Oct 23,2022 06:50

తెలుగు రాష్ట్రాలలో భిన్న సమీకరణాల సంకేతాలు, రాజకీయ సందేహాలు పరిపరివిధాల పరిభ్రమిస్తున్నాయి. మీడియాలో, సోషల్‌ మీడియాలో విపరీతంగా చలామణి అయ్యే అంశాలలో ప్రజల వాస్తవ సమస్యలకూ వాటిలో సమాధానం వుండటం లేదు. పాలక పక్షాల ప్రచారాలు, ప్రభుత్వంలోకి రావాలనే ప్రతిపక్షాల ఆరాటాలే ప్రధాన భాగం ఆక్రమించడంతో విధానపరమైన దీర్ఘకాలిక అంశాలు మరుగున పడిపోతున్నాయి. జాతీయ పార్టీలూ అనేక ప్రాంతీయ పార్టీలైనా కూడా రాజ్యాంగ సైద్ధాంతిక కోణాలను పక్కన పెట్టేసి వచ్చే ఎన్నికలలో మనుగడ కోసమే తాపత్రయ పడుతున్నాయి. గతంలో తమ రాష్ట్రానికి, ప్రాంతానికి పరిమితమైన నేతలే పరిస్థితి తీవ్రత బట్టి జాతీయాంశాలు ముందుకు తేకతప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపున జాతీయ స్థాయిలో చక్రం తిప్పామనే నేతలు కొందరు స్థానిక లెక్కల్లోనే సంచరిస్తున్నారు. జాతీయ పార్టీల నేతలే రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడుతూ గందరగోళం పెంచుతున్నారు. వ్యక్తిగత దూషణలు పరాకాష్టకు చేరుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చర్చలో పరస్పర ప్రభావం కూడా గతం కంటే ఎక్కువగా ముందుకొస్తోంది. ఈ మధ్యలో అటూ ఇటూ పార్టీలు మారే నేతల యాత్రలు ఎడతెగని ప్రహసనంగా తయారైనాయి. ప్రజా ఉద్యమాలు, ఉద్యోగ కార్మికులు గ్రామీణ ప్రజల పోరాటాలకు ఉద్యమాలపై పాలకుల నిర్బంధం, పాలక పార్టీల ఉపేక్షా భావనే కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రస్ఫుటమవుతున్న రాజకీయ వైరుధ్యాలు, సామాజిక వైషమ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎ.పి లో ఎడతెగని రాజధాని సమస్యపై బాధిత రైతుల పాదయాత్రలూ, ప్రభుత్వ మద్దతుతో విశాఖ గర్జనల మధ్య ఉద్రిక్తతలు కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక రాజకీయ పునస్సమీకరణకు సంకేతమవుతుందని భావిస్తున్నారు. మునుగోడు లోనూ రాజకీయ ప్రత్యర్థుల ప్రచారాలు తీవ్ర భాషలోనే నడుస్తున్నాయి.
ఎ.పి తాజా పరిణామాలు
విశాఖ గర్జన, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ జనవాణి నేపథ్యంలో జరిగిన పరిణామాలు ఇప్పటికే ప్రజాశక్తిలో ప్రస్తావనకు వచ్చాయి. ఆ సందర్భంగా విశాఖలో టిడిపి, బిజెపి ప్రధానంగా కలసి సంఘీభావం చెప్పాయి. అందుకు పోలీసులు, ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పిన సిపిఎం...జన సైనికులు రాళ్లు వేయడాన్ని, ఆ పేరిట పలువురు అమాయకుల అరెస్టులను కూడా ఖండించింది. కేంద్రంలోని బిజెపి ఇటు అమరావతి విషయంలోనూ అటు విశాఖ ఉక్కుతో సహా ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న తీరునూ ప్రస్తావించింది. విశేషమేమంటే జనసేన, టిడిపి ఎక్కడా బిజెపిపై విమర్శ లేకపోవడం. ఈ ఘటనల తర్వాత విజయవాడ వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ తన ప్రసంగంలో చెప్పు