Mar 02,2023 14:49

ప్రజాశక్తి-విఆర్‌పురం (అల్లూరి) : పెంచిన గ్యాస్‌ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం విఆర్‌పురం మండల కమిటీ ఆధ్వర్యంలో రేకపల్లి ప్రధాన కూడలి వద్ద గ్యాస్‌ సింలెండర్లతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరల ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పిజి గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50, వాణిజ్య సిలెండర్‌ రూ.350 పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిపై ప్రజలు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపు నిచ్చారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఉపాధి లేక, వేతనాలు చాలక ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ధరలు నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వం భారాలు మోపడం సిగ్గు చేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, పంక్‌ సత్తిబాబు, పులి సంతోష్‌ కుమార్‌, ఎంపీపీ కారం లక్ష్మి, గుండుపూడి లక్ష్మణరావు, ప్రకాష్‌ రావు, చందర్రావు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.