Aug 08,2023 13:18

మహిళా పోరుయాత్ర నేటితో ముగింపు
బహిరంగ సభకు హాజరు కానున్న బృందాకరత్‌


ప్రజాశక్తి - యంత్రాంగం : మహిళలు, బాలికలు, చిన్నారులపై రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, హింసను నిరోధించాలని, మద్యాన్ని, అశ్లీల సాహిత్యాన్ని నియంత్రించాలని ఐద్వా నేతలు డిమాండ్‌ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రారంభమైన 'మహిళా పోరుయాత్ర' సోమవారం గుంటూరు, పల్నాడులో, విశాఖపట్నం నుంచి ప్రారంభమైన యాత్ర విజయవాడలో కొనసాగింది. విజయవాడ దుర్గాపురంలో ప్రారంభమైన యాత్ర ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల, భానూనగర్‌, మధురానగర్‌ (కొబ్బరితోట), శారదా కళాశాల, సింగ్‌నగర్‌ 58వ డివిజన్‌, లూనా సెంటర్‌, వాంబే కాలనీ, కండ్రిక, రాజీవ్‌నగర్‌, ఆర్‌ఆర్‌ పేటలో కొనసాగింది. ఆయా సెంటర్లలో నిర్వహించిన సభల్లో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ.. మోడీ హయాంలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం మద్యం నియంత్రణ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి, నాలుగేళ్లు అయినప్పటికీ నియంత్రణ చేయలేదని విమర్శించారు. మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. ఐద్వా ఉపాధ్యక్షులు పూర్ణ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో యాత్ర కొనసాగింది. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన సభలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న హింసను అధ్యయనం చేయడానికి తక్షణమే కమిషన్‌ నియమించాలని కోరారు. కమిషన్‌ సిఫార్సుల మేరకు హింసను నివారించడానికి మహిళా సంఘాల సూచనలు తీసుకొని విధివిధానాలు రూపొందించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చిలకలూరిపేటలో నిర్వహించిన సభలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి మాట్లాడుతూ.. మణిపూర్‌ ఘటన దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను సిగ్గుపడేలా చేసిందన్నారు. ప్రధాని ఇప్పటికీ ఆ ఘటనపై పార్లమెంట్‌లో నోరుమెదపకపోవడం దారుణమన్నారు. విజ్ఞాన మందిరంలో నిర్వహించిన సభలో మహిళల సమస్యల మీద ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు డి శ్రీనివాసకుమారి తదితరులు పాల్గొన్నారు.