
ప్రజాశక్తి-అమరావతి :గత ఆర్థిక సంవత్సరంలో సిఎఫ్‌ఎంఎస్ ద్వారా చెల్లింపుల వివరాలను నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకం పనుల బకాయిల బిల్లులు చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాల్ని అధికారులు పట్టించుకోవడం లేదంటూ కృష్ణా జిల్లాకు చెందిన వీరమాచినేని రామకృష్ణ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణకు పలువురు ఉన్నతాధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనరు కె శశిధర్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ ఇతరులు విచారణకు హాజరయ్యారు. బిల్లులు చెల్లించకపోవడంతో కర్నూలులో ఒక కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని హైకోర్టు వారి దృష్టికి తెచ్చింది. చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోతే ఎలా? అని ప్రశ్నించింది. సిఎఫ్‌ఎంఎస్ బకాయిల చెల్లింపుల వివరాలు కోరిన హైకోర్టు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.