
మహిళల గురించి మనుస్మృతి భావనలు, మన రాజ్యాంగంలో పేర్కొన్న లింగ సమానత్వం ఒకటి కాదనే విషయాన్ని జడ్జీలు, ప్రధానమంత్రి, దేశ రాజకీయ నాయకులు, న్యాయ వ్యవస్థ, సమాజం అర్థం చేసుకోవాలి.
దేశం కోసం చట్టాలను, నియమ నిబంధనలను తయారు చేసే కార్యనిర్వాహక శాఖ భారత్‌లో ఉంది. రాజ్యాంగంలో పొందుపరచిన విలువలను కాపాడడానికి, రాజ్యాంగ మార్గాన్ని అనుసరించేందుకు కార్యనిర్వాహక శాఖకు న్యాయ వ్యవస్థ హామీ ఇస్తుంది. ప్రస్తుతం, న్యాయ వ్యవస్థపై కార్యనిర్వాహక శాఖ ఒత్తిడి ఉందనీ, కార్యనిర్వాహక శాఖ తన మార్గాన్ని తప్పుతుందనే భావన ఉంది. ఇటీవల ధర్మాసనం నుండి, రాజకీయాల నుంచి వచ్చిన కొన్ని ప్రకటనలు ఈ భావనకు తోడయ్యాయి. ఈ సమస్య చాలా లోతైనది.
ఎక్కడ మహిళలు గౌరవించబడతారో ఆ ఇళ్ళల్లో దేవుళ్ళు చాలా సంతోషంగా నివాసం ఉంటారని మనుస్మృతి లోని 3/56వ శ్లోకం చెప్తుంది. కానీ ప్రస్తుత సమాజంలో మహిళల వాస్తవ పరిస్థితిని ఈ అభిప్రాయం ప్రతిబింబిస్తున్నదా? మనుస్మృతి చెప్పిన విషయాలనే హిందూ మతైక జాతీయవాద సిద్ధాంతకర్తలు పునశ్చరణ చేస్తున్నారు. కానీ మనుస్మృతి అనుయాయులు, సమాజంలో మహిళల అధమ స్థానం గురించి చెప్పిన ఇతర అభిప్రాయాలను ఎక్కడా ప్రస్తావించడంలేదు. ''ఆఖరికి తన ఇంట్లో కూడా మహిళ ఏదైనా పనిని స్వతంత్రంగా చెయ్యడానికి వీలు లేదు. శిశువుగా తండ్రి అదుపులో, యువతిగా భర్త అదుపులో, భర్త మరణానంతరం కొడుకుల అదుపులో ఉండాలని'' మనుస్మృతి లోని ఐదవ అధ్యాయం లోని 148వ శ్లోకం చెప్తుంది.
సమస్యేమంటే, ఆఖరికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటీవల మహిళలకు ''రక్షణ'' కల్పించాలనే విషయం గురించి మాట్లాడినప్పుడు పితృస్వామిక నిఘంటువును ఉపయోగించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి ప్రసంగించే సమయంలో ఆవిధంగా పేర్కొన్నారు. తమ ప్రీతిపాత్రమైన గ్రంథం, వాస్తవానికి లింగ (జెండర్) మరియు కులం మధ్య సంబంధాన్ని నిర్దేశిస్తుందని...బ్రాహ్మణవాదం సమర్థించే క్రమానుగత విలువలకు రూపం ఇస్తుందని...సావర్కర్ నుండి గోల్వాల్కర్ వరకు, మనుస్మృతిని అనుసరించే వారెవరూ పేర్కొనరు. ''అతడు సుగుణాలు లేని వాడైనప్పటికీ, కామాంధుడైనప్పటికీ, మంచి లక్షణాలు లేనివాడైనప్పటికీ, మంచి మహిళ తన భర్తను నిత్యం దైవంగా పూజించాలి'' అని మనుస్మృతి లోని ఐదవ అధ్యాయంలోని 149వ శ్లోకం చెప్తుంది. అగ్రకులానికి చెందిన మహిళతో నిమ్న కులానికి చెందిన పురుషుడు లైంగిక సంబంధం కలిగి ఉంటే అతనికి మరణశిక్ష విధించాలని కూడా మనుస్మృతి చెప్తుంది. ప్రధానమంత్రి చేసిన అలాంటి ప్రకటనలు...స్వాతంత్య్రోద్యమ కాలంలో మహిళలు మనుస్మృతిని కాపాడుకోవాలని పోరాటం చేయలేదనీ, కుల వ్యవస్థను కాపాడడానికి పోరాటం చేయలేదనీ, 'రక్షణ'ను కోరుతూ పోరాటం చేయలేదనే విషయాన్ని మనం మరచిపోయేలా చేస్తాయి.
