ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రైతులకు బ్యాంకింగ్ సేవలను అందించే అంశంలో ఆప్కాబ్ పాత్ర అధ్వితీయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకలు శుక్రవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి సిఎం జగన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపును ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో ఆప్కాబ్ నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉందన్నారు. సహకార రంగం 60 ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ ఎంతో కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. రైతులకు దగ్గరగా సహకార బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుండే వారికి తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. 2008 ఖరీఫ్ నుంచి పావలా వడ్డీకి రుణాలు ఇప్పించే కార్యక్రమానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019లో నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసు అయిన నాబ్‌కాన్స్ (నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్) చేసి ఆప్కాబ్‌ను మరింత మెరుగైన పరిస్థితిలోకి తీసుకెళ్లేలా చర్యలను చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో సహకార సంఘాలు, రైతుల ప్రస్తుత పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా 1964 నాటి చట్టాన్ని సవరించామని చెప్పారు. అనంతరం కోాఆపరేటివ్ గవర్నెన్స్‌ను మరింత మెరుగుపరుస్తూ ఆప్కాబ్‌లో డిసిసిబిలలో ప్రొఫెషనల్స్ కూడా ఉండేటట్టు మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ఈ చర్యల వల్ల పారదర్శకత, సామర్ధ్యం మరింత పెరుగుతుందన్నారు. డిసిసిబిల సిఇఒల ఎంపిక కూడా రాష్ట్రస్థాయిలో ఒక కామన్ సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం షేర్ కేపిటల్ కింద రూ.295 కోట్లు ఇచ్చిందన్నారు. ఆప్కాబ్‌ను డిసిసిబిలను అనుసంధానం చేస్తూ మొత్తం డిజిటలైజేషన్‌ను తెస్తున్నామని అన్నారు. ఇందుకోసం రూ.24 కోట్లను కేటాయించామని తెలిపారు. ఈ నాలుగేళ్ల కాలంలో సహకార బ్యాంకుల వాణిజ్య కార్యకలపాలు 24 శాతం పెరిగాయన్నారు. 2019 మార్చి 31 నాటికి రూ.53,249 కోట్లుగా ఉన్న సహకార బ్యాంకుల పరపతి ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1,05,089 కోట్లకు చేరిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఏలూరు మినహా అన్ని డిసిసిబిలు లాభాల్లోకి వచ్చాయన్నారు. గ్రామీణ వ్యవస్థలో రైతు, గ్రామం రెండూ బాగుండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్‌బికెలకు సహకార సంఘాలను అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. రాష్ట్రంలో ఆప్కాబ్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రతిఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కాకాని గోవర్ధన్‌రెడ్డి, జోగి రమేష్, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గన్నారు.