Oct 01,2022 10:33

ప్రస్తుత సమాజంలో మహిళలు రకరకాల ఒత్తిళ్లకు లోనవుతున్నారు. కరోనా తర్వాత చాలామంది మహిళలు ఉపాధి కోల్పోయారు. దాంతో సరైన పోషకాహారం అందక అనారోగ్యానికి గురవుతున్నారు. పని ప్రదేశాల్లో, కుటుంబ సభ్యుల లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. యువత మద్యానికి, మత్తుకు బానిస అవుతోంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఐద్వా ఏ విధంగా అండగా నిలుస్తుంందో ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం థావలే వివరించారు. నెల్లూరులోని డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి భవన్‌లో మూడు రోజుల పాటు ఐద్వా 15వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె ప్రజాశక్తి పలకరించింది.

              చిన్న పిల్లల మీద తెలిసిన వ్యక్తులే అత్యాచారాలకు పాల్పడుతున్నారు ? వీటిని ఎలా నిరోధించాలి ?

ఆగస్టు 15న ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ ఆ రోజే బిల్కిస్‌ భానో కేసులో నిందితులను విడుదల చేశారు. దీన్నిబట్టే అర్థమవుతుంది, దేశంలో మహిళలకు భద్రత ఎలా ఉందో! బిజెపి హయాంలో ఆడపిల్లలకు సరైన రక్షణ లేదు. ఎవరైతే ఆడపిల్లను హింసకు గురిచేస్తారో అదే గొప్ప విజయంగా బిజెపి వ్యవహరించిన తీరు చాలా సార్లు కనిపించింది. ఈ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా హింసాధోరణి పెరిగింది. అత్యాచారానికి గురైన ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా ఆవేదనకు గురవుతున్నారు. కుటుంబసభ్యులే ఆ పనిచేస్తే బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని కేసు పెట్టే ధైర్యం కూడా చేయడం లేదు. అందుకే ఈ విషయం పట్ల అవగాహన కల్పించాలని గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌ అని క్యాంపెయిన్‌ ఐద్వా నిర్వహిస్తోంది. దీనివల్ల పిల్లలు కొంత జాగ్రత్త పడతారు. బాధితులకు ఐద్వా ధైర్యం చెబుతుంది. కుంగిపోకుండా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇస్తుంది. వారు నిస్సహాయ స్థితిలోకి వెళ్లకుండా అండగా నిలుస్తుంది. వారి కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకూ వివిధ రూపాల్లో పోరాడుతున్నాం. నిందితులకు శిక్ష పడేలా చేస్తున్నాం. అంతేకాదు; కరాటే, కర్రసాము వంటి ద్వారా ఆత్మరక్షణ; కుట్టుమిషన్లు, ట్యూషన్‌ పాయింట్ల ద్వారా ఉపాధీ మహిళలకు కల్పిస్తున్నాం. వారికి తోడుగా ఉంటున్నాం.
 

ఆడపిల్ల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని చూస్తుంది. దీన్నిఏ విధంగా అర్థం చేసుకోవాలి ?

ఓ ఆడపిల్ల జీవితాన్ని తానే నిర్ణయించే విధంగా బిజెపి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆడపిల్ల పెళ్లి అనేది ఆమె వ్యక్తిగత విషయం. ఈ చట్టసవరణ స్త్రీని అణగదొక్కేది. ఐద్వా దీన్ని వ్యతిరేకించింది. కరోనా కాలంలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆడపిల్లలకు పోషించలేక 18 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేశారు. వారు ఆడపిల్లలను 7, 8 తరగతుల వరకే చదివిస్తారు. పెళ్లి విషయంలో కూడా అమ్మాయి అభిప్రాయం తీసుకోరు. అలాంటి కుటుంబాలకు రాజకీయాలు, సమాజ పోకడలు అర్థం చేసుకునే అవగాహన ఉండటం లేదు. వారికి ప్రభుత్వం ఉపాధి చూపి, అండగా ఉండాల్సింది పోయి వారిని ఇంకా ఇబ్బందులు పాలు చేయడానికి ఈ వివాహ చట్ట సవరణ చేసింది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలు పుట్టడంలో సమస్యలు తలెత్తుతున్నాయనేది ఒక సమస్యగా ఓ సర్వేలో తేలింది. ఇప్పటికే బాల్య వివాహాలను ఐద్వా అడ్డుకుంటుంది. ఆడపిల్లలను అణిచివేసేందుకు మోడీ తెచ్చే ఏ చట్టాన్నైనా రద్దు చేసేవరకూ ఐద్వా పోరాటం చేస్తుంది.
 

కరోనా తర్వాత చాలామంది మహిళలకు ఉపాధి లేకుండా పోయింది. దాంతో వారు కుటుంబ పోషణకు చాలా కష్టపడుతున్నారు? ఐద్వా ఏ విధంగా తోడుగా నిలుస్తుంది ?

