ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. మండపేట మండలంలో ఈ రబీ సీజన్ కు సంబంధించి 16587 ఎకరాల్లో ఎంటియు 1121 (సన్నాలు) ఎంటియు 3626 (బండాలు) 4259 ఎకరాల్లో రైతులు వరిని పండిస్తున్నారు. 63,446 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఎంటియు 1121 రకం 47,155 మెట్రిక్ టన్నులు ఎంటియు 3626 రకం 16,290 మెట్రిక్ టన్నులు. మండపేట పట్టణంలో ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో 23 ఆర్బీకే లు, 6 సొసైటీలు ఉన్నాయి. అన్నింటిలోను ధాన్యం కొనుగోలుకు అధికారులు సిద్ధం చేశారు. ఐతే బండాలు రకం ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావలసి వుందని అధికారులు చెబుతున్నారు.
డీజిల్ పెరుగుదలతో అదనపు భారం
పెట్రోల్, డీజిల్ రోజు రోజుకు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలతో పాటు రైతులపైన దీని ప్రభావం పడింది. గత ఏడాది ఒక ఎకరం వరి చేను కోయడానికి కోత మిషన్‌కు రూ.2,000 నుంచి రూ.2,100 ఉండగా ఆయిల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో రూ. 2500 నుంచి 2600 రూపాయలు పలుకుతుందని రైతులు అంటున్నారు. దీంతో తమపై అదనపు భారం పడిందని రైతున్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు.