Mar 09,2023 06:38

వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు బిగించడంవల్ల ప్రయోజనం ఏమీలేదని శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు అధ్యయనం చేసిన ప్రయాస్‌ ఎనర్జీ గ్రూప్‌ తేల్చి చెప్పిన నేపథ్యంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్ల ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకుంటే విజ్ఞతగా ఉంటుంది. విద్యుత్‌ ఆదా కాలేదు సరికదా ప్రజాధనం వృధా అవుతోందని ప్రయాస్‌ రిపోర్టు కుండబద్దలు కొట్టింది. ఎపిఇఆర్‌సి నిర్వహించిన పబ్లిక్‌ హియరింగ్‌లో కొందరు విద్యుత్‌ నిపుణులు ఈ విషయం స్పష్టం చేశారు కూడా. ఇంత జరిగాక పునరాలోచించుకోవలసిన ప్రభుత్వ పెద్దలు ప్రయాస్‌ వారు తీసుకున్న ప్రాతిపదికలు సరికావని బుకాయింపులకు దిగడం తగదు. సర్కారువారు ఆ అధ్యయన నివేదిక పూర్తి పాఠాన్ని ఇప్పటికైనా బయటపెట్టి ఎక్కడ తప్పు జరిగిందో వివరించాలి. ఆ పని చేయకుండా విద్యుత్‌ కొనుగోలు వ్యయం ప్రాతిపదిక కాదు కాస్ట్‌ టు సెర్వ్‌ అన్న వాదనను ముందుకు తెస్తోంది. ఇది నిర్హేతుకమైనది. అదానీ కంపెనీ నుండి సోలార్‌ పవర్‌ను సెకి ద్వారా కొనుగోలు చేయడాన్ని సమర్ధించుకుంటూ ఆనాడు యూనిట్‌కు ఖర్చు రూ.2.49 పైసలని చెప్పారు. ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఖర్చు కూడా కలపలేదు. అదేమంటే కేంద్రం ఆ మొత్తాన్ని సబ్సిడీగా ఇస్తుందన్నారు. ఇప్పుడేమో కాస్ట్‌ టు సెర్వ్‌ లెక్క కట్టాలంటున్నారు. మరి టారిఫ్‌ లోనే ఉన్న క్రాస్‌ సబ్సిడైజేషన్‌ మాటేమిటి? కాబట్టి ప్రాతిపదికల్ని తమకు అనుకూలంగా చెప్పుకోవడం ప్రభుత్వాధికార్లకు అవసరమేమో కానీ అధ్యయన సంస్థలకు ఏం అవసరం? ఏ అంకెలు తీసుకున్నా అసలు విద్యుత్‌ ఆదా అవుతోందా లేదా అన్నది ముఖ్యం. అలా తేలిందా? ముమ్మాటికీ లేదు కదా! మీటర్‌ అంటే వాడే విద్యుత్‌ ఎంత అని లెక్క తేల్చేదేతప్ప వినియోగాన్ని నియంత్రించేది ఎంతమాత్రమూ కాదు. మరి సర్కారు చెప్పే ఆదా వాదనకు ప్రాతిపదిక ఏమిటి? మీటర్లు బిగించాక నెలకు ఎన్ని యూనిట్లు కరెంటు వాడారో తెలియవచ్చు. కాని, మీటర్లు బిగించక ముందు విద్యుత్‌ వాడకాన్ని ఎలా లెక్కగట్టారు? గత రెండు దశాబ్దాలకు పైగా డిస్కాములు చెబుతున్న అంచనా లెక్క. ఇది తప్పుల తడిక అని విద్యుత్‌ రంగ నిపుణులు ఎన్నో సందర్భాల్లో వివరాలతోసహా ఎండగట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని కనెక్షన్లకూ 2025 నాటికి స్మార్ట్‌ మీటర్లు బిగిస్తామని పునరుద్ఘాటించడం తగదు. వ్యవసాయ మీటర్ల ఖర్చు మాత్రమే సర్కారు భరిస్తుంది తప్ప మిగతావాటి ఏర్పాటుకయ్యే ఖర్చు ఆయా వినియోగదార్లు భరించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టర్‌ స్కీం (ఆర్‌డిఎస్‌ఎస్‌) అమలులో స్మార్ట్‌ మీటర్‌ ముఖ్యాంశం. వినియోగదార్లు ఇప్పటికే అధునాతనమైన ఐఆర్‌డిఎ మీటర్లకు డబ్బు చెల్లించి ఏర్పాటు చేసుకున్నారు. వాటిని తొలగించి, స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు వేల రూపాయలు పోసి కొనుక్కోవలసిన అవసరం సాధారణ గృహ వినియోగదారులకేముంది? కేవలం స్మార్ట్‌ మీటర్ల తయారీ పరిశ్రమలకు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు ఇటు వినియోగదారుల సొమ్ము కానీ అటు సర్కారు ఖజానా నుండి కానీ ఎందుకు చెల్లించాలి?
ప్రపంచమంతటా స్మార్ట్‌ మీటర్లకు ఎదురుగాలి వీస్తోంది. ఇటువంటి సంస్కరణల్ని తొలుత అమలు చేసిన బ్రిటన్‌లో ఇప్పుడు విద్యుత్‌, గ్యాస్‌ స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి. బిల్లులు తప్పుల తడికలుగా రావడం ఒకటైతే తమ వినియోగ వివరాలు, ఇతర సమాచారాన్ని ఆయా విద్యుత్‌ కంపెనీలు అమ్ముకుంటున్నాయని ఆరోపణలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమస్యలపై అక్కడి ప్రభుత్వం కూడా స్పందించవలసి వస్తోంది. స్వీడన్‌, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ మీటర్లపై వివాదాలున్నాయి. అసోంలో కొన్ని స్మార్ట్‌ మీటర్లు తప్పు రీడింగ్స్‌ ఇచ్చాయని సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించారు. విద్యుత్‌ సంస్కరణల్లో ముందున్న ఒడిషా, మహారాష్ట్ర వంటివి స్మార్ట్‌ మీటర్ల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. బిజెపి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించడానికి పూనుకుంటే ప్రజలనుండి ప్రతిఘటన తప్పదు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో వినాశకర విద్యుత్‌ సంస్కరణల్ని ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసిన ఆనాటి ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురైన చరిత్రను గుర్తెరగాలి!