Jul 27,2023 21:05
  • సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేటీకరణ విధానాలు వేగవంతమయ్యాయని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యరద్శి సిహెచ్‌ నరసింగరావు అన్నారు. అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర సమావేశం గురువారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఎపి అంగన్‌వాడీ న్యూస్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ను నరసింగరావు ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో ప్రైవేటీకరణ విధానాలు వేగంగా అమలవుతున్నాయని అన్నారు. విద్యుత్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని తెలిపారు. రైల్వే, బ్యాంకు, బిఎస్‌ఎన్‌ఎల్‌ రంగాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఆగస్టు 9న అన్ని కార్మిక సంఘాలు కలెక్టరు కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేయనున్నాయని, అంగన్‌వాడీలు మద్దతు తెలిపాలని కోరారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. అంగన్‌వాడీల దశలవారీ పోరాటానికి మద్దతు ఇవ్వాలన్నారు. పెండింగ్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆధునిక సదుపాయాలు కల్పించాలన్నారు. కేంద్రాలకు ఉన్న అద్దె బిల్లులు చెల్లించాలని, ఫేస్‌ రికగ్నైజేషన్‌ నిబంధనలు సడలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ఆఫీసు బేరర్లు నాగశేషు, చంద్రావతి, ఉమాదేవి, లక్ష్మీదేవి, షీభారాణి, అనసూయమ్మ, మల్లేశ్వరి, రేఖ, ఎలిజెబెత్‌ తదితరులు పాల్గొన్నారు.