Nov 06,2023 22:01

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రోగులకు పూర్తిస్థాయిలో చేయూత నివ్వడమే జగనన్న సురక్ష కార్యక్రమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సురక్షలో భాగంగా నిర్వహిస్తున్న శిబిరాల్లో గుర్తించిన రోగులకు వ్యాధి నయమయ్యేంతవరకు ప్రభుత్వం చేదోడుగా నిలుస్తుందని చెప్పారు. ' ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున శిబిరాలు సాధారణమైనవి కావు. శిబిరాల నిర్వహణ ముగిసిన తరువాతే అసలు పని ప్రారంభమవుతుంది. శిబిరాల్లో గుర్తించిన రోగులకు తదుపరి చికిత్స అందించాలని, వారి సమస్య నయమయ్యేంతవరకు అండగా ఉండాలని చెప్పారు. జగనన్న సురక్ష వైద్యశిబిరాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 94.94 శాతం, పట్టణ ప్రాంతాల్లో 91 శాతం ఇంటింటి స్క్రీనింగ్‌ పూర్తయిందని అన్నారు. పట్టణాల్లో ఈ నెల 22 నాటికి అన్నీ పూర్తవుతాయని వివరించారు. ప్రస్తుతం ఐదోదశ నిర్వహిస్తున్నామని, దీనిపై ఒకయాప్‌ కూడా రూపొందించినట్లు తెలిపారు. నవంబరు 5 నాటికి 85 వేల మంది పేషెంట్లను చికిత్సల కోసం నెట్‌వర్కు ఆస్పత్రులకు లేదా టీచింగ్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేసినట్లు తెలిపారు. 13,850 కేసుల్లో ఇప్పటి వరకూ చేయూతనిచ్చామని వివరించారు. అనేకమంది చికిత్స అనంతరం సెకండ్‌ రిఫరల్‌కు రావడం లేదని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ యాప్‌ ప్రతి ఒక్కరి ఫోన్లోనూ ఉండాలని సూచించారు.కంటి వెలుగు కింద 8.72 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారని, 5.22 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు సూచించారని వివరించారు. అలాగే 73,474 మందికి కంటి సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

  • ప్రభుత్వ మంచిపై అందరికీ వివరించాలి

నవంబరు 9 నుండి వైఎపి నీడ్స్‌ జగన్‌ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించాలని, దీని ద్వారా జరుగుతున్న మంచి గురించి అందరికీ తెలపాలని అన్నారు. ఇంటింటికీ ఏం జరిగింది, గ్రామానికి ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికీ వివరించాలని సూచించారు. డిబిటి, నాన్‌ డిబిటి పథకాల ద్వారా ఎంతమంది లబ్ధిపొందుతున్నారో వారికి తెలియాలని అన్నారు. అన్ని స్థాయిల్లో సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గనాలని సూచించారు.