కరోనా వల్ల చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయారు. అప్పుల పాలయ్యారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌ విధించింది. కానీ వారి కోసం ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదు. ఉత్పత్తి లేక పరిశ్రమలు, ఫ్యాక్టరీలు నష్టాల్లోకి వెళ్లాయి. అందులో పనిచేసే మహిళలు చాలామంది పని కోల్పోయారు. దాంతో సొంత గ్రామాలకు వలస వెళ్లారు. అక్కడ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. కాని బిజెపి ప్రభుత్వం మాత్రం ఉపాధి హామీ పథకానికి నిధులు ఇవ్వడం లేదు. పని ప్రదేశంలో సరైన సౌకర్యాలు, మంచినీళ్లు, పనిముట్లు ఇవ్వడం లేదు. రోజంతా పని చేసినా తక్కువ కూలి చూపిస్తున్నారు. చాలా సమస్యలు తలెత్తున్నాయి. కుటుంబం ఎలా గడవాలా అనే ఆలోచనతో ఆడవాళ్లు నలిగిపోతున్నారు. డబ్బులు లేక సరైన పోషకాహారం అందడం లేదు. దాంతో వారిలో ఎనీమియా (రక్తహీనత) సంభవిస్తుంది. బలహీనులుగా మారి అనారోగ్యానికి గురవుతున్నారు. కొన్నిచోట్ల కుటుంబం కోసం వ్యభిచారంలోకి దిగుతున్నారు. వీటి నుంచి బయటపడేలా ఐద్వా వారికి కౌన్సిలింగ్‌ ఇప్పిస్తుంది. ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చాలని చేస్తున్న కేంద్రంపై రకరకాల రూపాల్లో పోరాటం చేస్తున్నాం.

పల్లెల్లో, పట్టణాల్లో ఇళ్ల దగ్గర గృహిణులు భజనలు చేయడం, గుళ్లల్లో రోజుల తరబడి గడపడం ఎక్కువయింది ? దీన్నెలా అర్థం చేసుకోవాలి ?
 

మతం వ్యక్తిగత విషయం. ఎవరి నమ్మకం వారిది. కాని ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు బిజెపి అండతో మత ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. బలహీనులైన మహిళలు తమ బాధలను మర్చిపోయేందుకు దేవుడిని నమ్ముతున్నారు. దేవుళ్లే తమ కష్టాలు, బాధలను తొలగిస్తారని ప్రచారం చేయడంతో ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఈ దైవచింతనలోకి జారిపోతున్నారు. పండగ సందర్భాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు అల్లర్లు సృష్టించేలా విద్వేషాలను రగిలిస్తున్నాయి. అమాయక జనం మతం మత్తులో గొడవలకు దిగుతున్నారు. దాంతో అసలు సమస్యలు పక్కదారి పడుతున్నారు. మన సమస్యలకు పాలకులూ, చుట్టూ ఉన్న పరిస్థితులు తప్ప కనపడని దేవుళ్లు కాదని ఐద్వా చెబుతోంది. పెరిగిన గ్యాస్‌, పెట్రోలు, నిత్యావసర సరుకుల ధరల విషయంలో మహిళలతో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
 

                                        ఈ మహాసభల సందర్భంగా ఐద్వా ఏం పిలుపునిస్తోంది ?

మోడీ అధికారంలోకి వచ్చే ముందు యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చింది. పరిశ్రమలు స్థాపించి కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. కాని అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కల్పించడం అలా ఉంచితే ఉన్న వారికి కూడా ఉద్యోగాలు పోతున్నాయి. దీన్ని బట్టే యువత అర్థం చేసుకోవాలి. ఎవరు తమను మోసం చేస్తున్నారో. ఇప్పటికైనా కళ్లు తెరవాలి. మోడీని ప్రశ్నించాలి. చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, ఇంట్లో ఖాళీగా ఉండలేక బాధపడుతున్నారు. కొంతమంది అయితే హింసామార్గంలోకి వెళుతున్నారు. మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. తాగి వీధుల వెంట తిరుగుతున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వీరిని మత్తులో ఉంచుతుంది ఎవరు? ప్రభుత్వమే. వారికి ఉద్యోగం చూపిస్తే మంచిగా జీవిస్తారు కదా! దీనంతటికి కారణం మోడి అనుసరిస్తున్న విధానాలే. కొంతమందికి ఐద్వా కుట్టుమిషన్లు, బ్యూటీపార్లర్లు పెట్టించి ఉపాధి కల్పిస్తోంది. యువత కూడా తల్లిదండ్రుల ఆశయాలు తెలుసుకుని కుటుంబం పట్ల బాధ్యతగా నడుచుకోవాలి.