- పెంపు లేదంటూనే రూ.12,792 కోట్ల భారీలోటు చూపిన డిస్కాములు
- పవర్ ఇంటెన్సివ్ పరిశ్రమలపై రూ. 697 కోట్ల భారం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు చార్జీల విషయంపై గోప్యత పాటిస్తోంది. 2023-24 సంవత్సరానికి విద్యుత్తు చార్జీలకు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఎఆర్‌ఆర్)లను మూడు డిస్కములు నవంబర్ 30వ తేదీన సమర్పించగా వాటిని మంగళవారం నాడు ఎపిఇఆర్‌సి తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. 2023-24లో పరిశ్రమలకు రూ.697.06 కోట్లు అదనంగా వడ్డిస్తున్నట్లు, 2021-22 ట్రూఅప్ చార్జీలను వసూలు చేయనున్నట్లు డిస్కములు పేర్కొన్నాయి. గృహ వినియోగదారులతో సహా మిగిలిన అన్ని రంగాలకు చార్జీల పెంపుదలను ప్రతిపాదించలేదు. అయితే మూడు డిస్కములు కలిపి రూ.12,792 కోట్ల భారీ ఆదాయ లోటును చూపించాయి. ఆ లోటును ఏ విధంగా భర్తీ చేసుకునేది పేర్కొనలేదు. అయితే వ్యవసాయ విద్యుత్, గృహ వినియోగదారులకు రాయితీపై విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ మొత్తం ఎంత ఉంటుందో ఇప్పుడు తెలియదు. అలాగే ఈ భారీ లోటును ఎపిఇఆర్‌సి ఎంత మేర నిర్ధారిస్తుందో బహిరంగ విచారణ అనంతరమే తేలుతుంది. విద్యుత్‌ను అధికంగా వాడే (ఎనర్జీ ఇంటెన్సివ్) పరిశ్రమలకు ప్రధానంగా ఫెర్రో ఎల్లాయిస్, అల్యూమినియం తదితర పరిశ్రమలకు విద్యుత్తు చార్జీలు పెంచుతూ ప్రతిపాదించింది. అలాగే గతంలో వారికి ఉన్న కొన్ని రాయితీలను ఉపసంహరించింది.ఈ పరిశ్రమలకు గడిచిన నాలుగేళ్లుగా చౌకగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, అయితే ఇటీవల కేంద్ర విద్యుత్తు ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు వారు ఓపెన్ యాక్సిస్‌లో విద్యుత్తు ఎక్సేంజ్ నుంచి కొనడం వల్ల డిస్కములు నష్టపోతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికి ఎఆర్‌ఆర్‌లు సమర్పించినా తదనంతర కాలంలో అనుబంధ సమాచారంతో అందజేసేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కములు కోరాయి. కనుక అనుబంధం పేరుతో కొత్త వడ్డనలు కూడా ఉండవచ్చు అని నిపుణులు అంటున్నారు.










