Aug 24,2023 06:41

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై ఆగస్టు 15వ తేదీన పదవసారి జాతీయ జెండా ఆవిష్కరిస్తూ, వెయ్యి సంవత్సరాలకు గుర్తుండే ప్రణాళికలు, పథకాలు అమలు చేశామని ప్రకటించారు. 2024 ఎన్నికల్లో గెలిచి మళ్లీ ఎర్ర కోటపై తానే జెండా ఆవిష్కరిస్తానని ప్రకటించారు. ప్రైవేటీకరించిన ఎర్రకోటలో ఆగస్టు ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు కిరాయి చెల్లించింది. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న మోడీ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపానని, 2025 నాటికి మూడవ ఆర్థిక వ్యవస్థగా 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంపుదల చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం 3.72 ట్రిలియన్‌ డాలర్ల వ్యవస్థలో ఉన్నాం. కరోనా నుండి దేశంలో పరిశ్రమలు, సేవారంగంలో కోట్ల ఉద్యోగాలు తగ్గిపోయాయి. ప్రపంచంలోని 195 దేశాలలో భారతదేశం అవినీతిలో 85వ స్థానంలో, సామాజిక పురోగతిలో 127వ స్థానం, సులభతర వాణిజ్యంలో 63వ స్థానం, ప్రపంచ ఆవిష్కరణలలో 40వ స్థానం, మానవ అభివృద్ధి సూచికలో 132వ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్‌ ప్రకటించింది.
మోడీ ప్రభుత్వం గడిచిన 9 సంవత్సరాలలో 84 పథకాలను ప్రకటించింది. కానీ ప్రారంభించడమే తప్ప ఏ ఒక్క పథకం సమగ్రంగా అమలుకు నోచుకోలేదు. పట్టణ, గ్రామీణ ప్రజలకు ఆదాయాల పెంపు, బీమా సౌకర్యంతోపాటు ఉపాధి అవకాశాలు ఈ పథకాల ముఖ్య ఉద్దేశం. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ ఏర్పాటు ద్వారా దేశ అభివృద్ధికి ఆటంకం కల్పించారు. పైగా అమలుచేస్తున్న సంస్కరణల వలన దేశాభివృద్ధి నిలిచిపోవడమేకాక ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, మార్కెటింగ్‌ వ్యవస్థతో పాటు భూముల సేకరణ చేపట్టి కార్పొరేట్ల పరం చేశారు. దేశంలోని పరిశోధన కేంద్రాలన్నీ నిర్వీర్యం అయ్యాయి. టెక్నాలజీని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము. ఇక్కడి వాతావరణానికి సరిపడక వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. ప్రధాని మోడీ కాలంలో ఏటా రూ.4 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతులు చేసుకుంటున్నాము. ముతక ధాన్యాల ఉపఉత్పత్తులు, వంట నూనెలు, పప్పులు, పంచదార, పత్తితో పాటు మాంసం కూడా దిగుమతి చేసుకుంటున్నాము. ప్రణాళికా సంఘం రద్దు కావడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. దేశంలోని 7,935 పట్టణాలలో 37.70 కోట్ల ప్రజలను స్వచ్ఛ భారత్‌ పేరుతో అభివృద్ధి చేస్తామని అన్నారు. మేకిన్‌ ఇండియా పథకంతో దేశాన్ని మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా రూపొందించడంతోపాటు, డిజిటల్‌ ఇండియా పథకంతో స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌, శిక్షణ ద్వారా ఉపాధి కల్పన, సూపర్‌ కంప్యూటర్ల ఏర్పాటుకు ప్రకటించిన పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఏటా రూ.3.5 లక్షల కోట్ల విలువైన విద్యుత్‌ యంత్రాలు, విద్యుత్‌ యేతర పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాము. వాస్తవానికి ఈ సరకులు దేశంలో ఉత్పత్తి చేయడానికి తగినంత ముడిసరుకు, మానవ వనరులు ఉన్నాయి. వీటిని వినియోగించకుండా ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నార. స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా పథకాలతో విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి వనరులు కల్పిస్తున్నారు. దేశ పరిశ్రమలను మూసివేస్తున్నారు. వ్యవసాయ రంగం, పారిశ్రమిక రంగంలో 100 శాతం 'విదేశీ సంస్థాగత పెట్టుబడి' రాబట్టి వారు లాభాలు తరలించుకుపోయే విధంగా విధానాలు రూపొందించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రకటించి అందుకను గుణంగా 15 పథకాలను ప్రకటించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి మౌలిక వసతుల కింద లక్ష కోట్ల పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. కానీ అవేవీ అమలుకు నోచుకోలేదు. ఎయిర్‌ ఇండియా, బిఎస్‌ఎన్‌ఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ను లాభాల్లోకి తెస్తానన్న ప్రభుత్వం వాటిని అమ్మకానికి పెట్టింది. ఆహార అభివృద్ధిలో వెనుకబాటుతనం వలన దేశంలో 25 కోట్ల మంది దారిద్య్రంలో మగ్గుతున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ (స్వయం పోషకత్వ భారత్‌) అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి దిగజారుతున్నది. ఈ విషయం ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆర్థిక సంస్థ నివేదికలే చెబుతున్నాయి.
