Aug 17,2023 06:32

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం రావాలంటే ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తోంది. నాగావళి నదిని దాటాల్సి రావడమే ఇందుకు కారణం. దాంతో ఈ మండలంలోని 31 పంచాయితీలకుగాను 9 పంచాయితీలకు చెందిన 22 గ్రామాల ప్రజలు, పరోక్షంగా మరో 40 గ్రామాల గిరిజనులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
1996లో రెబ్బ-వనధార సమీపంలోని వనిజ గ్రామం వద్ద నాగావళి నదిని దాటుతుండగా నాటు పడవ మునిగిపోయి 36 మంది గిరిజనులు మృతి చెందారు. ఈ ఘటన జరిగి ఇప్పటికి 27 సంవత్సరాలైనా వీరి కష్టాలు మాత్రం తీరలేదు. ఈ నెల నాల్గవ తేదీన అనారోగ్యంతో బాధపడుతున్న రెబ్బ గ్రామ బాలిక కోలక మరియమ్మకు వైద్యం చేయించేందుకు ఆమె తల్లిదండ్రులు, గ్రామస్తులు తెప్ప కట్టి నాగావళి నదిని దాటి ప్రాణం కాపాడుకు న్నారు. అదే వరద ఉధృతి ఎక్కువగా ఉంటే ప్రాణనష్టం జరిగేది. నది అవతల గ్రామాల ప్రజలు కొమరాడ మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు పనులు నిమిత్తం రావాలంటే సుమారు 70 కిలోమీటర్ల దూరం కురుపాం, పార్వతీపురం మీదుగా తిరిగి రావాల్సిన దుస్థితి. అదే నాగావళి నదిపై వంతెన నిర్మిస్తే ఆ భారం పూర్తిగా తగ్గిపోతుంది. 1996లో పడవ మునిగిపోయిన సందర్భంలో అప్పటి ప్రభుత్వం గిరిజనుల కష్టాలు తీర్చడానికి పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి మరిచింది. ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని సిపిఎం ఎమ్మెల్యే అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు రూ.3.50 కోట్లు నిధులు మంజూరై పనులు ప్రారంభించారు. పద్నాలుగేళ్లయినా నేటికీ వంతెన మాత్రం పూర్తి కాలేదు. పెండింగ్‌ పనుల విషయంలో పాలకులకు చిత్తశుద్ధి లేదు. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇది పూర్తిగా పాలకుల నిర్లక్ష్యంగానే కనిపిస్తోంది.
ఈ ఏడాది జూన్‌లో కురుపాం నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్‌... మూడు మండలాలను కలిపి పలు గ్రామాలకు ఉపయోగపడే ఈ బ్రిడ్జి నిర్మాణం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఒడిశా ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కరడ గ్రామం సమీపంలో వనిజ గ్రామం దగ్గర రెండేళ్లలోనే బ్రిడ్జి పూర్తి చేసింది. మన రాష్ట్రంలో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పార్టీలకతీతంగా ఐక్యంగా పోరాడాలి. ఇప్పటికైనా పాలకులు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రూ.14 కోట్ల నిధులు కేటా యించి కాంట్రాక్టర్‌ను రప్పించి వంతెన పనులు పున:ప్రారంభించాలి. పూర్ణపాడు-లాబేసు వంతెన పోరాట సాధన కమిటీ అందుకుగాను ఈ నెల 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు మండలంలోని కోమట్లపేట గ్రామం దగ్గర రిలే నిరాహారదీక్షలు చేపట్టనుంది. 28వ తేదీ ఉదయం 10 గంటలకు కొమరాడలో నిరసన ర్యాలీ, తాశీల్దార్‌ కార్యాలయం దగ్గర ధర్నా జరగనున్నాయి. ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటేనే పాలకులు దిగొస్తారు. పోరాటం జయప్రదం అవుతుంది.

- వి. ఇందిర,సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు,
పార్వతీపురం మన్యం జిల్లా.