మనుస్మృతిని 170 బీసీఈ మరియు 150 బీసీఈ మధ్య కాలంలో అంటే బౌద్ధమతం పైన, బౌద్ధుల పైన బ్రాహ్మణ రాజైన పుష్యమిత్ర శుంగ దాడులు చేసిన కాలంలో రాసి ఉంటారని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన రచనలు, ప్రసంగాల మూడో సంపుటిలో పేర్కొన్నాడు. బౌద్ధం సమానత్వ విలువలను వ్యక్తీకరించింది, కానీ భారతదేశంలో అనేక దాడులను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. భారతదేశంలో ఆధునిక విద్యను వలస కాలంలో ప్రవేశపెట్టారు. సాంఘిక సంస్కరణలు భావనాత్మకం కావడం మొదలయ్యాయి. అది, సావిత్రీ బాయి ఫూలే లాంటి సంఘసంస్కర్తలు ఆడపిల్లల కోసం పాఠశాలలు ప్రారంభించినప్పుడే వాస్తవానికి మహిళల సమానత్వం కోసం పోరాటం ప్రారంభమైంది. మను ధర్మ శాస్త్రాన్ని అనుసరించే సామాజిక సాంప్రదాయవాదుల నుండి అనేక దాడులు ఎదురైనప్పటికీ ఫూలే, ఫాతిమా షేక్ లు పాఠశాలల్లో బోధించారు. ఫూలే పై ద్వేషభావం ఎంత తీవ్రంగా పెరిగిందంటే, పాఠశాలకు వెళ్ళే మార్గంలో ఆమె పైన బురద, ఆవు పేడతో దాడులకు పాల్పడ్డారు.
మహిళల సమానత్వంతో పాటుగా సామాజిక సమానత్వం కోసం పని చేసిన వారందరిలో అంబేద్కర్ ముందు వరుసలో నిలుస్తాడు. ఆయన ఆలోచనలు, గాంధీజీ, ఇతర అనేకమంది నాయకత్వంలో సాగిన జాతీయోద్యమానికి చాలా ముఖ్యమైన లక్షణాలుగా ఉన్నాయి. కానీ హిందూ మత రాజ్య స్థాపన కోసం పోరాడుతున్న వారి ఆలోచనలకు అంబేద్కర్ ఆలోచనలు భిన్నమైనవి. ఇతర మతాల విశ్వాసాలను ఆచరించే జాతీయవాదులు కూడా ఇందుకు భిన్నంగా ఉండరనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఈజిప్ట్ లోని ముస్లిం సోదరుల నుండి ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ల వరకు, 'మహిళలకు రక్షణ అవసరం' అని అందరి గొంతులు ప్రతిధ్వనిస్తాయి. ఇక్కడ 'రక్షణ' అంటే, మహిళలను అదుపు చేసే వ్యూహం తప్ప మరొకటి కాదు.
భారత రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షునిగా వ్యవహరించిన అంబేద్కర్, మనుస్మృతిలో రూపొందించబడిన అసమానతలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక నిరసన జరిగిన సందర్భంలో మనుస్మృతి కాపీలను దహనం చేశాడు.