బానిసత్వాన్ని రూపుమాపుతామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బానిస లక్షణాలనే కొనసాగిస్తున్నది. గోవధ నిషేధం పేరుతో ఆహార విధానాలపై దాడులు, హత్యలు సాగిస్తున్నారు. తమ వ్యక్తిగత కమిట్‌మెంట్‌తో కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించామని ప్రభుత్వం ఘనంగా చెప్పినప్పటికి...మసీదులు, చర్చిలు, మైనార్టీల ప్రార్ధనా స్థలాలను కూల్చడానికి హిందూ మతం పేరుతో మూకదాడులు చేస్తున్నారు. చట్టాలలో మార్పులు తెస్తున్నారు. నాటి ఆంగ్లేయుల కాలం నాటి చట్టాలకు పేర్లు మార్చి శిక్షలను పెంచి పార్లమెంటులో చర్చించకుండానే ఆమోదిస్తున్నారు. 2047లో 100 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'అమృతకాల్‌' పేరుతో ప్రచారం చేస్తూ ప్రస్తుతం ప్రజలు అనుభవిస్తున్న స్వాతంత్య్రాన్ని హరించివేస్తున్నారు.
పట్టణాలకు వలసలు వెళ్ళిన 19 కోట్ల మంది ప్రజలు గత కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి తిరిగి గ్రామాలకు వచ్చారు. వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించలేదు. రెండు కోట్ల మందికి ఏటా ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం రైల్వే శాఖ, రవాణాశాఖ, రక్షణ శాఖలో ఉన్న కోట్ల ఖాళీలు భర్తీ చేయడంలేదు. గత 9 సంవత్సరాల 100 రోజుల పాలనలో దేశంలో నిరుద్యోగం 8 శాతం నుండి 22 శాతానికి పెరిగినట్లు ప్రపంచ బ్యాంక్‌ నివేదిక చెప్పింది. ప్రభుత్వ వ్యయంపై కాగ్‌ నివేదిక అనేక అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఏ ఒక్కటీ పాటించలేదు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా పంద్రాగస్టు జెండా ఆవిష్కరణ సందర్భంగా రానున్న 5 సంవత్సరాలలో 'విశ్వకర్మ పథకం' ద్వారా వృత్తిదారులకు రూ.13 వేల కోట్లు కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. 169 పట్టణాలలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పథకం కింద 10,000 విద్యుత్‌ బస్సులను సరఫరా చేస్తామని, 9 రాష్ట్రాలలోని 35 జిల్లాల్లో రూ.32,500 కోట్లతో బహుళ రైల్వే ట్రాక్స్‌, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, అమలుకాని పాత పథకాలతో పాటు కొత్త పథకాలను ప్రకటించారు. డిజిటల్‌ భారత్‌కు రూ.14,903 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్‌ తెస్తానని ప్రకటించారు. ఇన్ని ప్రకటనలు చేసిన కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరకుల ధరల పెరుగుదలను నిరోధించడంలో విఫలమైంది. పరోక్ష పన్నులు 32 శాతం నుండి 42.74 శాతానికి పెంచారు. కార్పొరేట్లకు ప్రత్యక్ష పన్నులు ఇతర దేశాలలో 35 శాతం ఉండగా, ఇక్కడ 25 శాతానికి తగ్గించారు. ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల కాలంలో అంతకు ముందున్న రూ.55 లక్షల కోట్లకు తోడుగా పెరిగిన అప్పులు కలిపి రూ.155 లక్షల కోట్లు అయ్యాయి. వీటికి రూ.12 లక్షల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నాము. పేదలకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకం, రైతులకు ఉపయోగపడే ఎరువుల సబ్సిడీలు పెద్ద ఎత్తున తగ్గించారు. దళిత, గిరిజన, మైనార్టీలే లక్ష్యంగా వారిపై ఆర్థిక, సాంఘిక దాడులు చేస్తున్న కేంద్రం ప్రకటించే పథకాలు ప్రజలకు భ్రమలు కల్పించడానికే తప్ప ఆచరణలో అమలు జరగడం లేదు. ప్రధాని మోడీ ప్రభుత్వ పథకాలు నీటిమూటలుగా మారాయి.

1

 

 

 

 

 

 

సారంపల్లి మల్లారెడ్డి