Jun 08,2023 06:35

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెప్పబడుతున్న ప్రతిష్టాత్మక పోలవరం కథ మరోమారు గందరగోళంలో పడింది. అందుకు కారణమైంది మళ్లీ కేంద్ర బిజెపి ప్రభుత్వమే. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తులో నీరు నింపడానికి ఇంకా ఎన్ని నిధులు కావాలో అంచనా వేసిన కేంద్ర ఆర్థికశాఖ రూ.12,911 కోట్ల విడుదలకు సోమవారం మెమో జారీ చేసి, ఈ నోట్‌ను జలశక్తి మంత్రి మండలిలో ఆమోదింపజేసుకోవాలంది. ఆ మరుసటి రోజునే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పోలవరాన్ని సందర్శించి అక్కడే అధికారులతో సమీక్ష జరిపి ప్రాజెక్టు తొలిదశ పూర్తికి కేంద్రం నిధులిస్తున్నందున ఇక సమస్య ఉండదని, నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని ఆదేశించారు. అన్నీ అనుకూలిస్తే 2025 జూన్‌కు ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు తెలపగా, అంతకంటే ముందు ఎందుకు పూర్తి చేయలేమని సిఎం ప్రశ్నించారు. గడువుల సంగతెలా ఉన్నప్పటికీ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం ద్వారా జాతీయ ప్రాజెక్టు హోదా సంతరించుకున్న పోలవరం విషయంలో కేంద్రానిది వంచనల మీద వంచన. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తారన్న ప్రచారానికి కేంద్రం చర్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. 41.15 మీటర్ల ఎత్తులో నీరు నిలపడం అనేది ప్రాజెక్టు నిర్మాణంలో తొలిదశ అని స్పష్టత ఇవ్వలేదు.
తొలి నుంచీ పోలవరం ప్రాజెక్టులో అన్యాయానికి, వివక్షకు గురవుతున్నది భూములు, ఊళ్లు, ఇళ్లు, సర్వం కోల్పోతున్న లక్షలాది మంది నిర్వాసితులు. నిర్వాసితుల్లో సింహభాగం గిరిజనులే. నిర్వాసితులకు సహాయ పునరావాసం తన భాధ్యత కాదని తరచు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. భూముల్లేకుండా ప్రాజెక్టులు గాలిలో కడతారేమో కేంద్రమే చెప్పాలి. తాజాగా పోలవరం నిధులపై కేంద్రం జారీ చేసిన మెమోలో ఎక్కడా నిర్వాసితుల పునరావాసం ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లైడర్‌ సర్వే ప్రకారం 41.15 మీటర్ల ఎత్తులో నీరు నిలపాలంటే అదనంగా 36 గ్రామాల్లోని 16,642 కుటుంబాలను తరలించాలి. వారి పునరావాసానికి నిధులేవి? నిర్వాసితుల బాధ్యత తనది కాదని కేంద్రం మరొకసారి చెప్పకనే చెప్పింది. ముఖ్యమంత్రి మాత్రం నిర్వాసితులకు షెడ్యూల్‌ ప్రకారం పునరావాస కాలనీలు నిర్మించాలని, వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు మినహా కేంద్రం దుర్మార్గంపై దాటవేశారు. ఎన్నికల సమయంలో రూ.10 లక్షల ప్యాకేజీ ఇస్తామన్న హామీపై సి.ఎం. స్పష్టత ఇవ్వలేదు. 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్యాకేజీ అమలు చేయాలన్న డిమాండ్‌పై స్పందించలేదు. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడబలుక్కొని ప్రాజెక్టు నిర్మాణానికి తమ సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులను అనాథలు చేయడం క్షమించరానిది. ఈ మోసపూరిత చర్యలను ప్రజలు ప్రతిఘటించడమే మార్గం.
పోలవరం నిర్మాణ అంచనా 2010-11లో రూ.16 వేల కోట్లు. 2013-14 కొచ్చేసరికి 20 వేల కోట్లు. 2017-18లో జలమండలి సాంకేతిక సలహా కమిటీ రూ.55 వేల కోట్లకు ఓకే చేసింది. కేంద్ర రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ 47 వేల కోట్లకు అంచనాలు కుదించింది. ఎవరు ఏ అంచనా వేసినా నిర్వాసితులైన 1.06 లక్షల కుటుంబాల సహాయ పునరావాసానికి రూ.30 వేల కోట్లవుతుందని తేల్చారు. ఆ నిధులు కేంద్రమే ఇవ్వాలి. ఇప్పటికీ కేంద్రం ఆ ఊసెత్తట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా అడగట్లేదు. వీరి దోబూచులాటలో నిర్వాసితులు బలవుతున్నారు. వర్షాకాలం వచ్చేసింది. గోదావరికి వరదొస్తే నిర్వాసితుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. గతంలో వచ్చిన చిన్న వరదలకే ఇళ్లు, ఊళ్లే కాదు పునరావాస కాలనీలూ మునిగాయి. కాంటూరు లెక్కల్లో అశాస్త్రీయత వలన అంచనాల కంటే ఎన్నో రెట్ల ముంపు సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో దశలవారీ నిర్వాసితుల తరలింపునకు ప్రాతిపదిక ఉండదు. ప్రాజెక్టు నిర్మాణానికంటే ముందు నిర్వాసితులకు చట్టాలను, ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నెరవేర్చాలి. పాలకులు ఇంకే మాటలు చెప్పినా అవి నీటి మీద రాతలే! ప్రాజెక్టు నిర్మాణానికి డెడ్‌లైన్లు పెడుతూ నిర్వాసితులను గాలికొదిలేసే చర్యలు విడనాడాలి.