
అమెరికా లోని పదహారు శాతం కుటుంబాలు (రెండు కోట్లు) కరెంటు బిల్లులు కట్టలేని స్థితిలో విద్యుత్ కంపెనీలు ఫీజులు పీకుతున్నట్లు వార్తలు. అద్దె కట్టే స్థోమత లేక నాలుగు డబ్బులు వచ్చేంత వరకు అప్పు చేసి కొనుక్కున్న కార్లలో వారాల తరబడి కాపురాలు చేసే వారు కూడ అక్కడ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అద్దె కట్టలేక రానున్న రెండు మాసాల్లో ఇళ్లు ఖాళీ చేయాల్సిన వారు 38 లక్షల మంది ఉన్నారన్నది తాజా వార్త.
మన దేశంలో ధరల పెరుగుల సూచిక లెక్కింపు పద్ధతి తప్పుల తడక. ఎందుకంటే కార్మికులకు చెల్లించాల్సిన కరువు భత్యాన్ని ఎగవేసేందుకే అన్నది తెలిసిందే. అమెరికా ప్రభుత్వం కూడా దీనికి మినహాయింపు కాదు. దాని లెక్కల ప్రకారం ఏడాది కాలంలో ఇంటి అద్దెలు 5.7 శాతం పెరిగితే అనధికారిక అంచనా పదిహేను శాతం. అక్కడ 85 లక్షల మంది అద్దె ఇంటి వారుంటే 38 లక్షల మంది అద్దె చెల్లించలేని ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. కిరాయిదార్లలో సగం మందికి అద్దెలు సగటున నెలకు 250 డాలర్లు పెరిగాయి. అవసరాలను తీర్చుకొనేందుకు రుణాలు తీసుకోవటం, కూడబెట్టుకున్నదాన్ని ఖర్చు పెట్టటం, ఆస్తులను అమ్ముకోవటం వంటి వాటికి పాల్పడాల్సి వస్తోందని 57 శాతం మంది కిరాయిదార్లు చెప్పినట్లు సర్వేలు వెల్లడించాయి. ఇదంతా పెరుగుతున్న ద్రవ్యోల్బణం -ధరల పెరుగుదల, వాటికి తగినట్లుగా రాబడి పెరగకపోవటం అన్నది వేరే చెప్పనవసరం లేదు. గృహస్తుల రుణాలు ఏడాది కాలంలో పదిన్నరశాతం పెరిగి జూన్ నెలలో వారి మొత్తం అప్పుకు 40.1 బిలియన్ డాలర్లు తోడయ్యాయి. గత రెండు దశాబ్దాల్లో లేని విధంగా క్రెడిట్ కార్డుల అప్పు పదమూడు శాతం పెరిగింది. లేబర్ మార్కెట్ ఎంతో పటిష్టంగా ఉందంటూ ఏ నెలలో ఎందరికి ఉపాధి దొరికిందో లెక్కలు చెబుతున్నారు. ఎన్ని ఉద్యోగాలన్నది కాదు. వేతనాలు అందునా నిజవేతనాలు ఎంత అన్నది కీలకం. అందుకే ఈ సూచికలన్నీ పరిస్థితి సజావుగా లేదని వెల్లడిస్తున్నాయి. అంతా బాగుంటే అద్దె ఇళ్లు ఎందుకు ఖాళీ చేస్తున్నారు, కరెంటు బిల్లులు ఎందుకు కట్టలేకపోతున్నారు ?
అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి కూరుకుపోతుందా లేదా అన్న చర్చ ఇప్పుడు అమెరికా అంతటా జరుగుతోంది. దేశ వృద్ధి రేటు 2023లో 0.1 శాతం ఉంటుందని కొందరు కాదు 0.4 శాతం తిరోగమనం (మైనస్)లో ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఇంతవరకు అలాంటి ప్రకటన వెలువడలేదు, నిజంగా దిగజారితే అది చాలా కాలం ఉంటుందన్న ఆందోళన వెల్లడౌతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అమెరికా గురించి వేసిన అంచనా ప్రకారం 2022లో 2.3, మరుసటి ఏడాది ఒకశాతం వృద్ధి రేటు ఉంటుందని చెప్పింది. వచ్చే ఏడాది ప్రారంభంలో మాంద్యం మొదలు కానుందని ఫెడరల్ నేషనల్ మార్టిగేజ్ సంస్థ చెబుతోంది. వర్తమాన 2022లో వృద్ధి రేటు 0.1 శాతం, 2023లో 0.4 శాతం తిరోగమనం అని చెప్పింది. అంతకు ముందు అంచనాలు 1.2, 0.1 శాతాలుగా ఉన్నాయి. గతంలో 1982లో 1.8 శాతం, 2009లో 2.6 శాతం, 2020లో 3.4 శాతం తగ్గినా మిన్ను విరిగి మీద పడలేదని అలాంటపుడు వచ్చే ఏడాది 0.4 శాతం తగ్గితే ఆందోళన అవసరం లేదన్నది ఒక అభిప్రాయం. ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరొకదారి అన్నట్లు జీవితాలు ఏమౌతాయిరా బాబూ అని కార్మికులు ఆందోళన చెందుతుంటే మాంద్యంలో కూడా ఎలా లాభాలు పొందవచ్చునో చెబుతూ ఆర్థిక రంగ వార్తలను మాత్రమే ప్రధానంగా ఇచ్చే మీడియా మదుపుదార్లకు సలహాలిస్తోంది.
ఏ దేశమూ మాంద్యంలోకి పోవాలని ఎవరూ కోరుకోరు. ప్రస్తుతం పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న వాటిలో చైనా, జపాన్ ద్రవ్యోల్బణానికి దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు అమెరికా వడ్డీ రేట్లను పెంచింది. దాని దెబ్బకు బలమైన ఐరోపా కరెన్సీ కూడా విలవిల్లాడుతోంది. ఇంకా పెంచవచ్చని ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ సూచించారు. అమెరికా అధిక ద్రవ్యోల్బణం కనీసం ఏడాది, రెండు సంవత్సరాలు కొనసాగుతుందని ఐఎంఎఫ్ తొలి ఉపమేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ హెచ్చరించారు. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా అమెరికా మాంద్యంలోకి జారితే దాని ప్రతికూల పర్యవసానాలు ప్రతి దేశం మీదా పడతాయి.
- ఎం.కె.ఆర్