
'ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను తనకు అప్పగిస్తే...ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను' అన్నాడు వివేకానంద. నేడు ప్రపంచంలో ఏ మూలన చూసినా ఆధునాతన వైజ్ఞానిక పరిశోధనలు, నైపుణ్యం గల ఉత్పత్తులలో భారతీయ యువత పాత్ర ఎంతోకొంత వుండితీరుతుంది. దేశానికి అవసరమైన ఇనుప కండరాలు, ఉక్కునరాలు, మేధోసంపత్తి కలిగిన శక్తిగా యువతను తయారుచేసే కార్ఖానాలు విద్యాలయాలు. తమను తాము పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకుని, ఉన్నత భావాలను పెంపొందించుకునే విద్యా కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. ఇక్కడ తోటి మనుషుల పట్ల, సమాజం పట్ల తమ బాధ్యతల గురించి తెలుసుకుంటారు. విశ్వవిద్యాలయాల నుంచి ఒక తరం బయటకు వచ్చిందంటే...అది ఆ సమాజానికి అదనంగా చేకూరిన అత్యున్నత వైజ్ఞానిక సంపద. సమాజంలో అంధకారాన్ని తొలగించి, కొత్త వెలుగులు నింపేందుకు విద్యే కీలకం. అలాంటి గొప్ప సంపదను ఆర్జించేందుకు కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు వచ్చే విద్యార్థులే సమాజానికి, దేశ భవితకు తరగని నిధి. స్వాతంత్య్రోద్యమం నాటి నుంచి ఇటీవల జరిగిన సిఎఎ వ్యతిరేక ఉద్యమం వరకు విద్యార్థుల భాగస్వామ్యం, త్యాగాలు దేశం గర్వించదగ్గవి. అలాంటి యువతను సమున్నతంగా తీర్చిదిద్దే విద్యాలయాల్లో ర్యాగింగ్ ఒక మహమ్మారి.
ర్యాగింగ్ అనేది విద్యాసంస్థల్లో సీనియర్ విద్యార్థులు కొత్త విద్యార్థులను వివిధ రకాల వేధింపులకు, అవమానాలకు గురిచేసే ఒకరకమైన దాడి. ఇది బాధితులను మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎన్నో ఆశలను, బాధ్యతలను మోసుకుంటూ... మారుమూల పల్లెల నుంచి సైతం కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అడుగు పెడతారు. కొత్త వాతావరణం, కొత్త పరిసరాలు, తడబడే అడుగులతో... ఏదో సాధించాలనే తపన, ఆశయాన్ని గుండెల నిండా నింపుకున్న ఆశాజీవులు వారు. ఆ తడబడే అడుగులకు సీనియర్ విద్యార్థులు బ్రేకులు వేస్తారు. ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధించడం, అవమానించడం వంటి వికృత చర్యలకు పాల్పడుతుంటారు. 'కొంతమంది కుర్రవాళ్లు/ పుట్టుకతో వృద్ధులు/ పేర్లకీ పకీర్లు/ పుకార్లకీ నిబద్ధులు.../ తాతగారి నాన్నగారి/ భావాలకి దాసులు/ నేటి నిజం చూడలేని/ కీటక సన్యాసులు' అంటాడు మహాకవి శ్రీశ్రీ. ర్యాగింగ్ సంస్కృతి సరదాకే పరిమితం అయితే... ఫర్వాలేదు. ఎవరి భావాలకో, భావనలకో ప్రేరేపితులై ఉన్మాద చర్యలకు పాల్పడితే... ఆ ర్యాగింగ్‌కు బలైన వ్యక్తులు మానసికంగా దెబ్బతింటారు. గుండె నిబ్బరాన్ని కోల్పోతారు. ప్రాణాలను తీసుకునేవరకు తెచ్చుకుంటారు. తాజాగా జాదవ్‌పూర్ యూనివర్శిటీలో విద్యార్థి ర్యాగింగ్ వల్లే మృతి చెందాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు ఈ ఘటన చుట్టూ మతోన్మాదం, సంప్రదాయవాదం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది జాదవ్‌పూర్‌కే పరిమితమైన వ్యాధి కాదు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చేసిన ఒక అధ్యయనంలో దేశంలోని కళాశాలల్లో సుమారు 40 శాతం మంది విద్యార్థులు ఏదోక రకమైన ర్యాగింగ్‌కు గురవుతున్నారని వెల్లడైంది. క్యాంపస్ హాస్టళ్లలో ర్యాగింగ్ ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఫిర్యాదు చేసినవారి గోప్యతకు ఎటువంటి చట్టాలు లేవు. ప్రభుత్వాలు వీటిపై కఠినంగా వ్యవహరించాలి.
ర్యాగింగ్ అనేది పాశ్చాత్య సంస్కృతి. దీని ద్వారా కొత్త విద్యార్థులు, పాత విద్యార్థులు ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశం వుంటుంది. అయితే, ఈ సంస్కృతి కాలక్రమేణా వక్రీకరించబడి, హింసాత్మకంగా రూపాంతరం చెందింది. ర్యాగింగ్ వల్ల ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్న, మానసికంగా కుంగిపోతున్న ఉదాహరణలు అనేకం. విద్యార్థులు కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలను ఆవాహన చేసుకోవాలన్న ఆనందంతో విద్యాలయాల్లోకి అడుగుపెట్టాలి. కాలేజీ రోజులు, క్యాంపస్‌లో గడిపిన క్షణాలు జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా మిగలాలి. ఆనందభాష్పాలు రావాలి తప్ప... భయంతో ఒళ్లు కంపించకూడదు. 'ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము/ చదువులమ్మ చెట్టు నీడలో/ వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము/ చిలిపితనపు చివరి మలుపులో' అని ఓ కవి అన్నట్టుగా ఆనందాలను, పరిచయాలను... అంతకుమించిన విజ్ఞానాన్ని మనసంతా నింపుకొని సమాజంలో అడుగుపెట్టాలి. చదువుకున్న రోజులు జ్ఞాపకమొస్తే-ఆత్మీయ ఆలింగనం భుజం తట్టినట్లుగా వుండాలి.