చూపించి వైసిపి పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో మీడియాలో విపరీత ప్రచారం పొందింది. వైసిపి నాయకులు, మంత్రులు తనపై వ్యక్తిగత దూషణను తీవ్రంగా ఖండించే, ప్రతిఘటించే హక్కు ఆయనకు వుంది. అయితే చెప్పులు, తిట్లు, అభ్యంతరకరమైన ప్రతి సవాళ్లు, అందులోనూ మహిళలకు సంబంధించి పొరబాటు సంకేతాలిస్తాయని చెప్పక తప్పదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌తో సహా ఇదే భాషలో మరింత తీవ్రంగా ప్రతిస్పందించడం వివాదాన్ని కొనసాగించడానికే కారణమవుతోంది.
ఈ తగాదాల కన్నా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ వ్యాఖ్యలు మరింత కీలకమైనవి. బిజెపి తనకు రోడ్‌ మ్యాప్‌ ఇవ్వలేదు గనక వ్యూహం మార్చుకోవలసి వస్తోందని ఆయనన్నారు. మతతత్వానికి, నిరంకుశ పోకడలకు మారుపేరైన బిజెపి ఎ.పి కి ప్రత్యేకంగా అన్యాయం చేస్తోందని అందరికీ తెలుసు. ఇదే పవన్‌ గతంలో ప్రత్యేక హోదాపై రౌండ్‌ టేబుల్‌ నడిపారు కూడా. హోదా ఎగ్గొట్టి కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజిని పాచిపోయిన లడ్డూ అన్నారు. విశాఖలోనూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారు. అది కమ్యూనిస్టులతో కలసి వున్నప్పటి మాట. బిజెపితో జట్టు కట్టాక కేంద్రంపై ఆయన పూర్తిగా మౌనం దాల్చారు. బిజెపి తనను పూర్తిగా విస్మరిస్తున్నా ఉప ఎన్నికలలో వారికే మద్దతిచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి లేదా ఒప్పించి రాష్ట్రానికి ఒకటంటే ఒక సదుపాయం సాధించలేకపోయారు. ఇప్పుడు వ్యూహం మార్చుతున్నానంటూనే బిజెపి పైన మోడీ పైన పూర్తి గౌరవం వుందని తాము వారికి వ్యతిరేకం కాదని సెలవిచ్చారు. బిజెపికి విధేయపూర్వకమైన ఈ వ్యాఖ్యలు పవన్‌ మాటలను అతిగా అంచనా వేసేవారికి కనువిప్పు కలిగించాలి. జనసేన నాయకులు కూడా చర్చలలో తాము కలిసి వున్నామనే చెబుతున్నారు. బిజెపి ముఖ్య నేతలూ తమ పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత మళ్లీ బిజెపికి దగ్గరవాలని తహతహ లాడుతున్న టిడిపి, జనసేనకు కూడా ఎప్పుడూ సంకేతాలు పంపుతూనే వుంది. ఈ సందర్భాన్ని వెంటనే ఉపయోగించుకుని రంగంలోకి దిగిన చంద్రబాబు పవన్‌కు సంఘీభావం చెప్పడమే గాక తాము ఉభయులం కలసి ఎ.పి లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. బిజెపి నుంచి వామపక్షాల వరకూ ఒక తాటిపైకి తెస్తామని వారు చెబితే అదేదో నిజమైనట్టు కొన్ని మీడియా సంస్థలు విపరీతమైన హైప్‌ ఇచ్చాయి. చరిత్రే మారిపోతోందన్నంత మోతమోగించాయి. పవన్‌, చంద్రబాబు ఉభయులూ కూడా బిజెపి పేరెత్తక పోవడాన్ని మాత్రం ప్రశ్నించలేదు. సిపిఎం నాయకులు రాఘవులు, శ్రీనివాసరావు తదితరులు పవన్‌ మాటల్లోని డొల్లతనాన్ని ద్వంద్వత్వాన్ని సూటిగానే ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాలపై నిర్బంధం, సమస్యలపై తప్పు నిర్ణయాలను ఖండించడంలో కలసి పాల్గొన్నా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే ఒక సిద్ధాంతరహితమైన రాజకీయ కూటమి కట్టడం జరిగేపని కాదని వారి మాటలు స్పష్టం చేశాయి. టిడిపి హయాంలోనూ ఉద్యమాలపై సాగిన నిర్బంధం కూడా గుర్తుచేసుకోవలసిందే. