ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్ : ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఎరుకలి రామసుబ్బమ్మ అత్యంత పేదరాలు అని, ఆమె భూమిని కాపాడాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.నాగన్న, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు జి శ్రీధర్ షాజహాన్, మండల రైతు సంఘం నాయకులు చంద్రబాబు నాయుడు, మధుసూదన్ లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం జి.రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ... రామసుబ్బమ్మకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, భర్త చనిపోయినప్పటి నుండి అత్యంత కష్టంతో జీవనం సాగిస్తున్నదని చెప్పారు. అలాంటి ఎరుకలి రామసుబ్బమ్మకు ఆన్‌లైన్‌లో ఉన్న భూమిని ఎంతో శ్రమటోడ్చి ఖర్చుపెట్టి కొండనంత తవ్వి చదును చేసి పొలంగా మార్చి సంవత్సరాలుగా రకరకాల పంటలు వేస్తూ ప్రస్తుతం టేకు చెట్లు నాటుకొని వాటిని కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నదన్నారు. సర్వేనెంబర్ 797 ఏ 15 లో సాగు చేసిందని చెప్పారు. ఈమెకు గతంలో ప్రభుత్వంవారు భూమికి పట్టా ప్రదానం చేశారు అని, ఈ భూమిని రక్షణ పరిశోధన కేంద్రం (డిఆర్డిఏ) కోసం తీసుకోవడం వలన ప్రత్యామ్నాయంగా ఈ భూమిని చూపించారని తెలిపారు. అప్పటినుండి ఆ భూమిని సాగు చేస్తూ ఉందని అన్నారు. అయితే ఇప్పుడు ఆమె భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడం సమంజసం కాదు అని అన్నారు. పేదరాలైన ఎరుకలి రామసుబ్బమ్మకు తహశీల్దారు ఆర్టీవో కలెక్టర్ పరిశీలించి న్యాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎరుకలి రామసుబ్బమ్మ ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిందని ఫలితంగా న్యాయస్థానం కూడా అనుకూలమైన ఆర్డర్ ను ఇచ్చిందన్నారు. కాబట్టి ఆమె పొలంలోకి వాహనాలు ప్రవేశించకుండా దండలు చెరిపి వేయకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎరుకలి రామసుబ్బమ్మకు ప్రజాసంఘాలు అండగా ఉంటాయని స్పష్టం చేశారు.










