్‌లు కమిషన్‌కు సమర్పించాయి. సాధ్యమైనంత తక్కువ వ్యయంతో వినియోగదారులకు అవసరమైన విద్యుత్‌ని నిలకడగా సరఫరా చేయటం, హెచ్చుతగ్గులతో రోజువారీ, సీజన్ వారీగా మారుతుండే డిమాండుకు అనుగుణంగా వివిధ రకాల విద్యుత్ మిశ్రమ సాంకేతికంగా సాధ్యమైనంత సమతూకంలో ఉండేటట్లు, మిగులు విద్యుత్ సాంకేతికంగా నివారించలేని మేరకు పరిమితమయ్యేటట్లు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పిపిఎ) చేసుకొనటం, విద్యుత్ ప్రమాదాల నివారణకు, భద్రతతో సహా ప్రసార, పంపిణీ వ్యవస్థల నిమిత్తం వివేకవంతమైన వ్యయంతో సంబంధిత పనులను సకాలంలో పూర్తిచేయటం ఈ ప్రణాళికల లక్ష్యం. ఉత్పత్తి నుంచి, వినియోగదారులకు సరఫరా చేసేవరకు అయ్యే మొత్తం వ్యయంలో దాదాపు 80 శాతం దాకా విద్యుత్ కొనుగోలు నిమిత్తమే అవుతున్నది. అందువల్ల, విద్యుత్ అవసరం అంచనాలు, పిపిఎలను చేసుకోవటం ఆ లక్ష్యాలకు అనుగుణంగా లేకపోవటం విద్యుత్ భారాల పెరుగుదలకు, ట్రూ అప్ భారాలకు కొన్ని ప్రధాన కారణాలు అవుతున్నాయి.
విద్యుత్ స్థాపక సామర్ధ్యం 2024-25లో 19660.92 మెగావాట్ల నుండి 2028-29లో 30529.78 మెగావాట్లకు పెరుగుతుందని డిస్కామ్‌లు తాజా అంచనాలలో చూపాయి. అయినా కూడా వచ్చే అయిదేళ్ళలో విద్యుత్ కొరత, సాయంత్రం పీక్ సమయాలలో (సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు) ఉంటుందని అంచనాలు చూపాయి. పగటిపూట (ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు) అయిదవ నియంత్రణా కాలం మొదటి, చివరి సంవత్సరాలలో వరుసగా 324 మె.వా., 428 మె.వా. కొరత ఉంటుందని, మిగిలిన మూడు సంవత్సరాలలో 449 మె.వా. నుండి 1479 మె.వా. వరకు మిగులు ఉంటుందని అంచనాలు చూపాయి. అయిదవ నియంత్రణా కాలంలో అమలవుతాయని తాము పరిగణనలోకి తీసుకున్న ప్రాజెక్టులు మినహా, ''వివిధ సంస్థలు'' కొత్తగా ప్రాజెక్టులు నెలకొల్పే అవకాశం కన్పించటం లేదని డిస్కామ్‌లు పేర్కొన్నాయి. అదే సమయంలో, తక్కువ ఖర్చుతో ''కొత్త ప్లాంట్ల'' నుండి తాము విద్యుత్ కొనుగోలు చేయగలటంపై కొంత స్పష్టత'' రాగానే అందుకు అనుమతి కోసం కమిషన్ దృష్టికి తెస్తామని డిస్కామ్‌లు పేర్కొన్నాయి. భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు పునరుత్పత్తి అయ్యే (ఆర్.ఇ) మిశ్రమ విద్యుత్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టుల వంటి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు, అధ్యయనం చేస్తున్నట్లు డిస్కామ్‌లు వివరించాయి. రాష్ట్రంలో ఆశ్రిత పెట్టుబడిదారులకు ఇలాంటి ప్రాజెక్టులను నెలకొల్పేందుకు వీలు కల్పించి, అనుమతులను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. వాటి నుండి ఏ పద్ధతిలో, ఎంత వ్యయంతో, ఏ సమయాలలో విద్యుత్ సరఫరాకు, కొనుగోలుకు అవకాశాలుంటాయనే దానిపై రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు ఇంకా స్పష్టత లేదు. డిస్కామ్‌లకు వచ్చే స్పష్టతతో, పర్యవసానాలతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వ ఆదేశాల మేరకు అవి ఇలాంటి ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రాజెక్టుల నుండి విద్యుత్ కొనుగోలుకు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటాయని అనుభవం నిర్ధారిస్తున్నది.