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఈ కొత్త కూటమితో కలసి పని చేస్తామని అంటూనే బిజెపిపై పవన్‌ స్పష్టత ఇవ్వాలన్నారు. నిజానికి టిడిపి మరింత స్పష్టంగా బిజెపి మాట దాటవేస్తోంది. 2018లో వారి నుంచి విడిపోయి ధర్మయుద్ధం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చేస్తే అంతా అయిపోయినట్టేనన్నట్టు మాట్లాడుతున్నారు. కేంద్రంపై తానుగా పోరాడని వైసిపి గతంలో మోడీపై చంద్రబాబు విమర్శలు గుర్తు చేస్తోంది. మొత్తంపైన ఇవి తాత్కాలిక రాజకీయావసరాల వ్యూహాలు తప్ప నిబద్ద రాజకీయాలు కాజాలవు. తమాషా ఏమంటే పవన్‌ను నమ్మడానికి లేదని చెప్పే వాళ్లు టిడిపి శిబిరంలోనూ చాలామంది వున్నారు. అందువల్ల టిడిపి, జనసేన కలయికను పెద్ద మలుపుగా చెప్పడం వాస్తవికత అనిపించుకోదు. బిజెపి లోని టిడిపి, వైసిపి అనుకూల లాబీలు అటూ ఇటూ లాగుతున్నాయనే కథనాలున్నాయి. ప్రధాని మోడీ చంద్రబాబును దూరంగానే వుంచాలని భావిస్తున్నారని ఇప్పటికి ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా ఎన్నికల ప్రకటన నాటి పరిస్థితినిబట్టి ఏదైనా తేలుతుంది. ఎంతో దూరంలో వున్న ఎన్నికల పొత్తులపై ఊహాగానాలు చేసే బదులు ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, రాజధాని, పోలవరం, విశాఖ ఉక్కు వంటి అంశాలపై అందరూ కలసి పోరాడటం ముఖ్యం.
తెలంగాణ లోనూ ప్రశ్నలు
ఇదే సమయంలో ఎ.పి లో జోడో యాత్రకు వచ్చిన రాహుల్‌ గాంధీ 2024 తర్వాత అవసరమైతే జగన్‌ సహాయం తీసుకోవడం గురించి ప్రశ్నించగా జవాబు దాటేశారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి టిఆర్‌ఎస్‌, బిజెపి రెండూ ఒకటేనన్నట్టు కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్నది. వాస్తవానికి కెసిఆర్‌ ప్రభుత్వంపైనే అత్యధికంగా దాడి చేస్తూ బిజెపిపై పోరాటాన్ని రెండో స్థానంలో వుంచుతోంది. రాష్ట్రంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్‌తో సహా ఈ పార్టీలు కోరుతున్నాయి. బిజెపిలో దూకిన కాంగ్రెస్‌ నేత రాజగోపాల్‌ రెడ్డిని ఓడించేందుకు మునుగోడులో ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకరరెడ్డికి మద్దతునిస్తున్నాయి. బిజెపిపై తీవ్ర రాజకీయ విమర్శ చేస్తున్న కెసిఆర్‌ జాతీయ పార్టీ బిఆర్‌ఎస్‌గా మార్చి దేశమంతటా పోరాడతానంటున్నారు. అయితే కెసిఆర్‌ బిజెపిపై పోరాటం విషయంలో స్పష్టతనివ్వాలని సిపిఐ నాయకులు నారాయణ కోరారు. ఈ పోరాటంలో కాంగ్రెస్‌ స్థానమేమిటో కూడా చెప్పాలంటున్నారు. కాంగ్రెస్‌ విషయంలో కెసిఆర్‌ దాటవేత నిజమే అయినా ఈ దశలో దాన్ని షరతుగా పెట్టడం జరిగేది కాదు. పైగా కాంగ్రెస్‌ కూడా తన గెలుపే కీలకమైనట్టు వ్యవహరించడం కేరళ నుంచి తెలంగాణ వరకూ కనిపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు రోజుకో దాడి చేస్తూ రాజకీయ వ్యాపార వర్గాలపై ఒత్తిడి పెంచుతుంటే బిజెపి నేతలు ముందే వాటి గురించి సూచనలిస్తున్నారు. ఈ దాడులకు గురవుతున్న వారిలో ఎ.