'ఇప్పటివరకూ అనసూయ అనగానే రంగమ్మత్త పాత్రనే గుర్తు చేసుకుంటున్నారు. 'పెదకాపు 1' విడుదల తర్వాత ఇందులోని పాత్ర పేరుతోనే నన్ను పిలుస్తార'ని చెప్పారు అనసూయ. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న రానుంది. ఈ సందర్భంగా అనసూయ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. 'రంగమ్మత్త పాత్ర తర్వాత అందుకు ధీటైన పాత్రల్నే ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్నా. కానీ నుదుటిపై అలా ఓ పెద్ద బొట్టు పెట్టుకుని కనిపించేసరికి మళ్లీ రంగమ్మత్త అనే అంటున్నారు. 'పెదకాపు 1' నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన మరో కథ. శ్రీకాంత్ అడ్డాల అనగానే ఆయన తరహా కథల్నే ఊహించుకుంటాం. కానీ ఓ కొత్త తరహా కథని ఈ సినిమాతో చెప్పారు. పాత్రలన్నీ కూడా చాలా బలంగా ఉంటాయి. నా వేషం, సంభాషణలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి.'' అని అన్నారు. 'అన్ని రకాల పాత్రలూ చేయాలనుకుంటాను. అమ్మమ్మ పాత్రకైనా నేను సిద్ధమే. కాకపోతే సినిమా విడుదల తర్వాత అమ్మమ్మ గురించి మాట్లాడుకునేలా ఉండాలి.'' అని ఒక ప్రశ్నకు జవాబుగా అన్నారు.










