- సాగు, తాగు నీరు ఇచ్చే వరకూ పోరాటం
- మహా పాదయాత్ర ప్రారంభంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి :జిల్లా సమగ్రాభివృద్ధి ప్రభుత్వాల బాధ్యతని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ అన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి సిపిఎం చేపట్టిన మహా పాదయాత్రను ఆదోనిలో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పిఎస్.రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో గఫూర్ మాట్లాడుతూ అధికారం కోసం చాలామంది పాదయాత్రలు చేస్తుంటారని, ఈ పాదయాత్ర అధికారం కోసం కాదని, జిల్లా అభివృద్ధే లక్ష్యమని తెలిపారు. జిల్లాకు సాగు, తాగు నీటి కోసం జరుగుతున్న ఈ పోరాటాన్ని అందరూ బలపరచాలని కోరారు. రాష్ట్ర, జిల్లా విభజన తరువాత కర్నూలు జిల్లా వెనకబడి ఉందన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ అజెండా ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు తప్ప, వారి భవిష్యత్, అభివృద్ధి పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాలోని చాలా ప్రాంతాలకు కనీసం తాగునీరు కూడా అందడం లేదన్నారు. వాటాలో సగం నీళ్లు కూడా జిల్లాకు రావడం లేదని తెలిపారు. ఈ ప్రాంత విద్య, ఉపాధి కోసం ఆలోచించడం లేదన్నారు. అమరావతితోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధీ ప్రభుత్వాల బాధ్యతని తెలిపారు. ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో ముఖ్యమంత్రి జగన్ లేరని విమర్శించారు. ప్రజల సొమ్ము కొల్లగొట్టడానికా ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రశ్నించారు. పాదయాత్రకు సిపిఐ, కాంగ్రెస్, ఆర్‌సిసి నాయకులు మద్దతు తెలిపారు. సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశారు, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, కాంగ్రెస్ పార్టీ ఆదోని ఇన్‌ఛార్జి ప్రకాష్, ఆర్‌సిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, సాగునీటి సాధన పోరాట నాయకులు ఆదినారాయణరెడ్డి, బిసి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి తదితరులు పాల్గన్నారు. అనంతరం జెండా ఊపి పాదయాత్రను గఫూర్ ప్రారంభించారు. ఆదోని పాత బస్టాండ్ నుండి ప్రారంభమైన పాదయాత్ర భీమాస్ కూడలి, ఎమ్మిగనూరు రోడ్డు కూడలి, తిక్కస్వామి దర్గా, ఆర్ట్స్ కాలేజీ, బైచిగేరి క్రాస్, అరేకల్ మీదుగా బనవాసి ఫారం వరకు సాగింది. గురువారం బనవాసి ఫారం నుండి హనుమాపురం, ఎమ్మిగనూరు మీదుగా గోనేగండ్ల వరకూ సాగనుంది.