పి ప్రముఖులూ వున్నారు. బిఆర్‌ఎస్‌ ఎ.పి లోనూ పోటీ చేస్తుందా అనే చర్చ ఒకటైతే ఇరు రాష్ట్రాల నేతలూ గతంలో లాగా రెండు చోట్ల విషయాలు కలగలపి చర్చ చేస్తున్నారు. వై.ఎస్‌ షర్మిల రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించడమే గాక ఢిల్లీకి వెళ్లి సిబిఐకి ఫిర్యాదు చేసి వచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో పోటీ ప్రకటించారు. అయితే గతంలో పోటీ ప్రకటించి బిజెపి ఒత్తిడితో వెనక్కు తగ్గిన ఆయనగాని చంద్రబాబుగాని ఇప్పుడు బిజెపికి ఉపయోగపడే పాత్ర పోషిస్తారా అన్నది ప్రశ్నగానే వుంది.
వచ్చే ఎన్నికల తర్వాతనే
తెలంగాణలో బాగా బలహీనపడిన టిడిపిని బలోపేతం చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఇటీవల సమావేశాలు జరిపారు. ఆ పార్టీ మునుగోడులో పోటీ చేస్తామని సూచనలిచ్చి వెనక్కు తగ్గింది. కొన్ని చోట్ల ప్రచారంలో జెండాలతో టిడిపి కార్యకర్తలు కనిపిస్తున్నారు. టిడిపి నుంచి వెళ్లి టిపిసిసి అధ్యక్షుడైన రేవంత్‌ రెడ్డి అంతర్గత అనైక్యతతో తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటూ కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. 2018లో మహా కూటమిగా ఏర్పడి పూర్తిగా దెబ్బతిన్న చంద్రబాబు అవే రాజకీయాలు పునరావృతం చేయాలనుకుంటున్నారని టిఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. రాష్ట్రానికి రావలసిన నిధులు కేంద్రం విడుదల చేస్తే మునుగోడులో పోటీ నుంచి తప్పుకుంటామని మంత్రి కెటిఆర్‌ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యను సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తప్పు పట్టారు. ఇది రాజకీయ విధాన సమస్య తప్ప మునుగోడుకో లేక తెలంగాణకో పరిమితమైంది కాదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు టిఆర్‌ఎస్‌ను బలపర్చడాన్ని షరామామూలుగా కొన్ని శక్తులు అవహేళన చేయడం జరుగుతున్నా లౌకిక వాదులు హర్షిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో అన్ని చోట్ల కాలూనేందుకు మోడీ,షా లు పాచికలు వేస్తున్న పూర్వరంగంలో మునుగోడు ఎన్నిక ఫలితం కీలకమవుతుంది. ఇతర పార్టీల మల్లగుల్లాలు, రాజకీయ లెక్కలు కూడా ఈ ఏడాది కీలక రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఒక కొలిక్కి రావచ్చు. అయితే, మోడీ ప్రభుత్వ కేంద్రీకృత పెత్తనం, మతతత్వ రాజకీయాలు, కార్పొరేట్‌ విధానాలు మాత్రం మారేవి కావు గనక వాటిని ప్రతిఘటించడం అనివార్యం.

ravi

 

 

 

 

తెలకపల్లి రవి