Jul 28,2023 21:36

ప్రజాశక్తి - పెనుకొండ : శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని మడకశిర రోడ్డులో మెడికల్‌ కళాశాల ఎదుట పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసులు తొలగించారు. సొంత ఇల్లు లేని పేదలు తమకు ఇంటిస్థలాలు కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులను కోరారు. ఎలాంటి స్పందనా లేకపోవటంతో 668 సర్వే నంబర్‌లో ఐదు రోజుల క్రితం భూపోరాటం చేపట్టి పేదలు గుడిసెలు వేసుకున్నారు. అహుడా (అనంతపురం, హిందూపురం డెవలప్‌మెంట్‌ సొసైటీ) అధికారులు, తహశీల్దార్‌ ఫిర్యాదు మేరకు పేదల గుడిసెలను శుక్రవారం పెనుకొండ పోలీసులు తొలగించారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పెద్దన్న, గంగాధర్‌, సిఐటియు నాయకులు రమేష్‌, రామాంజనేయులుపై గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. నాయకులు, పేదలు శుక్రవారం ఉదయం పెద్దఎత్తున తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల స్థలాల కోసం తహశీల్దార్‌, కమిషనర్‌, సబ్‌ కలెక్టర్‌, సచివాలయంలో అర్జీలు ఇచ్చామన్నారు. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో స్థలాలు చూపిస్తామని హామీ ఇచ్చిన పాలకులు, అధికారులు ఇప్పటివరకు స్థలం చూపకపోవడంతో భూ పోరాటం చేపట్టిన స్థలం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, వెంకటేష్‌, నిరుపేదలు పాల్గొన్నారు.