Aug 01,2023 21:28

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం కల్పిస్తామని రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకరరావు అన్నారు. నాగరికత, అభివృద్ధికి గిరిజన ప్రజలను మరింత చేరువ చేసేందుకు కమిషన్‌ తరఫున తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మంగళవారం ఆయన స్థానిక జిల్లా పరిషత్‌ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గిరిజనుల దీర్ఘకాలిక సమస్యలు, హక్కుల పరిరక్షణ, చట్టాల పర్యవేక్షణ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై మాట్లాడారు. కమిషన్‌ తరఫున రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తామని, వారి హక్కులు, చట్టాల అమలుపై వారిలో చైతన్యం నింపుతామని ఉద్ఘాటించారు. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. వారి అభ్యున్నతికి, ఉన్నత లక్ష్యాల సాధనకు కమిషన్‌ ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ గిరిజనుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిస్తామని, పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీ, డోలీ కష్టాలు, బోయ కులస్తులను ఎస్‌టి జాబితాలో చేర్చడం, విజయనగరం జిల్లాలో ఐటిడిఎ ఏర్పాటు, గిరిజన ప్రాంతాల్లో రోడ్ల సదుపాయాలపై విలేకరులు ప్రశ్నించగా.. క్షేత్ర స్థాయి పర్యటించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.