Mar 26,2023 06:40

'మనిషి మెదడు కూడా కంప్యూటర్‌ వంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్‌ పని చేయటం ఆగిపోయినట్టే మెదడు కూడా ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు ఆగిపోయిన తర్వాత ఏమీ ఉండదు. కన్నుమూసేలోపే మనకున్న శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చెయ్యాలి. మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువుకు భయపడటం లేదు. త్వరగా మరణించాలనీ భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి' అంటారు ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌. అంతేకాదు... 'నా శరీరం నిస్సత్తువగా కుర్చీలో కూలబడిపోవచ్చు. కానీ, నా మెదడు విశ్వాంతరాళాల్ని శోధిస్తుంది' అంటారాయన. మనిషికి ఆత్మవిశ్వాసం... తనపై తనకు నమ్మకం వుండటం అవసరం. నేను చేయగలను... సాధించగలను అన్న బలమైన నమ్మిక వుండాలి. ఆత్మవిశ్వాసం మనిషికి దివ్యౌషధం. జీవితం పూలపాన్పు కాదు. నల్లేరు బండి మీద నడక అంతకన్నా కాదు. 'కెరటం నాకు ఆదర్శం... లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు' అంటారు స్వామి వివేకానంద. ఆత్మవిశ్వాసం... మానసిక స్థైర్యంతో అనారోగ్యాన్ని సైతం జయించొచ్చని హాకింగ్‌ నిరూపించాడు. కెనడాకు చెందిన కాసిడీ మేగాన్‌ అనే యువతి మూర్ఛ వ్యాధితో తాను ఎదుర్కొన్న పోరాటాల ద్వారా పొందిన ప్రేరణతో 'పర్పుల్‌ డే' అనే ఒక రోజును సృష్టించింది.
చూడటానికి ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తూ... దారిలో నడుచుకుంటూ వెళ్తూ-ఉన్నట్లుండి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉండటం, నోటివెంట నురగలు రావడం వంటి సంఘటనలు చాలాసార్లు గమనించి ఉంటాం. ఇలా కింద పడి ఉన్న వ్యక్తులు చాలామంది కాసేపటికి తేరుకుని మళ్లీ ఏమీ జరగనట్లు వెళ్లిపోతూ ఉంటారు. దీనినే వాడుకభాషలో వాయి అని, వ్యవహారిక భాషలో మూర్ఛ అని, వైద్యపరిభాషలో ఫిట్స్‌ లేదా ఎపిలెప్సీగా చెబుతారు. దెయ్యాలు, భూతాల వలన ఇలా జరుగుతుందని ఒక అపోహ కూడా వుంది. అయితే, ఇనుప తాళాలకు, ఈ వ్యాధికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు న్యూరాలజిస్టులు. ఏం చేసినా చేయకపోయినా ఈ మూర్ఛ లక్షణం రెండు మూడు నిమిషాలకంటే ఎక్కువ వుండదు. అంతకంటే ఎక్కువ సమయం కొనసాగితే వైద్యపరమైన అత్యవసర పరిస్థితిగా గుర్తించాలి, తగిన చికిత్స అందించాలి. వాస్తవానికి ఇది నాడీకణ సంబంధిత సమస్య. తాజా అధ్యయనం ప్రకారం భారత్‌లో 1.3 కోట్ల మంది ఎపిలెప్సీతో బాధపడుతుండగా, కేవలం 29 లక్షల మందికి మాత్రమే ఒకింత చికిత్స అందింది. ప్రపంచ వ్యాప్తంగా 65 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. ప్రతి వంద మందిలో ఒకరికి ఈ వ్యాధి వున్నట్లు ఒక అంచనా. అయితే, ఈ వ్యాధి గురించి ప్రజలలో సరైన అవగాహన లేకపోవడం, అనేక అపోహలు చెలామణీలో వుండటంతో సమయానికి మందులు కూడా అందడంలేదు. ఇది ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభావితం చేయవచ్చు. ఒక్క క్షణంలో జీవితాలను మార్చనూగలదు.
'పుట్టినప్పటి నుండి పరిమళాలే లేని/ పూలెన్ని లేవు?/ గగనాన మూగి వర్షించగాలేని మే/ ఘాలెన్ని లేవు?' అంటాడు ఖలీల్‌ జిబ్రాన్‌. ఎలాంటి గుర్తింపూలేని ఒక యువతి చొరవతో చిన్నగా ప్రారంభమైన 'పర్పుల్‌ డే' ఆలోచనకు అనూహ్య మద్దతు లభించింది. పర్పుల్‌ (ఊదారంగు)డే అనేది మూర్ఛ క్యాలెండర్‌లో అతిపెద్ద అంతర్జాతీయ నిధుల సేకరణ మరియు అవగాహన దినం. 'పర్పుల్‌ డే' ప్రపంచవ్యాప్తంగా మూర్ఛవ్యాధి గురించి అవగాహన పెంచడానికి చేసే ఒక ప్రయత్నం. ఏటా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలు ఊదారంగు దుస్తులు ధరించి, మూర్ఛపై సాధారణ ప్రజల్లో అవగాహన పెంచడం, ఈ పరిస్థితికి నెట్టబడిన వ్యక్తులు ఎదుర్కొంటున్న సామాజిక కళంకాన్ని తొలగించడం, మానసికంగా వారిని శక్తివంతం చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. దీని కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు రోజులు వున్నప్పటికీ...మూర్ఛ వ్యాధిగ్రస్తులకు చేయూతనిచ్చి, సరైన చికిత్స తీసుకొని ఆరోగ్యవంతులు కావడానికి అవసరమైన మానసిక స్థైర్యాన్ని నింపడమే 'పర్పుల్‌ డే' లక్ష్యం. 'మాట చేతగా మారి/ మనిషి మనిషితో చేరి/ స్వప్నం సత్యం ఐతేనే/ స్వర్గం' అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఆ లక్ష్య చేతనలో చేయూతనందించడం మన వంతు బాధ్యత.