అవసరాలతో నిమిత్తం లేకుండా ఆర్.ఇ విద్యుత్తును మితిమీరి కొనుగోలు చేసేందుకు చేసుకున్న పిపిఎల వల్ల తలెత్తిన, తలెత్తనున్న సాంకేతిక, ఆర్థికపరమైన సమస్యలను, తమకు అదనపు వ్యయం భారం అయ్యే అంశాలను డిస్కామ్‌లు పై ప్రణాళికలపై మేము లేవనెత్తిన అంశాలకు ఇచ్చిన సమాధానాలలో పునరుద్ఘాటించాయి. అయినా కూడా, కేంద్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారం అయిదవ నియంత్రణా కాలంలో కూడా భారీగా ఆర్.ఇ విద్యుత్ కొనుగోలు చేస్తామని డిస్కామ్‌లు ప్రతిపాదించాయి. మొత్తం విద్యుత్ వినియోగంలో కొనితీరాల్సిన పునరుత్పత్తి అయ్యే విద్యుత్ వచ్చే అయిదేళ్ళలో ఏటా 27.41 శాతం నుండి అత్యధికంగా 38.16 శాతం మేరకు చేరుతుందని భావిస్తున్నట్లు డిస్కామ్‌లు పేర్కొన్నాయి. దీని వల్ల తలెత్తే సమస్యలు, నష్టాలు తీవ్రమైతే ఏమి చేయాలనే దానిపై, డిమాండును తీర్చేందుకు అవసరమైన విద్యుత్ మిశ్రమం ఎలా సాధ్యమవుతుందనే దానిపై డిస్కామ్‌లు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఆ విద్యుత్ కొనుగోలు అంత విపరీతంగా పెరిగితే, అవి పునరుద్ఘాటించిన సమస్యలు, నష్టాలు, భారాలు కూడా పెరుగుతాయి.
అవసరమైన సమాచారం ఇవ్వని డిస్కామ్‌లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో ముగుస్తున్న నాల్గవ నియంత్రణా కాలానికి కమిషన్ ఆమోదించిన పై ప్రణాళికల అమలు తీరుతెన్నులపై డిస్కామ్‌లు సమగ్రంగా విశ్లేషణ చేసి, ఆ అనుభవాలను, అవసరమైన ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి నియంత్రణా కాలానికి వాస్తవిక ప్రతిపాదనలు చేయాల్సిన అవసరాన్ని కమిషన్‌కు సమర్పించిన అభ్యంతరాలు, సూచనలలో వివరించాము. కమిషన్ ఆదేశం మేరకు ఆ వివరాలను కమిషన్‌కు సమర్పించినట్లు డిస్కామ్‌లు సమాధానమిచ్చాయి. ఆ వివరాలను అవి అభ్యంతరదారులకు పంపలేదు. కమిషన్, డిస్కామ్‌ల వెబ్‌సైట్లలో కూడా వాటిని చూపలేదు. భారీగా అక్రమాలు జరిగాయని తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చిన ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల వ్యవహారానికి సంబంధించిన వివరాలను, ముఖ్యంగా ఒక్కో మీటరును ఎంత రేటుకు కొనుగోలు చేస్తున్నది, వాటి నిర్వహణకు ఏడాదికి ఎంత చెల్లించనున్నదీ వెల్లడించకుండా డిస్కామ్‌లు దాటవేశాయి. ఈ నెల 19న కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో అభ్యంతరదారులు గట్టిగా నిలదీశాక, కమిషన్ ప్రశ్నించాక ఆ వివరాలను అభ్యంతరదారులకు అందజేసేందుకు డిస్కామ్‌లు, ట్రాన్స్‌కో అంగీకరించాయి. వారం రోజులలో ఆ సమాచారాన్ని అందించాలని, ఆ తరువాత రెండు వారాలలో అభ్యంతరదారులు తదుపరి నివేదనలను పంపవచ్చునని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి ప్రకటించారు.
విద్యుత్‌కు కొరత ఏర్పడుతుందని ప్రతిపాదించటం ప్రణాళికా విధానం ఎలా అవుతుందని అభ్యంతరదారులు విచారణలో విమర్శించారు. అవసరమైన విద్యుత్ సేకరణకు ముందుగానే ఎందుకు ప్రణాళికను రూపొందించలేదని కమిషన్ ఛైర్మన్ డిస్కామ్‌లను ప్రశ్నించారు. కొరత ఉండే విధంగా ఈ ప్రణాళికలను కమిషన్ ఖరారు చేయజాలదని ఆయన స్పష్టం చేశారు. మూడు మాసాలలో ప్రణాళిక ఖరారుకు అవసరమైన సమాచారం సమర్పిస్తామని డిస్కామ్‌ల ప్రతినిధి కమిషన్‌కు నివేదించారు. డిస్కామ్‌లు అందజేసే అదనపు సమాచారంపై కూడా బహిరంగ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. భారీ విద్యుత్ భారాలు పొంచి వున్నాయి. వినియోగదారులారా బహుపరాక్!
/
వ్యాసకర్త విద్యుత్ రంగ నిపుణులు ఎం. వేణుగోపాలరావు