Oct 30,2023 13:17

విజయనగరం : విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 100మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. బాధితులంతా విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం రైలు ప్రమాద బాధితులను సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు. జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, తదితరులు పరామర్శించారు. నేతలు మాట్లాడుతూ ... నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైల్వే శాఖకు శిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.50 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. గాయపడినవారికి నష్టపరిహారం పెంచాలన్నారు. రైల్వే సిగ్నల్‌ వ్యవస్థలో తీవ్రమైన లోపాలున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో సిబ్బందిని కుదించడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఆదివారంన సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, నాయకులు జి.శ్రీనివాస్‌ పరామర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు చేరుకొని క్షతగాత్రులకు అవసరమైన రక్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.