- రెండేసి కేజీల చొప్పున ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
- వలంటీర్ల ద్వారా అంగీకార పత్రాల సేకరణ
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : రేషన్ లబ్ధిదారులకు అందిస్తోన్న బియ్యానికి బదులుగా రెండేసి కేజీల చొప్పున రాగులు, జొన్నలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గత నెల 28న జిల్లా కలెక్టర్లకు జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను బట్టి స్పష్టమవుతోంది. ప్రతి రేషన్ డిపో పరిధిలోనూ కనీసం పది మంది కార్డుదారులతో అంగీకార పత్రాలు తీసుకోవాలని ఆదేశించారు. వాటిలో అన్నపూర్ణ అంత్యోదయ యోజన (ఎఎవై), ప్రాధాన్యత కుటుంబాలు (పిహెచ్‌హెచ్), అన్నపూర్ణ కార్డు కేటగిరీకి చెందిన కార్డుదారులు ఉండేలా చూడాలని సూచించారు. లబ్ధిదారులు ఏమనుకుంటున్నారో గ్రామ/వార్డులంటీర్లతో సర్వే చేపట్టేందుకు సిద్ధమవుతోంది. వారి ద్వారా సేకరించిన అభిప్రాయాలతో తక్షణమే సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించింది. దీనిపై ఈ నెల ఆరున కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. రాష్ట్రంలో దాదాపు 1.40 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద కేంద్ర ప్రభుత్వం సుమారు 80 లక్షల కార్డులకు మాత్రమే బియ్యం ఉచిత అందిస్తోంది. మిగిలిన (నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) 60 లక్షల కార్డులకు సంబంధించిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ కార్డులకు కూడా ఉచితంగా బియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వచ్చింది. గత నెల వరకూ రాష్ట్ర ప్రభుతం పంపిణీ చేసే బియ్యానికి కిలో ఒక్కంటికీ రూపాయి చొప్పున వసూలు చేసేది. ఈ నెల నుంచి ఉచితం బియ్యం పంపిణీ చేస్తోంది.
అంగీకార పత్రంలో పేర్కొన్న అంశాలివే
బియ్యం కార్డు నంబరు, కార్డు యజమాని, రేషన్ షాప్ నంబరు వివరాలను సేకరించాలని ప్రభుత్వం సూచించింది. బియ్యం బదులుగా రాగులు, జొన్నలు తీసుకొనేందుకు అంగీకరిస్తున్నారా? లేదా? అనే ప్రశ్నలను పొందుపరిచింది. వాటిని రెండు కిలోల చొప్పున ఇవ్వనున్నారు. ఆ మేరకు బియ్యాన్ని తగ్గిస్తారు.
సబ్సిడీ భారం తగ్గించుకునేందుకేనా ?
పోషక విలువలున్న రాగులు, జొన్నలు అందివ్వడం మంచిదేనని, అయితే బియ్యానికి కోత పెట్టి ఇవ్వడంపైనే అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నట్లుగా లబ్ధిదారుడు బియ్యాన్ని నాలుగు కేజీలు తగ్గించుకుని రాగులు, జొన్నలు తీసుకుంటే ఆ మేరకు బియ్యాన్ని అధిక ధరకు బహిరంగ మార్కెట్లో కొనాల్సి ఉంటుంది. దీంతో, బియ్యం ధరలు పైపైకి చేరే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బియ్యం స్థానంలో క్రమక్రమంగా రాగులు, జొన్నలు పరిమాణాన్ని పెంచే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలూ వ్యక్తమవుతు న్నాయి. లబ్ధిదారుడిపై బియ్యం భారం పెరిగి ప్రభుత్వానికి సబ్సిడీ భారం తప్పుతుందనే చర్చ నడుస్తోంది.
వరి సాగు తగ్గించేందుకేనా ?
రాగులు, జొన్నల విస్తీర్ణాన్ని పెంచడానికి బియ్యం స్థానంలో వాటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం చెప్పడం ద్వారా వరి విస్తీర్ణాన్ని తగ్గించనున్నట్లుగా కనిపిస్తోంది. అధిక నీటి వినియోగం పేరుతో వరి సాగును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు రకరకాల ప్రయత్నాలు చేశాయి. రబీలో నీటిని ఇవ్వకుండా ఆంక్షలు విధించాయి. సబ్సిడీ బియ్యాన్ని నిలిపేస్తే వరి సాగు తగ్గించొచ్చని, ధాన్యం కొనుగోలుకు వేల కోట్ల రూపాయలను వెచ్చించాల్సిన భారం తప్పుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎత్తుగడగా ఉందని చర్చ సాగుతోంది.