ఆసక్తికరంగా హిందూ ముస్లిం మతాలు రెండింటిలో సాధారణంగా పురుషులే ప్రచారకులుగా ఉంటారు. నేటికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ులో పురుషులే ప్రచారకులుగా కొనసాగుతున్న వ్యవస్థ ఉంది. మత ప్రాతిపదికన హిందూ మత రాజ్యాన్ని స్థాపించే దాని ప్రణాళికను విస్తృతం చేసేందుకు, కేవలం మహిళల కోసం మాత్రమే ఆరెస్సెస్, 'రాష్ట్ర సేవికా సమితి'ని ప్రారంభించింది. దాని పేరే పితృస్వామిక విలువలను తెలియజేస్తాయి. స్వయంసేవకుడు అంటే స్వచ్ఛంద సేవకుడు, సేవిక అంటే సేవ చేసే వారని అర్థం. 'స్వయం' అంటే 'తాను' అనేది అక్కడ లేదు. మహిళలు పురుషుల చేత రక్షించబడాలనే మనుస్మృతి ఆజ్ఞకు అది సరిపోతుంది.
మతపరమైన గ్రంథాలు స్పష్టంగా ఉండవు, మత విశ్వాసకుడు కోరుకునే విధంగా వివరణలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మత గ్రంథాల నుండి ఎవరైనా తన సౌకర్యానుసారంగా ఏ భాగాన్నైనా తీసుకొని, మిగిలిన భాగాన్ని వదిలేసే స్వేచ్ఛ ఉంటుంది. ఇందుకు భిన్నంగా జాతీయోద్యమం సమయంలో మహిళలు డిమాండ్ చేసింది, నేడు చేస్తున్నది చట్టబద్ధమైన సమానత్వాన్ని మాత్రమే. కుటుంబంలో, సమాజంలో వివక్షత లేకుండా చేయడం, ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల నిరంకుశ చర్యల నుండి భద్రత కల్పించడం, అదే మన భారత రాజ్యాంగం మనకు చేసిన వాగ్దానం.
భారత స్వాతంత్య్రోద్యమ విలువలను ప్రతిబింబించేది భారత రాజ్యాంగం మాత్రమే. ఫూలే కాలం తర్వాత పండిట్ రమా బాయి, ఆనందీ గోపాల్ లాంటి ప్రముఖులు వెలివేతలను, నిషేధాలను ప్రతిఘటించి సమానత్వ భావన కోసం పోరాడారు. ఆ తరువాత సరోజినీ నాయుడు నుండి అరుణా అసఫ్ అలీ, భికాజీ కామా, ఉషా మెహతా వరకు అనేకమంది మహిళలు జాతీయోద్యమ పోరాటంలో భాగస్వాములయ్యారు. వీరితో పాటు వేల సంఖ్యలో ఇతర మహిళలు, స్వాతంత్య్ర పోరాట వెలుగు రేఖలుగా మారేందుకు పితృస్వామిక దాస్య శృంఖలాలను తెగ్గొట్టారు.
శతాబ్దాలుగా భారతదేశం, లింగ మరియు కుల వ్యవస్థ చేతిలో బందీ అయి ఉంది. దీనిని అధిగమించడానికి, అనేక మహిళా సంఘాలు అంకిత భావంతో సుదీర్ఘ పోరాటం చేస్తున్నాయి. వారు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న అఘాయిత్యాలు, అకృత్యాలపై పోరాటం చేస్తున్నారు, ఫలితంగా సమాజంలో వారికి రెండో స్థానాన్ని ఇచ్చారు. మన సమాజంలో ఉన్న ఈ భయంకరమైన వ్యత్యాసాన్ని నిష్ణాతులైన న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి. ఒకవైపు మనకు మనుధర్మ శాస్త్రం సమర్థించే పితృస్వామ్యం ఉండగా, మరోవైపు సమానత్వాన్ని సమర్థించే అంబేద్కర్ మనకు అందించిన రాజ్యాంగం ఉంది. లింగపరమైన న్యాయం కోసం భారతదేశం నడుస్తున్న తరుణంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు, నాయకులు ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటారని ఆశిస్తున్నాను.
వ్యాస రచయిత మానవ హక్కుల కార్యకర్త
మరియు ఐఐటి బాంబేలో విశ్రాంత ప్రొఫెసర్ రామ్ పునియాని